https://oktelugu.com/

Ambedkar statue : అంబేద్కర్ విగ్రహం ఆకాశానికి ఎదుగుతుంటే.. ఆ పత్రిక పాత్రికేయ విలువలు పాతాళానికి పడిపోతున్నాయా?

చివరికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ని ఉద్దేశించి శ్రీధర్ తో ఎలాంటి కార్టూన్స్ గీయించాడో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. పాత్రికేయమంటే నిష్పక్షపాతంగా ఉండాల్సిన చోట ఒక ఎజెండా పెట్టుకొని పని చేయడం..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 19, 2024 / 05:19 PM IST
    Follow us on

    Ambedkar statue : జగన్ మీద ఈనాడు రామోజీరావు కోపం రోజురోజుకు పెరిగిపోతున్నట్టుంది. అది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈరోజు విజయవాడలో జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే వేళ.. రామోజీరావు శివాలెత్తి పోయాడు. ఏకంగా ఒక ఫుల్ పేజీలో జగన్మోహన్ రెడ్డిని కడిగిపారేశాడు. దార్శనికుడి దివ్యస్మృతికి దారుణమైన అవమానం ఇది అంటూ రాజ్యాంగంలో పది అంశాలను ఏకరవు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే కనీస అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని తేల్చి పారేశాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని కాదు.. రామోజీరావు సుద్ద పూస అని చెప్పడం లేదు. జగన్ అంటే రామోజీరావుకు పడకపోవచ్చు. అతడు ముఖ్యమంత్రి కావడం రామోజీరావు ఇష్టం లేకపోవచ్చు. ప్రజలు ఎన్నుకున్న జగన్ ను ఒక ముఖ్యమంత్రి లాగా ఈనాడు గుర్తించలేకపోతోంది. ఇదే ఈనాడు గత ఏడాది కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు అరి వీర భయంకరమైన లెవల్లో కవరేజీ ఇచ్చింది. అంబేద్కర్ విగ్రహం గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసింది. అదే జగన్ అంతకంటే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అంకమ్మ శివాలు పెడుతున్నది. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కు జగన్ కు లేదని చెబుతోంది.

    పది అంశాలు ప్రస్తావించుకుంటూ జగన్ ను విమర్శించిన రామోజీరావు.. చంద్రబాబు విషయం లో రాయగలడా? ఎందుకంటే చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి.. ఇష్టమైన వ్యక్తి కాబట్టి రామోజీరావు రాయడు, రాయలేడు. ఇదే రామోజీరావు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో వార్తలు రాశాడో తెలియదా? చంద్రబాబును వెనకేసుకొచ్చుకుంటూ ఎలాంటి రాతలు రాశాడో అప్పటి వారికి విధితమే. చివరికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ని ఉద్దేశించి శ్రీధర్ తో ఎలాంటి కార్టూన్స్ గీయించాడో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. పాత్రికేయమంటే నిష్పక్షపాతంగా ఉండాల్సిన చోట ఒక ఎజెండా పెట్టుకొని పని చేయడం..నచ్చని వాళ్ళ మీద బురద చల్లడం అది రామోజీరావుకే చెల్లింది. అక్షరమక్షరం వివరించుకుంటూ రాసిన ఫుల్ పేజీ వ్యాసంలో జగన్ మీద విషం తప్ప పెద్దగా విషయమేమీ అందులో లేదు. పైగా నాగ లోకం అని రాశారు. పాత్రికేయ విలువలు పాదుకొల్పిన రామోజీరావుకు నాక లోకం అని రాయాలని తెలియదా. ఆంధ్రప్రదేశ్లో అదికూడా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. దాని గురించి రాయాల్సింది పోయి.. ఒకవేళ ఇష్టం లేకుంటే రాయడం మానేసినా ఇబ్బంది లేదు. అణగారిన వ్యక్తుల ఆత్మగౌరవానికి సంకేతం లాగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఇలాంటి రాతలు రాయడం ఏమిటో రామోజీ రావుకే తెలియాలి. ఇలాంటి రాతల ద్వారా జనం ఏమనుకుంటున్నారో అనే సోయి కూడా లేకపోతే ఎలా?!

    వాస్తవానికి వైయస్ కాలం నుంచి రామోజీరావుకు ఆ కుటుంబం అంటే కోపం ఉంది. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి విషయంలో చాలా ఒత్తులు వత్తాడు కదా.. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా కోర్టు కేసులు కూడా వేయించాడు కదా.. గోనె ప్రకాష్ రావు ద్వారా అందులో ఉన్న లొసుగులను, రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించిన భూముల వివరాలను అన్ని చెప్పించాడు కదా.. అప్పట్లో అంటే వైయస్ సరిగ్గా గట్టి అడుగులు వేయలేకపోయాడు కానీ.. జగన్ మాత్రం రామోజీరావు టార్గెట్ గా, మార్గదర్శి లక్ష్యంగా అనేక ఎత్తులు వేశాడు. ఒకానొక దశలో రామోజీరావును జైలుకు పంపించేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఏదో కేసీఆర్ వల్ల అది తప్పిపోయింది కానీ లేకుంటే సీన్ వేరే విధంగా ఉండేది. క్యాన్సర్ తో బాధపడుతున్న రామోజీరావు.. ఈ వయసులో జగన్ పై అంత కోపం ప్రకటించాల్సిన అవసరం ఏమిటో అంతుపట్టదు.. మార్గదర్శిలో లొసుగులు బయట పెడితే రెచ్చిపోతున్న రామోజీరావు.. సీతమ్మధార స్థలం విషయంలో, విజయవాడ కార్యాలయం విషయంలో చేసినదేమిటి? ఫిలిం సిటీ లో అసైన్డ్ భూములకు సంబంధించి చేస్తున్నదేమిటి? అంటే వారు చేస్తే సంసారమనేనా? పాపం ఈనాడు.. అంబేద్కర్ విగ్రహం ఆకాశానికి ఎదుగుతుంటే.. ఆ పత్రిక పాత్రికేయ విలువలు పాతాళానికి పడిపోతున్నాయి.