https://oktelugu.com/

BJP: ఆ మూడు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహం అదుర్స్

ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎంపిక కొనసాగింది. చత్తీస్గడ్ లో వ్యూహాత్మకంగా గిరిజన నేతను, మధ్యప్రదేశ్ లో ఓబీసీ నేతను, రాజస్థాన్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను సీఎం పీఠం అప్పగించింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 17, 2023 / 09:30 AM IST

    BJP

    Follow us on

    BJP: దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బిజెపి అడుగులు వేస్తోంది. రాష్ట్రాల్లో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ పార్టీ బాధ్యతలను అప్పగిస్తోంది. గెలుపొందిన రాష్ట్రాల్లో సైతం అదే ఫార్ములాను అనుసరిస్తూ ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు సాధించింది. చత్తీస్గడ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొత్త ముఖాలను సీఎంలుగా ఎంపిక చేసింది.

    ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎంపిక కొనసాగింది. చత్తీస్గడ్ లో వ్యూహాత్మకంగా గిరిజన నేతను, మధ్యప్రదేశ్ లో ఓబీసీ నేతను, రాజస్థాన్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను సీఎం పీఠం అప్పగించింది. ఈ మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులను సైతం మెజారిటీ సామాజిక వర్గాలకు అప్పగించడం విశేషం. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎంపికలు అక్కరకు వస్తాయని కాషాయ దళం బలంగా భావిస్తోంది. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఒత్తిడిని కూడా పక్కన పెట్టి బిజెపి ఎంపికలు చేయడం విశేషం.

    * చత్తీస్గడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేశారు. ఈయన గిరిజన వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో 30% కన్నా ఎక్కువగా గిరిజనులు ఉంటారు. దీంతో ఆ వర్గానికి చెందిన విష్ణు ఎంపిక చేయడం విశేషం. అయితే సీఎం పదవిని ఆశించిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు అప్పగించారు.

    * మధ్యప్రదేశ్ సీఎం గా ఓబీసీ నేత మోహన్ యాదవ్ ఎంపిక అనూహ్యం. ఈ పేరు వెలువడగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడ యాదవుల జనాభా ఆరు శాతం మాత్రమే. ఉత్తరప్రదేశ్, బీహార్లో తమ ప్రత్యతి పార్టీలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యూపీలో అఖిలేష్ యాదవ్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కంటే.. యాదవులకు దేశవ్యాప్తంగా బిజెపి ప్రాధాన్యం ఇస్తోందని సంకేతాలు పంపించినట్లు అయ్యింది.

    * రాజస్థాన్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజ కుటుంబాల నుంచి ఒత్తిడి ఉన్న అగ్రవర్ణాలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ పదవి కట్టబెట్టారు. అయితే ఎక్కడికక్కడే సీనియర్లను నియంత్రిస్తూ.. వారితో సమన్వయం చేసుకుంటూ.. వారి ప్రతిపాదనతోనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే చెల్లింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాషాయ దళం పక్కా వ్యూహంతో అడుగులు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.