Buggana Rajandranath Reddy: జగన్మోహన్ రెడ్డి కొత్త క్యాబినేట్ కూర్పు ముందు అనుకున్నట్లుగా అంతా ఈజీగా కుదరడం లేదు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలందరికీ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగా తొలి క్యాబినెట్లో చోటు దక్కని వారికి రెండోసారి ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆశావహులంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. ఈనేపథ్యంలో కొత్తగా మంత్రి వర్గంలోకి వచ్చేవారికి రెండేళ్ల పదవీ కాలం మాత్రమే ఉండనుంది. చివరి ఏడాదంతా ఎన్నికలకు సన్నద్ధం కావడంతోనే సరిపోతుంది. అంటే ఇప్పుడు మంత్రి వర్గంలోకి వచ్చే వారు తమ మార్క్ చూపించాలంటే మాత్రం వారికి ఉన్న సమయం ఏడాదేనని చెప్పొచ్చు.
మిషన్ 2024 గా రాబోతున్న జగన్ కొత్త క్యాబినెట్ కూర్పులో అనేక సమస్యలు వచ్చిపడుతున్నాయి. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులను జిల్లాల వారీగా కేటాయించారు. వినయ విధేయతలకు పెద్దపీట వేస్తూనే అనుభవజ్ఞులను క్యాబినెట్లోకి తీసుకునేలా జగన్ కసరత్తులు చేస్తున్నారు.
ఈక్రమంలోనే జగన్ క్యాబినెట్లో కొనసాగిన ఏడు నుంచి పది మంది మంత్రులకు సెకండ్ ఛాన్స్ దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరి అదృష్టం ఎలా ఉన్నా పైసల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు మాత్రం మరోసారి ఆర్థిక శాఖ దక్కే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. ఆయనకు పదవీ దక్కడానికి ప్రధాన కారణంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అనుభవమేనని తెలుస్తోంది.
బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. మూడేళ్లనే ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అవగతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపారు. కేంద్రం మంత్రులకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించి పెద్దమొత్తంలో అప్పులను తీసుకురావడంలో ఆయన విజయవంతమయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల మీట నొక్కేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుగ్గన చూడగలిగారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తే ఏపీ ఆర్థిక స్థితిని అవగతం చేసుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తగా వచ్చేవారు బుగ్గనలా పని చేస్తారనే గ్యారెంటీ లేదు.
ఏపీ పరిపాలన మొత్తం అప్పుల మీద ఆధారడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖను కొత్త వారికి ఇస్తే అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద సమస్యను తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమే ఉంది. దీంతో ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుగ్గన వైపు జగన్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా పైసల మంత్రి తన పదవీని పదిలం చేసుకుంటారో లేదో ఒకట్రోండురోజుల్లో తేలనుంది.