Maharishi Valmiki Airport: శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామ పట్టాభిషేకాన్ని తలపించేలా రామమందిర ప్రారంభోత్సవానికి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 22న రామమందిరం ప్రారంభం కానుంది. అయోధ్యకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం డిసెంబర్ 30 రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టును ప్రారంభించారు ప్రధాని మోదీ. మరోవైపు అయోధ్యను అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారు.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా..
ఈ క్రమంలో అయోధ్యను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌గా నామకరణం చేసింది. ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయోధ్యను ప్రపంచస్థాయి తీర్థక్షేత్రంగా తీర్చిదిద్దడంతోపాటు విదేశీ యాత్రీకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విశ్వవ్యాప్తంగా సాంస్కృతక వారసత్వం..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజులోల అయోధ్య కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవుతాయని, అయోధ్య సాంస్కృతిక వారసత్వం విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చడమే లక్ష్యంగా, విదేశీ యాత్రీకులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు.
రూ.1,450 కోట్లతో నిర్మాణం..
ఈ విమానాశ్రయాన్ని కేంద్రం 821 ఎకరాల్లో రూ.1,450 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేశారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా పది లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా తీర్చిదిద్దారు. టెర్మినల్ ముఖ భాగం అయోధ్య రామమందిర ఆలయం నిర్మాణాన్ని వర్ణిస్తుంది. ఇక విమానాశ్రయం రెండో దశలో 50 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మించనున్నారు. 600 మంది పీక్ అవర్ ప్రయాణికులకు ఇక్కడ వసతి కల్పించేలా రూపొందించారు.