Camel Flu In Qatar: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ కప్ టోర్నీ అభిమానులకు అస్సలు సిసలైన ఆనందాన్ని పంచుతోంది. ఇప్పటికే క్రోయేషియా, మొరాకో, అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు సెమీస్ వెళ్ళాయి. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ.. మ్యాచులు చూసేందుకు ఖతార్ వెళ్లిన అభిమానులకు కొత్త వైరస్ రూపంలో ప్రాణాపాయం వెంటాడుతోంది. ఇప్పటికే కోవిడ్ వల్ల, మంకీ ఫాక్స్ వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతులమైంది. చైనా ఇంకా కోవిడ్ నుంచి కోలుకోవడం లేదు.. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కొత్త వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంతకీ ఏమిటా వైరస్
ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వెళ్లిన అభిమానులకు కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ లో ఫుట్ బాల్ మ్యాచులు చూసి స్వదేశాలకు వస్తున్న అభిమానుల ద్వారా కొత్తరకం ఫ్లూ ఆయా దేశాల్లో వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కేమెల్ ప్లూ లేదా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ గా పిలిచే ఈ వైరస్ ఒంటెల నుంచి మనుషులకు వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు పలు దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తమ దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశాయి. మ్యాచ్ లు చూసేందుకు వెళ్లినవారు ఒంటెలకు దూరంగా ఉండాలని, వండని మాంసం తినకూడదని, శుద్ధి చేయని పాలను తాకకూడదని హెచ్చరించాయి.. మరోవైపు బ్రిటన్ ఆరోగ్య భద్రత సంస్థ జ్వరం, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించింది. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లను ఆదేశించింది. ఖతార్ వెళ్లినవారు సాధ్యమైనంత వరకు క్వారం టైన్ లో ఉండాలని సూచించింది.
ఎలా వస్తుంది ఈ వైరస్
మెర్స్ కోవ్ లేదా కేమెల్ ఫ్లూ ను 2,600 లాబరేటరీలు ఈ వైరస్ ను నిర్ధారించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2012 ఏప్రిల్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈ వైరస్ సోకిన వారిలో 35 శాతం మంది మృత్యువాత పడ్డారు.. తొలిసారిగా ఈ వైరస్ ను 2012లో సౌదీ అరేబియాలో గుర్తించారు.. ఇప్పటిదాకా ఈ వైరస్ మధ్య ఈస్ట్ దేశాలతో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. 2012 నుంచి ఇప్పటిదాకా సుమారు 27 దేశాల్లో ఈ వైరస్ వెలుగు చూసింది.. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, దగ్గు, డయేరియా వంటి లక్షణాలతో పాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వృద్ధుల్లో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడే వారిలో, డయాబెటిస్ బాధితుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. పైగా రోగి రోజుల వ్యవధిలోనే నీరసపడిపోతాడు. పరిస్థితి విషమించి కన్నుమూస్తాడు.

జాగ్రత్తగా ఉండాల్సిందే
ఖతార్ వంటి దేశాల్లో ఒంటె మాంసానికి ఎక్కువ ప్రియారిటి ఉంటుంది. అదే సమయంలో ఉడకని మాంసం తింటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. పైగా ఉంటే శరీరంలో ఈ వైరస్ నిద్రాణ స్థితిలో ఉంటుంది. ప్రాథమిక అతితేయి నుంచి ద్వితీయ అతితేయి వరకు వచ్చేసరికి వైరస్ సంక్రమణం విపరీతమవుతుంది. దీనివల్ల రోగి శరీరంలో ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే అప్రమత్తం కాకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది.. ఈ పరిస్థితులు గుర్తించే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెర్స్ ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తోంది.