https://oktelugu.com/

Free Bus Scheme: మహిళలకి ఉచిత ప్రయాణం మామూలు స్కీమ్ కాదు…ఇన్ని లాభాలున్నాయా ?

రవాణా సౌకర్యంతో ఇన్నాళ్లూ గడప దాటని మహిళలు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లు మహిళలతో కళకళలాడుతున్నాయి. బస్సుల్లో 60 శాతం మహిళలే కనిపిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 12, 2023 / 12:56 PM IST

    Free Bus Scheme

    Follow us on

    Free Bus Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజులకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రెండింటిని అమలులోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో మహిళాలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఉచిత రవాణా సౌకర్యంతో ఇన్నాళ్లూ గడప దాటని మహిళలు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్టాండ్లు మహిళలతో కళకళలాడుతున్నాయి. బస్సుల్లో 60 శాతం మహిళలే కనిపిస్తున్నారు.

    ఫ్రీ జర్నీపై విమర్శలు..
    ఇదిలా ఉంటే.. కొంత మంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఈ స్కీంతో సంక్షోభంలో కూరుకుపోతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం ఉచిత రవాణా పేరుతో నష్టాల్లోకి నెడుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంటున్నారు.

    వృద్ధికి దిక్సూచి అంటున్న నిపుణులు..
    ఇదిలా ఉంటే.. ఉచిత రవాణా అనేది ఆర్థిక అభివృద్ధికి దిక్సూచి అంటున్నారు ఆర్థిక నిపుణులు. మన దేశంలో ఇటీవలే ప్రవేశపెడుతున్నారని, కానీ, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉచిత ట్రాన్స్‌పోర్టు ఉందని పేర్కొంటున్నారు. బెల్జియం, రష్యా, అమెరికా, జపాన్‌లోని కొన్ని నరగరాల్లో మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి సదుపాయం పనిశక్తిని పెంచడంతోపాటు పరోక్షంగా దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతుందని, స్వయం ఉపాధికి అవకాశాలు మెరుగు పరుస్తుందని, ఉన్నత విద్య అవకాశాలను దగ్గర చేస్తుందని అంటున్నారు.

    = మహిళా శ్రమశక్తి పెంపు..
    ఉచిత రవాణా సౌకర్యంతో మహిళా శ్రమశక్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా పనిచేసేందుకు మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే రవాణా ఖర్చుల భారంతో పెద్దలు పనికి పంపించడం లేదు. ఉచిత రవాణా సదుపాయంతో మహిళలు సులభంగా వెళ్లడంతోపాటు పనిచేయడం వలన పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు మెకానే కూడా ఈ విషయాన్ని తన పరిశోధనల్లో వెల్లడించారని అంటున్నారు.

    ఆర్థికాభివృద్ధి..
    ఇక మహిళలకు ఉచిత రవాణా కారణంగా, తక్కువ వేతనంలో ఉన్న ఊళ్లో పనిచేసేవారు.. ఎక్కువ వేతనం కోసం సమీపంలోని పట్టణాలకు వెళ్లడానికి వీలు పడుతుందని పేర్కొంటున్నారు. తద్వారా వారికి వచ్చే ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో పనిచేసే మహిళల వేతనం ఎక్కువగా ఉంటుందని, అదే నగర శివారుల్లో పనిచేసే మహిళల వేతనం తక్కువగా ఉంటుందంటున్నారు. చేసే పని ఒకటే అయినా వేతనంలో వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు. ఉచిత రవాణాతో శివారు మహిళలు కూడా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌లాంటి ప్రాంతాల్లో పనిచేసుకునే అవకాశం కలుగుతుందని, తద్వారా ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు.

    ఉన్నత విద్యావకాశాలు..
    ఇక మన దేశంలో ఆడపిల్లల చదువులపై ఇంకా వివక్ష తొలగిపోలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలను ఇంకా బయటకి దూర ప్రాంతాలకు ఉన్నత విద్య కోసం పంపడం లేదు. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి సమీపంలో విద్యాసంస్థలు లేకపోవడం, దూర ప్రాంతానికి వెళ్లడానికి రవాణా భారం. ఉచిత రవాణాతో దూర ప్రాంతానికి వెళ్లడానికి వీలవుతుంది. ఉన్నత చదువులు చదివిన విద్యార్థినులు భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో భాగమవుతారని చెబుతున్నారు. ఇందుకు ఉచిత రవాణా కారణమవుతుందని అంటున్నారు.

    వేధింపులకు చెక్‌..
    ఇక బస్సుల్లో సాధారణంగా వేధింపులు ఉంటాయన్న భయం మహిళల్లో ఉంటుంది. స్యవంగా నిత్యం ఏదో ఒకచోట జరుగతూనే ఉన్నాయి. అయితే మహిళలకు ఉచిత రవాణాతో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతుంది. దీంతో వేధింపులను వారు దీటుగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది.

    ఇలా ఏరకంగా చూసినా ఉచిత రవాణా అనేది జీడీపీ వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని నష్టంగా పరిగణించొద్దని, పెట్టుబడిగా భావించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఉచిత రవాణాతో మహా అయితే ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, కానీ, దాని ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడతారని, బాలికల ఉన్నత విద్య పెరుగుతుందని, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.