Homeఎంటర్టైన్మెంట్Tollywood Loop Holes : టాలీవుడ్ దోపిడీ : పేరు, కోట్లు దర్శకుడికి.. కష్టం రైటర్లదీ.....

Tollywood Loop Holes : టాలీవుడ్ దోపిడీ : పేరు, కోట్లు దర్శకుడికి.. కష్టం రైటర్లదీ.. ఎన్నాళ్లీ యాతన

Tollywood Loop Holes  ఒక్క అక్షరం ఎన్ని భావాలైనా పలికిస్తుంది.. ఒక్క దృశ్యం లక్షల మందిని కదిలిస్తుంది.. అలాంటి అక్షరాలు, అలాంటి దృశ్యాలు జనం ముందుకు రావాలి అంటే మెదడులో మేథోమథనం జరగాలి. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి మెదళ్లు వెలుగులోకి రావడం లేదు. వాటిని ఆసరాగా చేసుకుని, డబ్బులను ఎరగా చూపించి మొద్దు బారిన మెదళ్ళు ఉన్న దర్శకులు తమ సొంత క్రెడిట్ గా భావించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇతరులకు అవకాశాలు దక్క నీయకుండా తామే ఇండస్ట్రీలో పాతుకుపోతున్నారు.

ఘోస్ట్ రైటర్లు అనేవారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉండేవారు కాదు. ఆదుర్తి సుబ్బారావు వంటి దిగ్గజ దర్శకుడు కూడా తనకు ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే వారి పేర్లు కచ్చితంగా స్క్రీన్ కార్డుపై వేయించేవారు. తగిన పారితోషికం కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బులు తప్ప పేరు మాత్రం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. టాప్ డైరెక్టర్లు మొత్తం ఇలానే వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఎంతో భవిష్యత్తు ఉన్నవారు వెలుగులోకి రాకుండా పోతున్నారు.. పైగా అనేక అడ్డంకులు దాటుకొని దర్శకత్వం వైపు వెళ్తే వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు.. దీనివల్ల టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు రావడం లేదు.. అదే కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లో అయితే కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి.. అక్కడ సినిమాలు తీస్తోంది కూడా కొత్త తరహా ఆలోచన విధానం ఉన్నవాళ్లే.. ఉదాహరణకు కేజిఎఫ్ తీసుకుంటే అప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఉగ్రం అనే సినిమా మాత్రమే తీశాడు.. కానీ కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి, తన స్క్రిప్ట్ రైటింగ్ లో భాగస్వాములను చేసి, వారికి క్రెడిట్ ఇచ్చి కేజిఎఫ్ సిరీస్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు రాబోయే సలార్ కూడా అదే తరహాలో ఉంటుందని హింట్స్ ఇచ్చాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ జై చిరంజీవ సినిమా వరకు కె విజయభాస్కర్ కు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తర్వాత నువ్వే నువ్వే నుంచి ఆయన దర్శకుడిగా మారారు. ఇవాళ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అదే విజయభాస్కర్ ‘ప్రేమకావాలి’ సినిమా తర్వాత ఇంతవరకు కనిపించలేదు. అంటే త్రివిక్రమ్ అలాగే ఉండిపోతే వెలుగులోకి వచ్చేవాడు కాదు. కానీ అలా త్రివిక్రమ్ కు అవకాశాలు ఇస్తోంది ఎంతమంది? తొక్కి పెడుతున్నది ఎంతమంది. అప్పట్లో శ్రీను వైట్ల తీసే సినిమాలకు కోన వెంకట్, గోపి మోహన్ కథలు అందించేవారు. అలా వారు అందించిన కథలతోనే రెడీ, దూకుడు, బాద్ షా వంటి బ్లాక్ బస్టర్లు పడ్డాయి. కానీ ఎప్పుడైతే శ్రీనువైట్ల వారిని పట్టించుకోవడం మానేశాడో వారు కూడా దూరం జరగడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు శ్రీను వైట్ల కెరియర్ అగమ్య గోచరంగా మారింది. వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో ఉంది.

ఎవరు రాయకపోతే మాటలు పుట్టవు. అలాగే ఎవరికీ అవకాశాలు ఇవ్వకపోతే కొత్త తరహా కథలు తెరమీదకు రావు.. అసలే టన్నుల కొద్ది హిప్పోక్రసీ ఉండే ఇండస్ట్రీలో హీరోలను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. పైగా తెలుగు హీరోలకు విపరీతంగా ఈగో ఉంటుంది.. వీటన్నింటిని దాటుకొని రావాలంటే కొత్త తరహా రచయితలకు ఎంత కష్టం, మరెంత నష్టం. పైగా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు చాలామంది యువకులకు ఆ నెల జీతం చొప్పున పని చేయించుకుంటూ ఉంటాయి.. కథా రచనలో వారి సారాన్ని మొత్తం పిండుతూ ఉంటాయి.. ఇండస్ట్రీని ఏలేద్దాం అనే ఆలోచనతో ఉన్నవారు కసిగా రాస్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత కనీసం వారికి ఏమాత్రం క్రెడిట్ కూడా దక్కదు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆహ్వానం ఉండదు. వాళ్ళ అవసరాలు ఆసరాగా తీసుకొని మళ్లీ ఎంతో కొంత పారితోషికమిచ్చి రాయించుకుంటూ ఉంటారు.. అప్పటికే స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఒక వ్యసనంగా మారుతుంది కాబట్టి ఇతర వ్యాపకంలోకి వెళ్ళలేరు. ఇదే విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్తే.. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేయలేము అంటారు. ఇప్పుడు ఉన్న పెద్ద దర్శకులు ఒకప్పుడు కొత్త వాళ్లే కదా.. వాళ్లకు ఎవరో ఒకరు అవకాశాలు ఇస్తేనే కదా ఇవాళ ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇదే విషయాన్ని వారు విస్మరిస్తారు ఘోస్ట్ రైటర్లతో బండెడు చాకిరీ చేయించుకుంటారు.

ఇలా రైటర్ల ప్రతిభను తమ క్రెడిట్ గా చెప్పుకున్న దర్శకులంతా ఇవాళ ఫేడ్ అవుట్ అయ్యారు. ఇక ఇలాంటి పరిస్థితులు చూసి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ విడుదల చేస్తున్నారు.. అవకాశాలు దక్కించుకుంటున్నారు. శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, గౌతమ్ తిన్ననూరి… వీరంతా కూడా ఇలాంటి వారే.. అందుకే ఒకరి దగ్గర పని చేయకుండా.. అవకాశాలను సృష్టించుకుంటే ఎవరైనా కాళ్ళ దగ్గరికి వస్తారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular