https://oktelugu.com/

Lakshadweep: అందమైన లక్ష్యద్వీప్‌.. అక్కడకు వెళ్లడం అంత ఈజీ కాదు.. ఎందుకో తెలుసా?

లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం. అక్కడికి వెళ్లడానికి నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్‌ ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : January 11, 2024 10:18 am

Lakshadweep

Follow us on

Lakshadweep: భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్‌ వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డన నడుస్తూ, కూర్చుని ఫొటోలు దిగారు. సముద్రంలో స్కోర్నెలింగ్‌ చేశారు. తర్వాత సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్లో పర్యటించాలని ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. లక్ష్యద్వీప్‌ తనకు ఎందుకు నచ్చిందో వివరించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలనూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడు యావత్‌ భారతదేశమే కాదు.. ప్రపంచంలోని చాలా మంది లక్ష్యద్వీప్‌ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మాల్దీవులకు టికెట్‌ బుక్‌చేసుకున్నవారు రద్దు చేసుకుంటున్నారు. లక్ష్యద్వీప్‌కు ఎలా వెళ్లాలని ఆరా తీస్తున్నారు. దీంతో మాల్దీవుల మంత్రులు మోదీపై ఎక్స్‌ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్, సల్మాన్‌ఖాన్, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంటి ప్రముఖులు భారత తీరాలు, దీవులకు మద్దతుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇంతగా చర్చ జరుగుతున్న లక్ష్యద్వీప్‌ ఎక్కడ ఉంది.. అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి.. ఎంత ఖర్చవుతుంది.. అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి.. సాహస క్రీడలు ఎలా ఉంటాయి అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే అందరికీ ఉపయోగపడే వివరాలతో మీకోసం..

ఎలా వెళ్లాలి?
లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం. అక్కడికి వెళ్లడానికి నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్‌ ఉంటుంది. అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలిక్యాప్టర్లలో లక్షద్వీప్‌ చేరుకోవచ్చు. ఇక, కొచ్చికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.

విమాన సర్వీసులు..
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి ప్రతిరోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్లేందుకు నెల రోజుల ముందు ప్లాన్‌ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి విమాన టిక్కెట్‌ కనీస ధర రూ. 4,500 ఉంటుంది. లక్ష్యద్వీప్‌లో ఉన్న ఏకైక విమానాశ్రయం ‘అగత్తి’లో ఉంది. కొచ్చి నుంచి అగత్తి వెళ్లడానికి విమాన టికెట్‌ ధర రూ.5,500 ఉంటుంది.

రైలు మార్గంలో..
ఇక లక్షద్వీప్‌ వెళ్లడానికి మొదట కొచ్చికి చేరుకోవాలంటే.. ఈనగరానికి సమీపంలో ఉన్న ఎర్నాకులం టౌన్‌ లేదా.. ఎర్నాకులం జంక్షన్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.

– హైదరాబాద్‌ డెక్కన్‌ రైల్వే స్టేషన్‌(నాంపల్లి) నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్‌ (కొచ్చి/ఎర్నాకులం)కు రోజూ శబరి ఎక్స్‌ప్రెస్‌(17230) నడుస్తుంది. ప్రయాణ సమయం 23:35 గంటలు.

– ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి కేరళ వెళ్లడానికి దాదాపు 7 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేరళ ఎక్స్‌ప్రెస్, అలప్పీ ఎక్స్‌ప్రెస్‌ రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉటాయి.

– ఏపీలోని విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలప్పీ–బొకారో ఎక్స్‌ప్రెస్‌ రోజూ కేరళకు వెళ్తుంది. దాని ప్రయాణ సమయం 28:05 గంటలు

రోడ్డు మార్గంలో ఇలా..
ఇక కేరళలోని కొచ్చి పట్టణాన్ని పొరుగు రాష్ట్రాలతో జాతీయ రహదారి అనుసంధానిస్తుంది. ముంబై, కోజి కోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలిపే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది. కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ సాగే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది. దీంతో ఆయా నగరాల నుంచి కొచ్చికి రోడ్డు మార్గాన వెళ్లొచ్చు.

నీటి, వాయు మార్గాలు..
ఇక లక్ష్యద్వీప్‌కు నీటి, వాయు మార్గల్లో కూడా చేరుకోవచ్చు. లక్ష్యద్వీప్‌ కొచ్చి గేట్‌వే లాంటిది. కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి. లక్ష్యద్వీప్‌లో ఉన్న ఏకైక విమానాశ్రయం అగత్తిలో ఉంది. ఇక్కడికి చేరకోవడానికి గంటన్నర సమయం పడుతుంది. ఇక కొచ్చి నుంచి అగత్తికి వెళ్లడానికి నెల రోజుల ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే టికెట్ ధర రూ.5,500 ఉంటుంది.

– జల మార్గం విషయానికొస్తే.. కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు ఏడు ప్రయాణికులు ఓడలు అందుబాటులో ఉన్నాయని ‘యూటీ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ లక్షద్వీప్‌’ అనే భారత ప్రభుత్వ వైబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్‌∙సీ, ఎంవీ లక్షద్వీప్‌ సీ, ఎంవీ లాగూన్, ఎంవీ కోరల్స్, ఎంవీ అమిందివి, ఎంవీ మినీ కాయ్‌ అనే ఓడలు అటూ ఇటూ తిరుగుతుంటాయి. మనం ఏ దీవులకు వెళ్లాలో నిర్ణయించుకున్నాక ఆ దీవుల దూరం ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం 14 నుంచి 18 గంటలు ఉంటుంది. ఇక ఓడల్లో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ (రెండు బెర్తులు), సెకండ్ క్లాస్ ఏసీ (నాలుగు బెర్తులు) ఉంటాయి. ఓడలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఓడను బట్టి, క్లాస్‌ల ఆధారంగా టిక్కెట్‌ ధరలు రూ. 2,200 నుంచి గరిష్టంగా రూ.6 వేల వరకు ఉంటాయని ట్రిప్‌ ట్రావెలింగ్‌ గైడ్‌ అనే వైబ్‌సైట్‌ పేర్కొంది.

అనుమతి తప్పనిసరి..
ఇక అన్నింటికంటే ముఖ్య విషయం ఏమిటంటే.. లక్ష్యద్వీప్‌ వెళ్లాలంటే.. ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్‌ నుంచి అనుమతి తీసుకవోవాల్సి ఉంటుంది. ‘లకాదీవ్, మినీ కాయ్, అమిందివి ఐలాండ్స్‌ నిబంధనలు–1967’ ప్రకారం.. లక్షద్వీప్‌ స్థానికులు కాని వారంతా అక్కడికి వెళ్లడానికి, ఉండటానికి తప్పనిసరిగా అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధనలు వర్తించవు. విదేశీయులు, టూరిస్టులు, మతబోధకులు/స్కాలర్లు, పర్యాటక అధికారులు/ప్రభుత్వ సిబ్బంది/ప్రభుత్వ సిబ్బంది బంధువులు, ఎల్పీడబ్ల్యూడీ సివిల్‌ వర్కు సంబంధించిన కాంట్రాక్టర్లు లేబర్లు, ఇతరుల కోసం అనుమతులు మంజూరు చేయడానికి వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు. వారి వివరాల కోసం https://epermit.utl.gov.in లింకును క్లిక్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అనుమతి నిరాకరణ, మంజూరు, పునరుద్ధరణ, ఇతర అంశాల్లో సహాయం కోసం కూడా కొన్ని మార్గదర్శకాలు, నియమ నిబంధనల్ని రూపొందించారు. ఇందులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయంటే..
భారత్‌ కు చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌. ఇది 36 దీవుల సమూహం. 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ దీవులు ప్రకృతి అందాలకు నెలవు. లక్షద్వీప్‌ రాజధాని కవరత్తి. కేరళ తీరప్రాంత నగరం కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని అన్ని దీవులు దాదాపు 220 నుంచి 440 కి.మీ దూరంలో విస్తరించి ఉంటాయి. లక్షద్వీప్‌ మొత్తం జనాభా దాదాపు 64 వేలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభాలో 96 శాతం ముస్లింలు ఉన్నారు. అక్ష్యరాస్యత 91 శాతం.

బంగారం ద్వీపంలో 61 మంది
లక్షద్వీప్ లో కేవలం 10 జనావాస ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. అవి కవరత్తి, అగత్తి, అమిని, కద్మత్, కిల్టాన్, చెట్లత్, బిత్రా, ఆందోహ్, కల్పేనీ, మినికాయ్‌. బిత్రాలో 271 మంది మాత్రమే నివసిస్తున్నారు. బంగారం ద్వీపంలో 61 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ మలయాళం మాట్లాడతారు. మినీకాయ్‌లో ప్రజలు మహే మాట్లాడతారు. దీని లిపి దివేహి. ఇక లక్ష్యద్వీప్‌లో ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్యూలార్‌ నెట్‌వర్క్‌లు మాత్రమే పనిచేస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్ని జనావాస ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ సేవలు కవరత్తి, అగత్తి ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడి ప్రజలు చేపలు పట్టడం, కొబ్బరి సాగు ద్వారా ఆదాయం పొందుతారు. ఇక్కడ పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందతోంది.

చూడదగిన ప్రదేశాలు
– లక్షద్వీప్లోని ముఖ్యంగా ఆరు ద్వీపాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. స్వర్ణ, అగత్తి, కద్మత్, మినీ కాయ్, కల్పేనీ, కవరత్తి ద్వీపాలు.

– కన్నీటి బిందువు ఆకారంలో ఉండే బంగారం ద్వీపం ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లు, టెన్షన్లకు దూరంగా ఉండేందుకు పర్యటకులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది.

– రాత్రిపూట సముద్ర తీరం నీలం రంగులో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ జనావాసం ఉండదు. అగత్తి నుంచి ఇక్కడికి రావడానికి విమానంతోపాటు హెలికాప్టర్‌ సదుపాయం కూడా ఉంటుంది. రైలు. రోడ్డు మార్గం లేదు.

– అగత్తి చాలా అందమైన ప్రాంతం. ఇక్కడే ఈ దీవుల్లోని ఏకైక విమానాశ్రయం ఉంది. భారతీయ విమాన సంస్థలు సేవలు అందిస్తాయి. ఇక్కడ 20 పడకల టూరిస్ట్‌ కాంప్లెక్సులను అధునాతన హంగులతో నిర్మించారు.

– కయాకింగ్, సెయిలింగ్, స్కీయింగ్ చేయవచ్చు. అడుగున గాజుతో నిర్మించిన బోట్లు ఇక్కడ అద్దెకు లభిస్తాయి. 20 నుంచి 35 మీటర్ల లోతు వరకు చూడగలిగేలా నీరు తేటగా ఉంటుంది.

– మినీకాయ్‌ ద్వీపం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి సంస్కృతి, భాష లక్ష్య ద్వీప్ లోని మిగతా దీవులకు భిన్నంగా ఉంటుంది.

– ఇది 11 గ్రామాల సమూహం. ఇక్కడ ఎన్నిక అయిన ‘బొడు కాకా’ అనే గ్రామపెద్ద పాలిస్తుంటారు. అన్ని అధికారాలు ఆయనకే ఉంటాయి. ట్యూనా ఫిషింగ్కు ఇది పెట్టింది పేరు. ఇక్కడ 1885లో బ్రిటిష్‌ వారు నిర్మించిన లైట్ హౌస్ ఉంది. ఇక్కడ వాటర్‌ స్పోర్ట్స్, చేంజింగ్‌ రూమ్స్‌ ఉంటాయి. పర్యాటకుల కోసం 3 టూరిస్ట్‌ కాటేజ్‌లు ఉన్నాయి.

– కవరత్తి చాలా అభివృద్ధి చెందిన ద్వీపం. ఈ ద్వీపం అంతటా 52 మసీదులు ఉన్నాయి. అన్నింటికంటే ఉర్జా మసీదు చాలా అందమైనది. ఈ మసీదుకు సమీపంలో ఒక బావి ఉంటుంది. అందులోన నీటికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.

ఎప్పుడు వెళ్లాలంటే..
లక్ష్యద్వీప్‌కు మే నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలం వెళ్లడానికి ఉత్తమ సమయం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 22 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.