జనసేనాని పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ కుక్కలంటే.. ఏపీ మంత్రి పేర్ని నాని ‘పందులు’ అంటున్నారు. వీరిద్దరి మధ్య జంతువులను తీసుకొచ్చి ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్న వైనం చర్చనీయాంశమైంది. మాటల మంటలు మరీ గలీజు రాజకీయంగా మారుతోంది. వ్యక్తిగతంగా తిట్టుకునే వరకూ సాగుతోంది. సినిమా టికెట్లు, ఆన్ లైన్ టికెటింగ్.. సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న తీరును ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి మొదలైన ఈ మాటల దాడి ఇప్పటికీ తగ్గడం లేదు. పెరుగుతూనే ఉంది.

పవన్ విమర్శల మరుక్షణం ఏపీ మంత్రులు రంగంలోకి దిగి పవన్ పై విరుచుకుపడ్డారు. నిన్న సినీ ఇండస్ట్రీకి చెందిన వైసీపీ సానుభూతి పరుడు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అయితే పవన్ ను వ్యక్తిగతం దూషించాడు. ఆయన పర్సనల్ విషయాలను ఎత్తిచూపాడు. దీనిపై పవన్ సైతం గట్టిగా బదులిచ్చాడు. ‘మొరిగే కుక్కల’ వీడియోను పోస్టు చేసి ఒక కవితను షేర్ చేశాడు. వైసీపీ మద్దతు దారులను ‘మొరిగే కుక్కులు’గా పోల్చి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ మద్దతుదారులకు కౌంటర్ గా పవన్ కళ్యాన్ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. ‘‘‘హు లైక్ ద డాగ్ సౌండ్’ అనే పాపులర్ కుక్కలపై పాటను షేర్ చేశాడు. దీనికి ‘‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. సహజమే…’’ అంటూ క్యాప్షన్ పెట్టి వైసీపీ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తాజాగా మంత్రి పేర్ని నాని సైతం బదులిచ్చారు. పవన్ శైలిలోనే ఒక కవితను ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘జనం ఛీత్కారాలు.. ఓటర్ల తిరస్కారాలు.. తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న‘మస్కా’రాలు’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై ఓ ట్రోల్ వీడియోను పోస్ట్ చేశారు.
దీంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ ముదిరిపాకాన పడింది. కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా సాగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే సాగుతోంది.