https://oktelugu.com/

BJP First List : బిజెపి తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కాయంటే?

టికెట్లు దక్కని వారి సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటామని నడ్డా ప్రకటించారు. రాజకీయమంటే పదవులు మాత్రమే కాదని.. పార్టీకి సంబంధించిన పనులు కూడా ఉంటాయని ఆయన గుర్తు చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 2, 2024 / 07:25 PM IST
    Follow us on

    BJP First List : పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన రాకముందే భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది.. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఏకంగా 380 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శనివారం 125 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 34 మంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులకు బిజెపి స్థానం కల్పించింది. ఈ జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారు. 47 మంది యువత ఉంది. 27 మంది ఎస్సీలకు, 17 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు బిజెపి టికెట్లు కేటాయించింది. వారి వివరాలను బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించారు. జాతీయస్థాయిలో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పోటీ చేనున్నారు. లక్నో పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బరిలో ఉన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ నుంచి అమిత్ షా బరిలో ఉన్నారు.

    తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ నుంచి బిబి పాటిల్, మల్కాజ్ గిరి నుంచి ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ కు టికెట్లు ఖరారయ్యాయి. మలి విడతలో మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పార్లమెంట్ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ కు ఈసారి అవకాశం దక్కలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను ఆమె ఓడించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విదిశ టికెట్ దక్కించుకున్నారు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి సినీ నరుడు సురేష్ గోపి, తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేతి నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేయనున్నారు.

    ఈసారి ఎన్నికల్లో దాదాపు 100 మంది సిట్టింగ్ ఎంపీలకు బిజెపి అధిష్టానం టికెట్లు నిరాకరించింది. మూడు పర్యాయాలు ఎంపీలుగా పనిచేసిన వారికి టికెట్ ఇవ్వలేదు. వయసు పైబడిన వారి విషయంలో ఉదారత చూపించలేదు. పార్టీ కోసం శ్రమించిన వారికి చోటు కల్పించింది. ఇక తొలి జాబితాను పరిశీలిస్తే తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించింది. ఉత్తరప్రదేశ్ నుంచి 51, పశ్చిమ బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24 స్థానాలకు అభ్యర్థులను బిజెపి ఖరారు చేసింది. మొత్తానికి దేశంలో మూడవ వంతు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. టికెట్లు దక్కని వారి సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటామని నడ్డా ప్రకటించారు. రాజకీయమంటే పదవులు మాత్రమే కాదని.. పార్టీకి సంబంధించిన పనులు కూడా ఉంటాయని ఆయన గుర్తు చేశారు.