G20 Summit : జీ_20 సమ్మిట్ లో భారీ ప్రాజెక్టుకు అడుగు పడింది. ప్రభావవంత ఆర్థిక శక్తులయిన భారత్_ గల్ఫ్_ యూరప్ మధ్య మహా రైల్, పోర్ట్ కారిడార్ నిర్మాణానికి బీజం పడింది. భారత్ నుంచి వయా గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ లోని ఏ నగరానికైనా రవాణాను వేగవంతం, సులభతరం చేసే చారిత్రాత్మక నిర్ణయానికి జీ_20 సదస్సు వేదిక అయింది. ఢిల్లీలో జరుగుతున్న జీ_20 సదస్సులో మహా కారిడర్ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కారిడార్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ_20 సదస్సులో పలు విషయాలను వెల్లడించారు. “అనుసంధానత, స్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ఈ కారిడార్ దోహదం చేస్తుంది” అని మోడీ ప్రకటించారు.. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా అధ్యక్షుడు బైడన్ సమక్షంలోనే మోడీ వెల్లడించడం విశేషం.
భారత్, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మానవ నాగరికత అభివృద్ధికి మౌలిక సదుపాయాలే బలమైన పునాదులు. సరిగ్గా వీటినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని జి_20 లోని ప్రభావవంత దేశాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ కారిడార్ నిర్మాణానికి ముందుకు వచ్చాయి. వాస్తవానికి మౌలిక వసతులు మెరుగుపడితేనే సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని పలు పరిణామాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. అందుకే సభలు ప్రారంభమైన మొదటి రోజే కారిడార్ విషయం చర్చకు వచ్చింది. అయితే చాలామంది ఇది చర్చల దశలోనే ముగిసిపోతుంది అనుకున్నారు. అయితే పలు దేశాలు దీనిపై ముందుకే అడుగులు వేయడంతో అతి త్వరలో నిర్మాణం జరుగుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని ఆధారంగానే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు పురుడు పోసుకుంటాయని భారత్, గల్ఫ్, యూరప్ భావిస్తున్నాయి.
గత కొంతకాలంగా భారత్, గల్ఫ్, యూరప్ క్రమం తప్పని వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి. ఈ దేశంలో విలువైన మానవ వనరులు, అంతకుమించి సహజ వనరులు ఉండటంతో దేశాల మధ్య కనెక్టివిటీ సులభతరంగా ఉండాలనే డిమాండ్ ఇటీవల నుంచి వినిపించడం ప్రారంభమైంది. ఈ డిమాండ్ కు అనుగుణంగానే ఆయా దేశాల అధిపతులు కీలక ప్రతిపాదన చేయడం విశేషం.. సరుకు రవాణా, వాణిజ్య ఉత్పత్తుల పరస్పర బదిలీ, ఇంధన రవాణా, డిజిటల్ కనెక్టివిటీ ని పెంచేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుందని సభ్య దేశాలు భావిస్తున్నాయి. ఆఫ్రికా కూడా ఇందులో భాగస్వామిగా ఉంటానని ప్రతిపాదన చేయడం ఈ కారిడార్ గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మౌలిక వసతుల కల్పన ద్వారానే చైనా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, ప్రభావవంత దేశాలు కూడా అదేవిధానాన్ని అవలంబిస్తే ఆర్థిక శక్తులుగా ఎదుగుతాయని భారత్_ యూరో_ గల్ఫ్ దేశాలు అభిప్రాయపడ్డాయి.. అయితే ఈ ప్రాజెక్టు విలువ ఎంత అనేది చెప్పనప్పటికీ.. వచ్చే అరవై రోజుల్లో దీనికి సంబంధించి కీలకమైన ముందడుగు వేయాలని ఆయా దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.