Budget 2024 : 2024-25 కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ అనగానే చాలా మంది ఆదాయపు పన్ను ఎలా ఉంటుంది? అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రతీ బడ్జెట్ లో ఆదాయపు పన్ను కీలకంగా నిలుస్తుంది. ఆదాయం పెరిగిన వారు పన్ను చెల్లించాలా? ఎంత వరకు మినహాయింపు ఉంటుంది? అని ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన చేస్తారోనని చర్చ ప్రారంభమైంది. కొందరు నిపుణుల ప్రకారం ఈసారి ఆదాయపు పన్ను పై ఎలాంటి అంచనాలు ఉంటాయో చూద్దాం..
మరికొన్ని నెలల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ పై అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించడానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ఉన్న పథకాల్లో కొన్నింటికి ఎక్కువగా నిధులు కేటాయిస్తారని అంటున్నారు. ఇదే సమయంలో ఆదాయపు పన్ను చెల్లించేవారికి కూడా భారీగానే మినహాయింపు ఇస్తారని అంటున్నారు. కానీ కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మధ్యంతర బడ్జెట్ అయినందున ఎలాంటి మినహాయింపులు ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ స్టాండర్డ్ డిడక్షన్ లో మినహాయింపు ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం రూ.7 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద మినహాయింపులు పొందేందుకు అవకాశం ఉంది. అంటే రూ.3 లక్షల ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3 నుంచి 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల నుంచి ఆపై ఆదాయం పొందేవారు 30 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. వీరు రూ.7 లక్షల వరకు కొన్ని మినహాయింపులు పొందవచ్చు.
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ కింద కొన్ని మినహాయింపులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల వరకు మినహాయింపు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది మధ్యంతర బడ్జెట్ అయినందున ఎలాంటి మినహాయింపులు ఇవ్వరని అంటున్నారు. కానీ ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రం కొన్ని రాయితీలు ప్రకటిస్తారన్న చర్చ సాగుతోంది.