Asia cup 2022: నాడు ధోని.. నేడు శనక.. అదే యువ జట్టు.. అచ్చం అలాంటి స్ఫూర్తినే.. మనకు మహేంద్రుడు తొలి టీ20 ప్రపంచకప్ అందిస్తే.. శ్రీలంకకు ధనుశ్ శనక ఆసియాకప్ ను అందించాడు. పైగా ఫైనల్లో గెలిచాక తనకు ఎంఎస్ ధోని స్ఫూర్తి అని.. అందుకే అతడి జెర్సీ నంబర్ 7 వేసుకుంటానని.. అతడి స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చి ప్రశాంతంగా మ్యాచ్ లు గెలిపించడం అలవాటు చేసుకున్నానని శ్రీలంక కెప్టెన్ సెలవిచ్చాడు.

వచ్చే ప్రపంచకప్ లో అసలు శ్రీలంక నేరుగా క్వాలిఫై కాలేదు. ఆ టీం క్వాలిఫైయర్స్ తో ఆడి ప్రపంచకప్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. టీ20లో టాప్ 8లు నేరుగా అర్హత పొందగా.. శ్రీలంక టాప్ 8లో లేకపోవడంతో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడాల్సి వస్తోంది. ఇంత వెనుకబడి ఉన్న శ్రీలంక ఏకంగా ఆసియాకప్ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లాంటి బలమైన జట్లను ఓడించింది. ఇదంతా యువకులతో కూడిన శ్రీలంక జట్టు చేసిన అద్భుతం.. ఆ జట్టు కెప్టెన్ శనక వ్యూహాలు, పట్టుదల, పోరాటం అచ్చం ధోనిని తలపించాయి. తనకు ధోనినే స్ఫూర్తి అనడం విశేషమే మరీ..
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పతాకస్థాయిలో ఉంది. డీజిల్, పెట్రోల్ దొరక్క దేశంలో కొట్టుకుంటున్నారు. నిత్యావసరాలు కొండెక్కాయి. దేశ అధ్యక్షుడు పారిపోయాడు. ఆ దేశంలో ఆటగాళ్లు గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేందుకు ఇబ్బందులు.. ప్లేయర్స్ ను తరలించేందుకు ఉపయోగించే బస్సులకు డీజిల్ దొరకని పరిస్థితి. దీంతో శ్రీలంకలో జరగాల్సిన ఆసియాకప్ యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. అసలు శ్రీలంకన్ టీం ఇక్కడ పాల్గొంటుందా? లేదా? అని అనుమానాలు. కానీ ఎలాగోలా కష్టపడి యూఏఈకి వచ్చింది శ్రీలంక టీం..
తొలి మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ చేతిలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 8 వికెట్ల తేడాతో భారీ ఓటమి చూశాక శ్రీలంక మారలేదని.. పని అయిపోయిందని.. అదో పసికూన అని అందరూ ఎద్దేవా చేశారు. శ్రీలంక కప్ కొడుతుందని అస్సలు కలలో కూడా ఊహించలేదు.
జట్టులో స్టార్ క్రికెటర్లు ఎవరూ లేరు. అంతా యువకులే.. శనక కొత్త కెప్టెన్ అయినా ఐకమత్యంగా ఆడి అపురూప విజయాలు సాధించారు. ఫైనల్ లో .. అంతకుముందు మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించి ఆసియాకప్ అందుకున్నారు. లంకేయుల పోరాటానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
కోచ్ సిల్వర్ వుడ్ పర్యవేక్షణ.. కెప్టెన్ ధసున్ శనక నాయకత్వంలో శ్రీలంక అద్భుతాలు చేసింది. ఆసియా కప్ కొట్టింది. దుబాయ్ పిచ్ పై టాస్ ఓడితే మ్యాచ్ ఓడినట్టే. ఇలానే భారత్ ఓడిపోయింది. కానీ శ్రీలంక ఆటగాళ్ల పట్టుదలకు టాస్ కూడా తలవంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినా శ్రీలంక గెలవడం ఒక చరిత్ర.పట్టుదల కసి ఉంటే ఎన్ని అడ్డంకులు అయినా అధిగమించవచ్చని నిరూపించారు.
మొత్తంగా.. 2007లో ధోని నాయకత్వంలో యువ టీం ఇదే చేసింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సాధించింది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించింది. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రీలంక అదే స్థితిలో అద్భుతం చేసింది. ధోని, శనక లాంటి కూల్ కెప్టెన్స్ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.