https://oktelugu.com/

TDP Janasena Alliance: టీడీపీ+జనసేన కూటమి.. జగన్ ను ఓడించగలదా?

పవన్ తాజా ప్రకటన పై జనసేనలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. టిడిపి తో జనసేన కలవడం ఇష్టం లేకున్నా.. అనివార్యమైన పరిస్థితి కావడంతో జనసైనికులు పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేవు.

Written By:
  • Dharma
  • , Updated On : September 14, 2023 / 05:02 PM IST

    TDP Janasena Alliance

    Follow us on

    TDP Janasena Alliance: రాజకీయంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపితో కలిసి నడవాలని డిసైడ్ అయ్యారు. సరిగ్గా చంద్రబాబు జైల్లో ఉండగా విస్పష్ట ప్రకటన చేశారు.అయితే ఈ నిర్ణయం ఇంత త్వరగా వెలువడడానికి సీఎం జగనే కారణం. చంద్రబాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టారు కాబట్టి.. పవన్ ప్రకటన చేయాల్సి వచ్చింది. లేకుంటే ఒకటి, రెండు నెలలు జాప్యం జరిగి ఉండే అవకాశం ఉండేది. కానీ జగన్ చర్యలు పుణ్యమా అని జనసేన, టిడిపి మధ్య పొత్తు ఖరారు అయ్యింది. అయితే ఈ పాటికే వారి
    మధ్య పొత్తు ఎప్పుడో ఖరారు అయ్యిందని.. చంద్రబాబు అరెస్టు కేవలం ఒక కారణంగా నిలిచిందని వైసీపీ శ్రేణులు లైట్ తీసుకుంటున్నాయి.

    పవన్ తాజా ప్రకటన పై జనసేనలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. టిడిపి తో జనసేన కలవడం ఇష్టం లేకున్నా.. అనివార్యమైన పరిస్థితి కావడంతో జనసైనికులు పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేవు. పార్టీ అధినేత అరెస్టుతో నిరుత్సాహంతో ఉన్న ఆ పార్టీ శ్రేణులకు పవన్ ఆశా దీపంలా కనిపించారు. పవన్ నోటి నుంచి పొత్తు ప్రకటన రావడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు.ఇక యుద్ధానికి సిద్ధం కండి అంటూపవన్ పిలుపునివ్వడం వారికి శక్తినిచ్చినట్లు అయ్యింది.ఇక టిడిపి, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    టిడిపి, జనసేన మధ్య పొత్తు అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. నిన్నటి వరకు పొత్తులపై ఎక్కడో ఒక రకమైన అనుమానాలు ఉండేవి. బిజెపి కలిసి రాకపోవడం,టిడిపితో కలిసేందుకు ఆసక్తి కనబరచకపోవడం, ఇప్పటికీ బీజేపీయే తమ మిత్రపక్షమని పవన్ ప్రకటించడం.. వంటి కారణాలతో ఆ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవని వైసిపి భావిస్తూ వచ్చింది. కానీ పవన్ తాజాగా విస్పష్ట ప్రకటన చేశారు. జనసేన, టిడిపి తోనే కలిసి వెళుతుందని స్పష్టం చేశారు. బిజెపి వస్తే కలుపుకొని వెళ్తామని చెప్పుకొచ్చారు. వస్తే బిజెపిని కలుపుకుంటాం. లేకుంటే టిడిపి, జనసేన కలిసి వెళ్తాయని అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారు. దీంతో వైసీపీకి సైతం ఫుల్ క్లారిటీ వచ్చింది. అయితే ఆ పార్టీ నాయకత్వం లైట్ తీసుకుంటుండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని… రెండు పార్టీలు కలిస్తే తమకు కష్టమేనని ఎమ్మెల్యేలు, మంత్రులు తెగ ఆందోళన చెందుతున్నారు.

    ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక ఓటు అంతా టిడిపి, జనసేన కూటమికి ఏకపక్షంగా మళ్లే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసినా ఆ పార్టీకి ఓట్లు దక్కే అవకాశం చాలా తక్కువ. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉనికి లేని పరిస్థితి. పైగా అవి జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. అవసరమైతే టీడీపీ, జనసేనకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో గడ్డు పరిస్థితులు తప్పవని అధికార వైసిపి ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. టిడిపి, జనసేనతో బిజెపి జట్టు కడితే.. ఎన్నికల్లో సైతం కేంద్రం సహకరించే అవకాశం ఉంది. అప్పుడు గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితే.. తమకూ తప్పదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలపై బెంగ పెట్టుకున్నారు.