Homeఆంధ్రప్రదేశ్‌BJP in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుంది..?

BJP in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుంది..?

BJP in Telugu states: ఇప్పుడు దేశంలో అరవీర భయంకర పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. ఉత్తరాదిని ఊడ్చేసింది. ఈశాన్య భారతాన్ని కాజేసింది. బలమైన హిందీ రాష్ట్రాల్లో.. అత్యధిక జనాభా గల రాష్ట్రాలను గుప్పిట పట్టింది. కానీ దక్షిణాదిలో మాత్రం ఈ జాతీయ పార్టీ తేలిపోతోంది. కేవలం కర్ణాటకకే పరిమితమైంది. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణల్లో అధికారం కోసం ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు చరిత్రలో లేవు. తెలంగాణ ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఏపీలో ఆ ఆశలు మచ్చుకైనా లేవు. అక్కడ జనసేనతో కలిసి పొత్తుల సంసారంలో ఎదురీదుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అసలు బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది.? అసలు బలాబలాలు ఏమిటీ? నాయకత్వ సమస్యనా? మరేం కారణమనే దానిపై స్పెషల్ ఫోకస్..

దేశంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లపాటు విజయవంతంగా పాలించింది. 2019లోనూ విజయఢంకా మోగించింది.  మరోసారి పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వం రెండేళ్ల తరువాత మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. .కరోనా ఎఫెక్ట్ మోడీ సర్కార్ పై బలంగానే పడింది.  ఈ క్రమంలోనే పోయిన ప్రతిష్టను రాబోయే మూడేళ్లలో తిరిగి తెచ్చుకునేందుకు.. పార్టీ పటిష్టతకు నాయకులు నడుం బిగించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీలోని కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో బీజేపీ నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అధికారంలోకి రాలేకపోతుంది. ఇప్పుడే కాదు.. ఆ పార్టీని నడిపిన మహానాయకులు సైతం ఇక్కడి వారిని ఆకట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు బీజేపీలో లేరా..? అసలు ఆ పార్టీకి ఇలాంటి నాయకులు దొరకరా..? అన్న చర్చ సాగుతోంది.

అటల్ బీహార్ వాజ్ పేయి కాలంలోనూ తెలుగు రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడానికి ఎంతో ప్రయత్నించింది. అయితే అటల్ పై అభిమానం తెలుగు ప్రజలకున్నా.. ఇక్కడి నాయకులను మాత్రం నమ్మలేదు. ఎందుకంటే వారు అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణం. అయితే ఇదే సమయంలో  మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు విజయం సాధిస్తుంది..? అన్న ప్రశ్న ఉత్ఫన్నమవుతోంది. దీనికి బీజేపీ నాయకులే రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే బీజేపీ కొన్ని సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంచకపోవడం ఇక్కడ ఎదగలేకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

బీజేపీలో ఉండే నాయకులు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని అలవర్చుకుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ సైతం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. కానీ కొన్ని రాజకీయ అవసరాల కోసం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మరిచిపోతుందని అంటున్నారు. ఇందుకు ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గమేనని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకొని, వారిని ఉన్నతస్థానాలకు తీసుకెళ్తోంది.

ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. ఈమె కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకురాలు. మరో నేత కన్నా లక్ష్మీనారాయణ సైతం కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. వీరికి ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదు. తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. తాజాగా పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ దశాబ్ద కాలంలో టీఆర్ఎస్ లో పనిచేశారు. అలాగే జి.వివేక్, విజయశాంతి, బాబుమోహన్ తదితరులు ఇతర పార్టీలకు చెందిన వారే. ఒకప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు సంపాదించారు.

అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు బీజేపీ కోసం పనిచేస్తారని కొందరు అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి అందలమెక్కిన వారు తమ అవసరాల కోసం బీజేపీని వాడుకొని ఆ తరువాత ఇతర పార్టీల్లోకి వెళుతారని అంటున్నారు. అయితే తెలంగాణకు చెందిన పేరాల శేఖర్ రావు నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన నలభై ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులను బీజేపీలో చేర్చుకొని వారిని అందలమెక్కించే ప్రయోగం పశ్చిమ బెంగాల్ లో చేశారని, అయితే అక్కడ విఫలమైందని గుర్తు చేస్తున్నారు. అక్కడ ముకుల్ రాయ్ ని తృణమూల్ పార్టీ నుంచి బీజేపీలో చేర్చుకొని జాతీయ ఉపాధ్యక్షుడిని చేశారు. కానీ ఆయన తిరిగి సొంత గూటికే చేరుకున్నారని అంటున్నారు.

అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయించేటప్పుుడు స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్టీ సైద్ధాంతిక నిబంధనలకు సడలింపు ఇవ్వొచ్చు. కానీ పార్టీ జాతీయ కార్యవర్గం అనేది పాలసీని రూపొందించే యంత్రాంగం. ఈ విషయంలో పార్టీ   కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వాల్సి అవసరం ఉందని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తోంది.  బీజేపీలో ఎక్కువగా వలసవచ్చిన వారే ఉన్నారు. వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందకే ఇక్కడ బీజేపీ ఎదగడం లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   ఇది ఆలోచించాల్సిన విషయం అని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular