Medigadda Barrage: మేడిగడ్డ పై సీబీఐ విచారణ.. బిజెపి అసలు టార్గెట్ అదేనా?

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ కమిటీకి బదులు ఆ విచారణ బాధ్యతను సిబిఐ కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజానిజాలు తేలుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో సిబిఐ అనేది బిజెపి పంజరంలో చిలుకలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : February 17, 2024 7:55 am
Follow us on

Medigadda Barrage: ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గతంలో పార్టీని వదిలిపోయిన నేతలు మొత్తం మళ్లీ చేరేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో ఒక వెలుగు వెలిగిన నాయకులు మొత్తం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నుంచి నాయకులు కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఉంది. మరోవైపు రాష్ట్రంలో మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కుంగిన పిల్లర్ల వ్యవహారం పై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం గోదావరి నీటితో ఈ ఎత్తిపోతల పథకాన్ని నింపితే పూర్తిగా కొట్టుకుపోతుందని అధికారుల బృందం తేల్చి చెప్పింది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టుల మీద భారత రాష్ట్ర సమితి నల్లగొండ వేదికగా ఇటీవల భారీ సభను నిర్వహించింది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం యాత్రను చేపట్టింది. ఇరు పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకున్నాయి.. ఈ వ్యవహారంలో బిజెపి అనేది పెద్దగా సోయిలో లేకుండా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో బిజెపి వాయిస్ వినిపించకపోవడం ఒకరకంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ కమిటీకి బదులు ఆ విచారణ బాధ్యతను సిబిఐ కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజానిజాలు తేలుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో సిబిఐ అనేది బిజెపి పంజరంలో చిలుకలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకులపై సిబిఐ ని ఉపయోగించి బిజెపి రాజకీయాలు చేస్తోందనే విమర్శలున్నాయి. అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వ శర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రతిపక్షాల నాయకుల పై బిజెపి ఎలా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులను ఎలా ప్రయోగించిందో.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి కోరినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ వ్యవహారాన్ని సిబిఐ చేతికిస్తే.. దీనికి సంబంధించి కెసిఆర్ తో రాజకీయం నడుపుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని కేంద్రం తమను ఇబ్బంది పెడుతుందని వారు ఉదహరిస్తున్నారు. “అంతర్వేదిలో రథం దగ్ధమైతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ కేసును సిబిఐకి అప్పగించారు. అప్పట్లో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి నాయకులు కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసును విచారణ పేరుతో సాగదీస్తోంది. అంతేతప్ప ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. అలాంటప్పుడు మేడిగడ్డ విషయంలో పారదర్శకంగా విచారణ జరుగుతుంది అనే నమ్మకం ఏమిటి?” అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మేడిగడ్డ విషయంలో విజిలెన్స్ కమిటీ అధికారులు రెండు దఫాలుగా విచారణ సాగించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రెండుసార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ సంస్థ, గత ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాన్ని విజిలెన్స్ అధికారులు తెలుసుకున్నారు. మేడిగడ్డ నిర్మాణం లోప భూయిష్టంగా ఉందని గుర్తించారు. ఇప్పటికిప్పుడు గోదావరి నీటిని నింపితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతితో సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు సిట్టింగ్ జడ్జి ఇచ్చే నివేదిక ఆధారంగా మేడిగడ్డ వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా మేడిగడ్డపై సిబిఐ విచారణకు కిషన్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇటువంటి కౌంటర్ ఇవ్వలేదు.. అంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించబోతున్నారా? అలా అయితే కెసిఆర్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే..