APNGO Association: ఉద్యోగుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో అవసరమైతే పోరాటం చేస్తాయి. అనుకున్నవి సాధించుకుంటాయి. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. ప్రభుత్వం పై పోరాటం వద్దన్న సంఘాలున్నాయి. తాము సీఎం జగన్ కి, ప్రభుత్వానికి విధేయులమని ప్రకటించుకున్న ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. ఉద్యోగుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. అధికార పార్టీకి కొమ్ముకాసిన సంఘాల నేతలు కోకొల్లలు. పతాక స్థాయిలో ఉన్న ఉద్యమంపై నీళ్లు పోసిన వారూ ఉన్నారు. అయితే ఇదంతా ప్రభుత్వ చీలికలు, పేలికలతోనే ఉద్యోగ సంఘాల నాయకులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారుతున్నారు.
ఏకంగా తీర్మానం..
ఇప్పుడు తాజాగా ఏపీఎన్జీవో సంఘం ఒక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంపై పోరాడే ప్రశ్నే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తన సంఘంలో తీర్మానం చేయించేశారు. ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏర్పడిన ఓ సంఘం తాము పోరాడకూడదని తీర్మానం కూడా చేస్తుందా అని ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఏపీలో ఏదైనా సాధ్యమేనని బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ ఎన్జీవో సంఘం నిరూపించింది. అయితే ఇది భయమా? లేకపోతే ప్రభుత్వానికి అమ్ముడుపోయారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే గతంలో సైతం ఉద్యోగ సంఘాల నేతలు ఇదే రీతిన వ్యవహరించిన సందర్భాలున్నాయి.
అష్టకష్టాలు పడుతున్నా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కష్టాలు మొదలయ్యాయి. జగన్ తో తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ ఇప్పుడు జీతాలు, పెన్షన్లకు కటకటలాడిపోతున్నారు. కనీసం జీతాలైనా ఇవ్వండి మహా ప్రభో అంటున్నారు. ఓ వైపు వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ రద్దు చేయలేదు. హెల్త్ కార్డులు పని చేయడం లేదు. డీఏలు ఇస్తామన్నవి ఇవ్వడం లేదు. పీఆర్సీ పేరుతో జీతాలు తగ్గించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందే మధ్యంతర భృతి ఇరవై శాతం ఇచ్చింది.ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా… ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఆలోచన చేయకపోగా… మధ్యంతర భృతి ఇచ్చే చాన్స్ కూడా లేదు. అయినా సరే అంత సవ్యంగా ఉంది.. ప్రభుత్వంపై అనవసరంగా పోరాటం ఎందుకన్న రీతిలో ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఆ రెండు సంఘాలు..
అయితే అన్ని సంఘాలను ఒకే తాటిలో పెట్టేయ్యలేం. బండి శ్రీనివాసరావు తీరు చర్చనీయాంశంగా మారగా.. ఇతర సంఘాల నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణలు మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. ప్రభుత్వంపై తమ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా వీరి సంఘాల వైపు ఆకర్షితులవుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం …ఇదే పద్దతిలో ఉంటే.. త్వరలో నిర్వీర్యం అయిపోతుందన్న వ్యాఖ్యలు ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. పోరాడలేనప్పుడు, ఉద్యోగుల హక్కుల కాపాడలేని సంఘం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్జీవోల సంఘం నిర్వీర్యమైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.