Pakistan Flag : ఇప్పుడు పత్రికలు చూడడం లేదు.. టీవీలు ఫాలో అవ్వడం లేదు.. అంతా సోషల్ మీడియా యుగం. వాట్సాప్ లో ఏది వస్తే అదే నమ్మేస్తాం.. గుడ్డిగా దాన్ని షేర్లు చేస్తాం.. నిజమేనని పొరపడుతుంటాం. కానీ అసలు నిజం తెలిసి నాలుక కరుచుకుంటాం. కానీ ఆ లోపల అది వైరల్ అయిపోతుంటుంది. సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తేడా తెలియని పరిస్థితి.అందుకు బీజేపీ పెద్ద నేతలు కూడా మినహాయింపు కాదన్న విషయం తాజాగా వెలుగుచూసింది.*
ಭಾರತದ ಬಾವುಟಕ್ಕಿಂತ ಬೇರೆ ಯಾವುದೇ ಬಾವುಟ ಎತ್ತರದಲ್ಲಿ ಇರಬಾರದು ಅನ್ನೋ ಸಾಮಾನ್ಯ ಜ್ಞಾನ ಇಲ್ಲವೇ ನಿಮ್ಮ ಮಾಲ್ ನವರಿಗೆ? @DKShivakumar ರವರೇ.#BoyCottLuluMallBengaluru pic.twitter.com/MZ7nxXqXlO
— ಶಕುಂತಲ ನಟರಾಜ್Shakunthala (@ShakunthalaHS) October 10, 2023
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ఏ చిన్న పోస్టు పెట్టినా.. క్షణాల్లో అది ప్రజల్లోకి వెళుతోంది. నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా పోస్టులు పెట్టాలని ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు పోస్టుల ప్రభావం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు. అయినా కొంత మంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం తప్పుడు పోస్టులు పెడుతూ కేసులపాలవుతున్నారు. తాజాగా ఓ షాపింగ్ మాల్‌లో పాకిస్తాన్ జెండా ప్రదర్శించారని బీజేపీ మహిళా నేత సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటో పోస్టు చేశాడు. విచారణలో అది తప్పని తేలడంతో ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
-ఏం జరిగిందంటే..
కేరళలోని కొచ్చిలో ఉన్న లులు మాల్‌లో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం వివాదంగా మారింది. అయితే ఈ జెండా బెంగళూరులోని లులు మాల్‌లో కనిపించినట్లు, భారత్‌తో సహా అన్ని ఇతర జెండాలు చిన్నవిగా ఉన్నాయని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ మహిళా నేత శంకుతల సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేశారు. పోస్టు వైరల్ కావడంతో బెంగళూరులోని లులు యాజమాన్యం రంగంలోకి దిగింది. మాల్ మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఈ ఫొటో బెంగళూరులోని లులు మాల్‌ది కాదని, కొచ్చిలోనిదని యాజమాన్యం తెలిపింది. లులు మాల్ మార్కెటింగ్ మేనేజర్ తప్పుడు సమాచారం కారణంగా ఆమె ఉద్యోగం కోల్పోయిందని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. తర్వాత, మళ్లీ చేరాల్సిందిగా కోరినట్లు ఆమె ప్రకటించారు.
-బీజేపీ నేతపై కేసు..
కొచ్చి మాల్ ఫొటోను.. బెంగళూరు మాల్ ఫొటో అంటూ వక్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజేపీ కార్యకర్త శకుంతలపై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. బీజేపీ నాయకురాలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేసి బెంగళూరు లులు మాల్‌లో ఇది జరిగిందని సూచించింది. అయితే ఆ తప్పుదోవ పట్టించే ఫోటో కేరళలోని లులు మాల్‌లో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లులు మాల్ యాజమాన్యం కర్ణాటక లులూ మాల్ మార్కెటింగ్ మేనేజర్ ను ఉద్యోగంలోంచి తీసేసింది. తర్వాత తప్పని తేలడంతో మేనేజర్ తిరిగి విధుల్లో చేరింది.
-పాక్ జెండా పెద్దగా కనిపించేలా..
కొచ్చిలోని లులు మాల్‌లో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న జట్ల దేశాల జెండాలను ఏర్పాటు చేశారు. కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగానే ఇది ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఈ జెండాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఫొటో తీసే కోణంలో తేడా కారణంగా అందులో పాకిస్తాన్ జెండా పెద్దగా ప్రదర్శించినట్లు కనిపించింది. దీనినే బీజేపీ నేత సోషల్ మీడియాలో పోస్టు చేసి బెంగళూర్ లులు మాల్‌లో ప్రదర్శించారని, పాకిస్తాన్ జెండాను అన్నింటికన్నా పెద్దగా ఉంచారని పోస్టు పెట్టారు. దీంతో వివాదం నెలకొంది.
-తప్పుడు పోస్టుతో రచ్చ..
పెద్ద పాకిస్తాన్ జెండాను చూపుతున్న ఫోటోను శకుంతలతో సహా చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పంచుకున్నారు. అయితే విచారణలో అన్ని జెండాలు ఒకే పరిమాణంలో ఉన్నాయని తేలింది. అయితే ఫొటో మిగిలిన వాటి కంటే పాకిస్తాన్ జెండా పెద్దదిగా కనిపించే కోణం నుండి తీయబడింది. దీనికి మేనేజర్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
-రాజకీయ నేతలే ఇలా చేస్తే..
పాకిస్తాన్ విషయంలో ఎవరు పోస్టు చేసినా అది భారత్‌లో వివాదం అవుతుంది. కలహాలకు దారితీస్తుంది. అయితే రాజకీయాల్లో ఉన్నవారు పోస్టు చేస్తే అది మరింత రచ్చ అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా బీజేపీ నేత ఇలా తప్పుడు పోస్టు పెట్టడం ద్వారా దాని ప్రభావం ఎక్కువ మందిపై పడింది. మాల్ మేనేజర్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఇక చాలా మంది శకుంతల ఫాలోవర్స్ దీనిని షేర్ చేశారు. వారందూ మాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-పాకిస్తాన్ పేరుతో తప్పుడు ప్రచారం..
పాకిస్తాన్ పేరు చెప్పి ఒక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మైనారిటీలు విమర్శిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో ఈ సంస్కృతి బాగా పెరిగిందని పేర్కొంటున్నారు. తప్పుడు పోస్టులతో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోస్టులను ఎంకరేజ్ చేయొద్దని, కలహాలకు కారణం అవొద్దని కోరుతున్నారు.