AP Minister Land Scam : రైతుల భూముల పై రాజకీయ రాబందులు వాలుతున్నాయి. కారుచౌకగా కాజేస్తున్నాయి. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. సీమ రైతును నిండా ముంచేస్తున్నాయి. నిలువ నీడలేకుండా దోచేస్తున్నాయి. రాజకీయ అండ దండలతో సాగుతున్న భూస్వాహా ఇది. ఏపీ మంత్రి ఆదేశాలతో సాగుతున్న తంతు ఇది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి వికృత రాజకీయ క్రీడకు సజీవ సాక్ష్యం ఇది.

దేశంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కర్బన ఉద్గారాలు అధిక మొత్తంలో విడుదల అవుతాయి. ఫలితంగా పర్యావరణానికి హాని చేకూరుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గించి.. ప్రత్యామ్నాయ పద్దతుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయా రాష్ట్రాలను కూడ ఆదేశించింది. సూర్యుడు, గాలిని ఉపయోగించి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. విండ్ టర్బైన్స్ తిరగడానికి నిర్ణీత గాలి అవసరం ఉంటుంది. ఎత్తైన భూభాగంలోనే విండ్ టర్బైన్స్ తిరగడానికి గల గాలి అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశంలో ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పవన విద్యుత్ ఉత్పత్తికి గాలి మరలను ఏర్పాటు చేశారు.
ఒక్కో గాలి మర ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. అందుకు కావాల్సిన భూమిని స్థానిక రైతుల నుంచి సేకరించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఇచ్చి విండ్ పవర్ జనరేషన్ కంపెనీలు భూమిని కొనుగోలు చేశాయి. రెండు దశల్లో ప్లాంటు విస్తరణకు అవసరమైన భూమిని ఒకేసారి రైతుల నుంచి కంపెనీలు కొనుగోలు చేశాయి. ఉదాహరణకు ఒక గాలి మర ఏర్పాటు చేయడానికి ఐదెకరాల స్థలాన్ని విండ్ పవర్ జనరేషన్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఐదెకరాల్లో కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే గాలి మరలను ఏర్పాటు చేస్తారు. మిగిలిన మూడు ఎకరాల్లో సంబంధిత రైతులు భూమిని సాగు చేసుకోవచ్చు. ఈ ఒప్పందం మేరకు రైతులు భూమిని కంపెనీలకు అమ్మేశారు.
రైతుకు భూమి అమ్మగా డబ్బు వచ్చింది. అదే సమయంలో గాలి మరలు ఏర్పాటు చేయగా మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకునే అవకాశం దొరికింది. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసకోవడానికి అప్పుల్లో ఉన్న రైతులు భూమిని కంపెనీలకు అమ్మేశారు. తద్వార భూమి పై ఉన్న అప్పును తీర్చేసుకున్నారు. మిగిలిన భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే సమయంలోనే రాజకీయ రాబందులు రైతుల భూముల పై వాలాయి. రైతుల భూముల్లో రిసార్టు పేరుతో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రశ్నించిన వారి పై ఎదురు దాడి చేశారు. చేసేది లేక రైతులు మిన్నుకుండిపోయారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుజలాన్ గుజరాత్ విండ్ పార్క్ కంపెనీ వందల ఎకరాల రైతుల భూములు కొనుగోలు చేసింది. మొదటి దశలో గాలి మరలు ఏర్పాటు చేసి పవన విద్యుత్ ఉత్పత్తి చేసింది. రెండో దశలో ప్లాంటు విస్తరణ కోసం ఎదురు చూసింది. కానీ ఇంతలోనే రాజకీయ రాబందులు భూములను కంపెనీ నుంచి తన్నుకెళ్లాయి. ఒకవైపు కంపెనీ..రెండో వైపు రైతులు నిండా మునిగిపోయారు. మిగిలిన వివరాలు రెండో పార్ట్ లో సవివరంగా అందజేస్తాము.