Bandla Ganesh : బండ్ల గణేష్ కు షాక్.. సంవత్సరం పాటు జైలు శిక్ష.. ఇంతకీ ఏమైందంటే..

2017లో టెంపర్ సినిమా వ్యవహారంలో దర్శకుడు వక్కంతం వంశీకి రూ. 25 లక్షల చెక్ ఇచ్చారు. అది కూడా బౌన్స్ అవడంతో వంశీ కోర్టును ఆశ్రయించారు.

Written By: NARESH, Updated On : February 14, 2024 6:34 pm
Follow us on

Bandla Ganesh : నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కు పెద్ద షాక్ తగిలింది. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో విచారణ కోసమే నిర్మాత బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన్ని షాక్ కు గురు చేస్తూ తుది తీర్పు వచ్చింది.

ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది కోర్టు. అయితే ఈ కేసులోని ట్విస్ట్ ఏంటంటే.. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ నెలలోపు ఆయన అప్పీల్ చేసుకుని జైలు శిక్ష నుంచి బయటపడవచ్చు. అసలు విషయానికి వస్తే.. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ దాదాపు రూ. 95 లక్షలు తీసుకున్నారట. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో జెట్టి వెంకటేశ్వర్లకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు.

ఈ చెక్ బౌన్స్ కారణం వల్ల వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బండ్ల గణేష్ కు సంవత్సరం రోజులు జైలు శిక్ష, దానితో పాటు జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చులకు అదనంగా రూ. 10వేలు కూడా చెల్లించాలని పేర్కొంది. ఇక ఈ తీర్పును ఎగువ కోర్టుకు సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయనకు ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు.

ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే తరహాలో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు గతంలో బండ్ల గణేష్ కు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జూ. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు సంబందించి చెక్ బౌన్స్ కేసులో ఈ ఘటన చోటుచేసుకుంది. 2017లో టెంపర్ సినిమా వ్యవహారంలో దర్శకుడు వక్కంతం వంశీకి రూ. 25 లక్షల చెక్ ఇచ్చారు. అది కూడా బౌన్స్ అవడంతో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనలు విన్న కోర్టు ఆరు నెలల జైలు శిక్ష రూ. 15.86 లక్షల జరిమానా విధించింది.