https://oktelugu.com/

Breakup Day : ప్రేమలో పడటమే కాదు.. విడిపోవటమూ వేడుకే

కాగా, ఫిబ్రవరి 21న బ్రేకప్ డే కాబట్టి సామాజిక మాధ్యమాలలో #breakup day యాష్ ట్యాగ్ చక్కర్లు కొడుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 21, 2024 / 09:54 PM IST

    Breakup

    Follow us on

    Breakup Day : కలసి ఉండలేం అనుకున్నప్పుడు.. కలిసి వీడిపోవడమే మంచిది. కలిసి కలహించుకోవడం కంటే.. విడిగా ఉండి ఎవరి జీవితం వారు చూసుకోవడం మంచిది. ఇది ఒక తెలుగు సినిమాలో ప్రాచుర్యం పొందిన ఓ డైలాగ్. అది సినిమా డైలాగ్ మాత్రమే కాదు..నిజ జీవితానికి వర్తించేది కూడా. “కూరిమిగల దినములలో నేరము లెన్నడూ కలగనెరవు. ఆ కూరిమే విరసంబైనన్.. నేరములే గలుగుచుండు నిక్కము సుమతి” ప్రేమ ఉన్నప్పుడు తప్పులు కూడా ఒప్పులు లాగా కనిపిస్తాయి. అదే ఆ ప్రేమ తగ్గిపోతే ఒప్పులు కూడా తప్పుల లాగా కనిపిస్తాయి. సుమతి శతకారుడు చెప్పినట్టు నిజ జీవితంలోనూ అలానే ఉంటుంది. ఒక మనిషిని మనం ప్రేమిస్తే.. ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులూ కనిపించవు. ఆ మనిషి మీద ప్రేమ తగ్గినప్పుడు ప్రతిదీ తప్పులాగే కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాలలో ప్రేమించినప్పుడు వేడుక చేసుకుంటే.. విడిపోయినప్పుడు కూడా బ్రేకప్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి మాసంలో ఏడున వాలెంటైన్ వీక్ ప్రారంభమైతే.. వాలెంటైన్ వీక్ చివరిలో అంటే ఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు.

    ప్రేమికుల రోజు అనేది రెండు హృదయాల కలయికతో ముగుస్తుంది. అలాగే యాంటీ వాలెంటైన్స్ డే అనేది వాలెంటైన్ వీక్ చివరిలో పూర్తవుతుంది. మోసాలు, అబద్ధాలు, ఇతర దుర్మార్గాల వల్ల ఏర్పడిన ప్రేమ కు బేక్ వేయడంతో బ్రేకప్ డేట్ పూర్తి అవుతుంది. పాశ్చాత్య దేశాలలో నచ్చని వ్యక్తితో జీవితాన్ని కొనసాగించడం కంటే మధ్యలోనే విడిపోవడం మంచిదని భావిస్తుంటారు. అందుకే బ్రేకప్ చెప్పుకొని విడిపోతుంటారు.

    మనదేశంలోనూ బ్రేకప్ డే సంస్కృతి పెరుగుతోంది. యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోవడం.. తర్వాత కలిసి తిరగడం.. ఎక్కడో ఒక చిన్న కారణానికి గొడవ పడటం.. అది పెద్దది కావడం.. ఆ కారణాలతో చాలామంది విడిపోతున్నారు. జస్ట్ బ్రేకప్ అని సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకుంటున్నారు. ఈ అన్ ఫాలో చేసుకోవడమే బ్రేకప్ సంకేతం లాగా చూపిస్తున్నారు. “ఎదుటి మనిషి తప్పు ఒప్పుల్ని యధాతధంగా అంగీకరించేదే నిజమైన ప్రేమ. కానీ ఈ తరం పిల్లలకు ప్రేమ విషయంలో అంతటి ఓపిక లేదని.. ఒకవేళ ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారని” మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. ప్రేమంటే కలకాలం నిలిచి ఉండాలని.. అలా నిలబెట్టుకోగలమనే నమ్మకం ఉంటేనే ప్రేమించాలని వారు సూచిస్తున్నారు. “ఒక వ్యక్తి నచ్చకపోతే బ్రేకప్ చెప్పి మరో వ్యక్తికి దగ్గరవుతున్నారు. ఆ వ్యక్తి నచ్చకపోతే ఇంకో వ్యక్తికి దగ్గరవుతున్నారు. ఇలా ఎంతమందితో విడిపోతారు? ఎంతమందితో కలుస్తారు? అలాంటప్పుడు ఆ బంధానికి విలువ ఏముంటుంది? జీవితంలో అన్నీ నచ్చినవే ఉండవు. నచ్చనివి కూడా ఉంటాయి.. నచ్చిన వాటిని నెత్తిన పెట్టుకున్నట్టే.. నచ్చని వాటిని కూడా నచ్చేలా చేసుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.” అని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 21న బ్రేకప్ డే కాబట్టి సామాజిక మాధ్యమాలలో #breakup day యాష్ ట్యాగ్ చక్కర్లు కొడుతోంది.