BJP vs Jagan : బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించారు. బిజెపి అగ్ర నేతల నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమయ్యారు. ఎన్డీఏలో టిడిపి చేరిక, ఏపీలో పొత్తు, సీట్ల సర్దుబాటు పై చర్చించుకున్నారు. చంద్రబాబు రాజకీయంగానే ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. కానీ రాష్ట్ర సమస్యల పేరిట జగన్ ఢిల్లీలో వాలిపోయారు. ప్రధాని మోదీని కలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా వైసిపి ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం ఉంది. ఇప్పుడు ఎన్నికల ముందు నేరుగా జగన్ వెళ్లి ప్రధానిని కలిసే సరికి మరోసారి ఆ ప్రచారం బలంగా వినిపించింది. అయితే ఎన్డీఏలో చేరిక విషయంలో జగన్ అంతటి సాహసం చేస్తారా? అన్న ప్రశ్న సైతం వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే జగన్ రాజకీయంగా దెబ్బతినడం ఖాయం.
రాజకీయ సిద్ధాంతాలు, ఓటు బ్యాంకు పరంగా చూస్తే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పని కాదు. ముస్లిం, మైనారిటీలు, క్రిస్టియన్లు, దళితులు వైసిపి ప్రధాన ఓటు బ్యాంకు. ఆ వర్గాలు బిజెపి వైఖరిని వ్యతిరేకిస్తాయి. జగన్ బిజెపి వైపు వెళితే.. ఆ వర్గాల్లోని మెజారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ కావడం ఖాయం. ఆ విషయం జగన్ కు కూడా తెలుసు. కానీ ఒక్క ఓటు బ్యాంకు మీదే రాజకీయాలు నడవవు. తన భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఎన్డీఏలో చేరడం ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. అందుకే నేరుగా తన కోరికను ప్రధాని మోదీ ఎదుట వ్యక్తం చేశారు.
టిడిపి, జనసేన, బిజెపి కూటమి కడితే.. ఎన్నికల్లో ఎదుర్కొనబోయే రాజకీయ పరిణామాలు జగన్ కు తెలుసు. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణలో బిజెపి పాత్ర కీలకం. గత ఎన్నికల్లో బిజెపిని విభేదించిన టిడిపి పరిస్థితి ఏంటో? తద్వారా తనకు లభించిన సాయం ఏంటో జగన్ కు తెలియంది కాదు. అందుకే రాజకీయంగా ఏపీలో తనకు నష్టం జరిగినా సరే.. బిజెపి అండ ఉండేందుకు… ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి ముందు ప్రతిపాదించారని.. ఇక బిజెపి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బిజెపి జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తే ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.