https://oktelugu.com/

TDP – Chandrababu : అసంతృప్త జ్వాల.. చంద్రబాబు చల్లార్చేదెలా?

. మొత్తానికైతే తొలి జాబితాతో చెలరేగిన అసంతృప్తి మంటలను చల్లార్చి పనిలో బాబు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 11:00 AM IST
    Follow us on

    TDP – Chandrababu : తెలుగుదేశం పార్టీ సీనియర్లను బుజ్జగించే పనిలో చంద్రబాబు పడ్డారు. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించగా.. అందులో ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో ఈ 99 స్థానాల్లో టిక్కెట్ల కోసం పోటీపడిన ఆశావాహులు, జనసేన కు కేటాయించిన నియోజకవర్గాల్లో టిడిపి సీనియర్లను పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఫలానా పదవి ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు. దీంతో కొంతమంది సీనియర్లు మెత్తబడుతున్నారు. అభ్యర్థులకు సహకరిస్తామని హామీ ఇస్తున్నారు.

    మొన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది నేతలు అసంతృప్తికి గురయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అటువంటి నాయకులకు కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు. చంద్రబాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమా, పీలా గోవింద, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు తదితరులను చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. పొత్తులో భాగంగా సర్దుబాట్లు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపులను సహృదయంతో స్వీకరించాలని.. మీకు సముచిత స్థానం కల్పిస్తానంటూ చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటును జనసేన కు కేటాయించారు. అక్కడ టిడిపి టికెట్ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశించారు. దీంతో ఆయనను చంద్రబాబు చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. తరువాత ఆయన లోకేష్ ను కలిశారు. పొత్తుల సమీకరణలను తాను అర్థం చేసుకోగలనని ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియా వద్ద ప్రస్తావించారు. తాను ఎటువంటి అసంతృప్తికి గురి కాలేదని కూడా చెప్పుకొచ్చారు.

    అనకాపల్లి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పీలా గోవింద్ అయ్యన్నపాత్రుడు తో కలిసి చంద్రబాబును కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజానగరం టిడిపి ఇన్చార్జి బొడ్డు వెంకటరమణకు రాజమండ్రి ఎంపీ టికెట్ లేదా ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సైతం తప్పకుండా ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని.. రెండో జాబితాలో పేరు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు గంటా శ్రీనివాసరావు సేవలను సైతం సద్వినియోగం చేసుకుంటామని.. పార్టీ ప్రయోజనాలకు తగ్గట్టు పోటీ చేసేందుకు గంటా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. మొత్తానికైతే తొలి జాబితాతో చెలరేగిన అసంతృప్తి మంటలను చల్లార్చి పనిలో బాబు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.