Ram Mandir: దేశమంతా రామనామస్మరణతో మార్మోగిపోతోంది. జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబయింది.. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దేశ విదేశాల నుంచి రామభక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను చూసేందుకు ఆతృతతో ఉన్నారు. అయితే రామాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతిరోజు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఆలయానికి సంబంధించి జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగనుంది. అయితే ఈ విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతానికి చెందిన అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. రామ్ లల్లా విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ తో పాటు మరో ఇద్దరు శిల్పులు మూడు ఆకృతుల్లో రూపొందించారు.. అయితే అందులో యోగి రాజ్ రూపొందించిన విగ్రహాన్ని అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఎంపిక చేసింది. యోగి రాజ్ మైసూర్ ప్రాంతానికి చెందిన శిల్పి. ఇతడు స్వర్ణకారుల కుటుంబంలో జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చిన్నప్పటినుంచి ఇతడు శిల్పకళ నైపుణ్యం పై మక్కువ పెంచుకున్నాడు. ఆ మక్కువే ఇతడిని ప్రఖ్యాత శిల్పిగా చేసింది. అందువల్లే ఇతడు రూపొందించిన రాముడు విగ్రహం అయోధ్య ఆలయంలో ప్రతిష్టాపనకు ఎంపికయింది. అరుణ్ యోగి రాజ్ గతంలో కేదార్ నాథ్ లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను రూపొందించారు. అయోధ్యలో ప్రతిష్టించే రాముడి విగ్రహాన్ని కూడా ఈయనే రూపొందించారు. విగ్రహాన్ని తయారు చేసే క్రమంలో ఆరు నెలల పాటు ఆయన మౌన దీక్ష పాటించారు. చివరికి ఫోన్ కూడా ఉపయోగించలేదు. అన్నట్టు ఈయన పూర్వీకులు కూడా దేవతామూర్తుల విగ్రహాల తయారీలో నిష్ణాతులు
యోగి రాజ్ రామ్ లల్లా విగ్రహాన్ని 150 నుంచి 200 కిలోల బరువుతో రూపొందించారు. అయితే గత 70 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రామ్ లల్లా ప్రస్తుత విగ్రహాన్ని కూడా కొత్త ఆలయ గర్భగుడిలో ఉంచుతారు. అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి హాజరుకారున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ ట్రస్ట్ ద్వారా 7000 మందికి పైగా ఆహ్వానాలు అందాయి. రామ మందిరం ప్రతిష్టాపనకు సంబంధించి కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రామ్ లల్లా ప్రతిష్టాపనకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు కూడా అదే రోజు నుంచి మొదలవుతాయి. జనవరి 16 నుంచి 22 వరకు వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనవరి 16
ఆలయ ట్రస్ట్ నియమించిన పూజారి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, సమర్పణ నిర్వహిస్తారు.
జనవరి 17
రామ్ లల్లా విగ్రహ ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయు నది జలాన్ని మోసే భక్తులు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటారు.
జనవరి 18
గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణవరం, వాస్తు పూజలతో అధికారిక ఆచారాలు ప్రారంభమవుతాయి.
జనవరి 19
పూజ క్రతువులో భాగంగా పవిత్ర అగ్నిని వెలిగిస్తారు. తర్వాత నవగ్రహ, హవన్ (అగ్ని చుట్టూ ఉన్న పవిత్ర కర్మ) స్థాపన జరుగుతుంది.
జనవరి 20
రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయు నీటితో కడుగుతారు. తర్వాత వాస్తు శాంతి, అన్నా దివాస్ ఆచారాలు నిర్వహిస్తారు.
జనవరి 21
రామ్ లల్లా విగ్రహానికి 125 కళశాలతో స్నానం చేయించి, చివరికి శంకుస్థాపన చేస్తారు.
జనవరి 22
ప్రధాన ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22 మధ్యాహ్నం 12:30 కు ప్రారంభమవుతుంది. అదే రోజు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. చివరి రోజు జరిగే ముడుపుల మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరవుతారు. జనవరి 21, 22న ప్రత్యేక పూజల అనంతరం 23 నుంచి భక్తుల సందర్శనార్థం రామాలయాన్ని తెరుస్తారు.