KCR Bheema : ఉత్త బీమా.. రైతు బీమా.. అమ్మా కేసీఆర్ సార్.. కలిపికొట్టావా?

ఆసరా ఫింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు, మహిళలకు ఆర్థికసాయం స్కీం తీసుకొచ్చారు. వీటిలో కీలకమైనది కేసీఆర్‌ బీమానే..

Written By: Raj Shekar, Updated On : October 29, 2023 7:05 pm
Follow us on

KCR Bheema : అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంక్షేమంతో ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కుతున్నారు గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2014 ఎన్నికల సమయంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాళ భూమి, ఆసరా పింఛన్, పంట రుణాల మాఫీ, దళిత సీఎం పేరుతో 60 సీట్లతో అధికారంలోకి వచ్చారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రైతుబంధు, రైతుబీమా ప్రకటించారు. ఆసరా పింఛన్లు పెంచారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ప్రకటించారు. ఇంకేముందు రైతులు, పెన్షనర్లతోపాటు నిరుద్యోగులు కూడా గంపగుత్తాగా ఓట్లు గుద్దారు. దీంతో ఈసారి 87 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా అదే సంక్షేమ మంత్రాన్ని నమ్ముకున్నారు కేసీఆర్‌. ఈసారి కొత్తగా కేసీఆర్‌ బీమా ప్రకటించారు. మరోవైపు ఈసారి పంట రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం వంటి ఫెయిల్యూర్‌ పథకాలకు రాం రాం చెప్పారు. ఆసరా ఫింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు, మహిళలకు ఆర్థికసాయం స్కీం తీసుకొచ్చారు. వీటిలో కీలకమైనది కేసీఆర్‌ బీమానే..

తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ..
కేసీఆర్‌ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా రైతు బీమా తరహాలో తెలంగాణలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 93 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారని వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా వర్తింపజేస్తామని ఎలాంటి మరణం సంభవించిన పది రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తామని వెల్లడించారు. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున ఓట్లు కొల్లగొట్టవచ్చన్న ఆశతో కేసీఆర్‌ ఈ స్కీం తెరపైకి తెచ్చారు. 93 లక్షల కార్డు దారుల్లో సగటున ఇంటికి ముగ్గురు ఓటర్లు ఉంటారని, ఈలెక్కన రెండు కోట్ల ఓటర్లపై ప్రభావం పడుతుందని, వీరిలో కనీసం ఇద్దరు అంటే కోటి మందికిపైగా బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా గట్టెక్కుతామని కేసీఆర్‌ ఆలోచన.

వాస్తవం వేరు..
కానీ కేసీఆర్‌ ప్రకటించిన బీమా స్కీం వెనుక వాస్తవాలు వేరే ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు. కేసీఆర్‌ ప్రకటించినట్లుగా తెలంగాణలో 93 లక్షల మందికి ఈ పథకం వర్తించదని అంటున్నారు. అదెలా అంటే.. కేసీఆర్‌ రైతుబీమా కింద అమలు చేస్తున్న సాధారణ బీమా పథకం. బీమా నిబంధనల ప్రకారం ఈ పథకానికి 60 ఏళ్ల లోపు వారే అర్హులు. ఈమేరకు తెలంగాణలో 50 లక్షలకు పైగా రైతులు ఉండగా, రైతుబీమా మాత్రం కేవలం 32.16 లక్షల మందికే అమలు అవుతోంది. మిగతా 20 లక్షల మంది రైతులు 60 ఏళ్లు పైబడిన వారే. దీంతో వీరంతా రైతుబీమాకు దూరంగా ఉన్నారు.

కేసీఆర్‌ బీమాకు ఇవే నిబంధనలు…
ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్‌ బీమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. బీమా నిబంధనల ప్రకారం తెల్ల రేషన్‌కార్డుదారుల్లో 60 ఏళ్లు పైబడిన వారంతా కేసీఆర్‌ బీమాకు అనర్హులే. కార్డు హోల్డర్‌ పేరిట బీమా వర్తింపజేస్తే.. 93 లక్షల కార్డు దారుల్లో 30 శాతం మంది అంటే 30 లక్షల మందికి పైగా అర్హత కోల్పోతారు. అంటే 60 లక్షల మందే మిగులుతారు. ఈ విషయాన్ని ఎక్కడా బీఆర్‌ఎస్‌ నేతలు వెల్లడించడం లేదు. 93 లక్షల మందికి బీమా అని మాత్రమే చెబుతున్నారు. కానీ, బీమా నిబంధనలు అందరికీ వర్తించవు.

రైతుబీమా ఉంటే కేసీఆర్‌ బీమా కట్‌..?
ఇక మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే.. తెలంగాణలో ఇప్పటికే 32.16 లక్షల మంది రైతులకు రైతుబీమా అమలవుతోంది. ఇందులో 30 లక్షల మంది పేద రైతులే. వీరందరికీ తెల్ల రేషన్‌కార్డు ఉంది. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబీమా అమలవుతున్నవారందరికీ కేసీఆర్‌ బీమా అమలు చేయరని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆసరా పెన్షన్‌కు కేసీఆర్‌ ఈ నిబంధన అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఒకరికే పెన్షన్‌ ఇస్తున్నారు. బీమా విషయంలోనూ ఇదే రూల్‌ అమలు చేయడం ఖాయం. దీంతో 60 ఏళ్ల నిబంధన ద్వారా 30 లక్షల మంది అర్హత కోల్పోతే ఒక కుటుంబానికి ఒకే బీమా అన్న నిబంధన ప్రకారం మరో 30 లక్షల మంది అర్హత కోల్పోతారు. దీంతో కేసీఆర్‌ చెప్పిన 93 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లో సుమారు 60 లక్షల మంది నిబంధనల ప్రకారం అనర్హులవుతారు. ఇక మిగిలింది 33 లక్షల కార్డు దారులే కేసీఆర్‌ బీమాకు అర్హులవుతారు.

వాస్తవాలు గ్రహించాలి..
వాస్తవాలను ఇటు బీఆర్‌ఎస్‌ నాయకులు దాచిపెడుతుండగా, అటు విపక్షాలు ఈ విషయాన్ని ఎలివేట్‌ చేయడంలో విఫలమవుతున్నాయి. ప్రజలంతా తాను చెప్పింది నమ్ముతారన్న భావనతో కేసీఆర్‌ 93 లక్షల మందికి బీమా అని ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అదే ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు అయినా వాస్తవం గ్రహిస్తారో లేక గొర్రెల మందలా ఈసారి కూడా గంప గుత్తాగా బీఆర్‌ఎస్‌కు ఓట్లు గుద్దేస్తారో చూడాలి.

ఏటా రూ.5 వేల కోట్లు కావాలి..
ఇక 33 లక్షల మందికి బీమా అమలు చేయాలంటే ఎల్‌ఐసీ బీమా ప్రీమియం ప్రకారం ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే 32.33 లక్షల మంది రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా చెల్లిస్తోంది. దీనికి అదనంగా మరో రూ.5 వేల కోట్లు ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. అంత సొమ్ము సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారుకు భారమే.