AP Cast Politics: తెలంగాణలో కులాల కొట్లాట తక్కువ. అదే ఏపీలో కులం కోసం కలబడుతారనే టాక్ ఉంది. ఆ జాఢ్యం బాగా ఎక్కువంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలు కూడా ఈ కులాల కుంపట్లపైనే జరగబోతున్నాయట.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. కులాల వారీగా చీలిపోతున్నాయి. ఇటీవల ‘మా’ ఎన్నికలు చూశాక కాపుల నేతృత్వంలోని మెగా ఫ్యామిలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన మంచు విష్ణు గెలుపు సునాయాసమైంది. మంచు విష్ణుకు ఏపీ సీఎం జగన్ పరోక్ష మద్దతుతో ఇక్కడ రెడ్డీస్ కూడా విష్ణు వెంటే నడిచారు. దీంతో మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి టాలీవుడ్ లో గండి పడింది. మరోసారి అలాంటిది పునరావృతం కాకుండా రాజకీయంగా సరైన అడుగులు వేయడానికి చంద్రబాబు, పవన్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఏపీ భవిష్యత్ రాజకీయాలను ఇది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో రాజ్యాధికారం అనేది కాపుల కల. ఆ కల చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బాగా వ్యక్తమైంది. ఆయన రాజకీయ సన్యాసంతో ఊసురుమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కాపులు ఆశలు పెట్టుకున్నారు. మధ్యలో ముద్రగడ లాంటి వారు కాపు ఉద్యమాన్ని రగిలించినా కడవరకూ తీసుకెళ్లలేకపోయారు.
వచ్చే 2014 ఎన్నికలు బలమైన రెడ్డి సామాజికవర్గం నేతృత్వంలోని జగన్ కు చంద్రబాబు+పవన్ కు మధ్యే జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో విడిపోయి చిత్తుగా ఓడిన చంద్రబాబు, పవన్ లు వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు చేయరనే అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం తాజాగా బద్వేలు ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాట జవదాటకుండా పోటీనుంచి వైదొలిగి ఏకగ్రీవానికి సహకరించారు. అదే సమయంలో పోటీకి దిగి బీజేపీ వ్యతిరేక నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా బలమైన వైసీపీని, జగన్ ను ఓడించాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలైన చంద్రబాబు, పవన్ లు కలవాల్సిందే.. పోయిన సారి కలవకుండా వీరి సామాజికవర్గాలు కూడా జగన్ ను గెలిపించిన పరిస్థితి. అందుకే ఇప్పుడు కలవక తప్పని పరిస్థితి. ఈ మేరకు పవన్ పై జనసేన నుంచి కూడా ఒత్తిడి తీవ్రమైనట్టు సమాచారం.
ఇక చంద్రబాబు, పవన్ కలిస్తే కమ్మ, కాపు ఓటు బ్యాంక్ ఏకమవుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మరో మాస్టర్ ప్లాన్ ను వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో రచిస్తున్నట్టు సమాచారం. కమ్మ+కాపులకు పోటీగా రెడ్డీస్+నాన్ రెడ్డీస్ ను ఏకంగా చేసే పనిలో పడ్డారు. ఇందులో అత్యధికంగా ఉన్న బీసీలు, దళితులను ఆకర్షించి చంద్రబాబు, పవన్ లను చావుదెబ్బ తీసే ప్లాన్ ను తెరపైకి తెచ్చాడట.. మరీ ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? వీళ్లంతా విడిపోయి ఓట్లు వేస్తారా? విజయం ఎవరికి దక్కుతుందనేది వేచిచూడాలి.