https://oktelugu.com/

PV Narasimha Rao: పీవీకి భారతరత్న.. కాంగ్రెస్ కు మోడీ మాస్టర్ స్ట్రోక్

పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. సోనియా కోటరి అంతగా విలువనిచ్చేది కాదు. పైగా ఆయనను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 9, 2024 / 04:25 PM IST
    Follow us on

    PV Narasimha Rao: ప్రత్యర్థిని గెలవాలి అంటే ఓడించడం ఒకటే మార్గం. కాకపోతే అలా ఓడించాలి అంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టే నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కా గలిగాడు. మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడని నమ్మకాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తను మొదటి నుంచి బలమైన ప్రత్యర్థిగా నమ్ముతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏ కీలుకు ఆ కీలు విరుచుకుంటూ వస్తున్నాడు. తాజాగా భారత మాజీ ప్రధాని.. దివంగత పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేశాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తాజాగా శుక్రవారం చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. స్వామినాథన్, చరణ్ సింగ్ విషయాలను కాస్త పక్కన పెడితే.. నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని అందించడం పట్ల తెలుగు రాష్ట్రాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎటువంటి స్పందనను వెలిబుచ్చలేదు.

    నాడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. సోనియా కోటరి అంతగా విలువనిచ్చేది కాదు. పైగా ఆయనను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసింది. కాంగ్రెస్ పార్టీలో అలవాటైన గ్రూపు రాజకీయాలను పెంచి మరింత పోషించడంతో పీవీ నరసింహారావు ఒకింత మనోవేదనకు గురయ్యారు. చివరికి ఆయన పరమపదించిన తర్వాత కూడా పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పించలేదు. బహుభాషా కోవిదుడు, ఆర్థిక పితామహుడు, సంస్కరణల పితామహుడు అయినప్పటికీ ఆయన పార్థివ దేహానికి నాటి కాంగ్రెస్ పార్టీ సరైన వీడ్కోలు పలకలేదు. చివరికి ఆయన భౌతికకాయాన్ని కూడా పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ తీరు మార్చుకోలేదు. సంతాప తీర్మానాన్ని కూడా ప్రకటించలేదు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతిని ఘనంగా జరిపిన దాఖలాలు లేవు. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే కనీస సోయి కూడా ఆ పార్టీకి లేదు.

    పీవీ నరసింహారావుకు సంబంధించి జరిగిన అవమానంపై ఆయన కుటుంబ సభ్యులు ఎలుగెత్తినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి పివి నరసింహారావు ఘనతను భారతీయ జనతా పార్టీ గుర్తించింది. బహుభాషా కోవిదుడికి.. ఆర్థిక రంగ పితామహుడికి భారతరత్న పురస్కారం అందించి ఆయన సేవలకు నిజమైన గౌరవం కల్పించింది. నాడు పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల వల్లే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం మొదలు పెట్టింది. నాడు ఆయన చేసిన ఘనతను గుర్తుంచుకొని బిజెపి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పీవీ నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం.. తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కొద్దో గొప్పో బలంగా ఉండటంతో.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం తమకు లాభిస్తుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకున్న బిజెపి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తమకు సీట్లు పెరుగుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును ఓన్ చేసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాత్రమే భారత రాష్ట్ర సమితి పీవీ నరసింహారావు పేరును స్మరించింది. ఆ తర్వాత విస్మరించింది. కానీ బిజెపి ప్రభుత్వం తన పార్టీ వాడు కాకపోయినప్పటికీ.. రాష్ట్రపతి భవన్ ద్వారా దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం విశేషం.