https://oktelugu.com/

Gaddar Vimala Story : భేష్‌ ఆంధ్రజ్యోతి.. చదవాల్సిన ఇంటర్వ్యూ ఇది.. కన్నీరు పెట్టుకోవాల్సిన సందర్భం ఇది

గుండెల నిండా ఆర్థ్రత.. వాస్తవానికి నెగిటివిటీ నిండిన సమాజంలో, సో కాల్డ్‌ వార్తలతో నిండిపోయిన మీడియాలో ఇలాంటివే పాజిటివిటీని పెంచుతాయి.

Written By:
  • Rocky
  • , Updated On : August 13, 2023 7:22 pm
    Follow us on

    Gaddar Vimala Story : విమల.. గద్దర్‌ సహచరి మాత్రమే కాదు.. ఆయనలో సగానికి మించి. గుండె సంబంధిత వ్యాధి గద్దర్‌ను తీసుకెళ్లిపోయిన తర్వాత ఆమెకు కంటికి ధారగా విలపిస్తోంది. గద్దర్‌ శాశ్వతంగా నిద్రించిన బోధి పాఠశాలను మనసులో తలచుకుంటూ విషణ్ణవదనంలో మునిగిపోయింది. ఇంతకీ గద్దర్‌తో ఆమెకు ఎలాంటి అనుబంధం ఉంది? విప్లవ నేపథ్యం ఉన్న గద్దర్‌తో ఆమెకు అనుబంధం ఎలా ఏర్పడింది? ఇంకా చాలా విషయాల మీద ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో విమల ఇంటర్వ్యూ ప్రచురితం అయింది. మొత్తం చదువుతుంటే ఒకింత ఉద్వేగం.. గుండెల నిండా ఆర్థ్రత.. వాస్తవానికి నెగిటివిటీ నిండిన సమాజంలో, సో కాల్డ్‌ వార్తలతో నిండిపోయిన మీడియాలో ఇలాంటివే పాజిటివిటీని పెంచుతాయి.

    విమల పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో. విమలకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఆమె తండ్రి పేరు రాజలింగం. మేస్త్రీగా పనిచేసేవాడు. కడు బీద కుటుంబం. విమల రెండో అక్క మామ రామస్వామి ద్వారా గద్దర్‌ గురించి రాజలింగం కుటుంబానికి తెలిసింది. ఆరోజుల్లో ముహూర్తాలు, లగ్నపత్రికలు లాంటివేమీ లేకుండా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిమాయత్‌ నగర్‌లోని హనుమాన్‌ మందిరం ప్రాంగణంలో 1975, నవంబరు 9న ఒకరికొకరం దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి గద్దర్‌ కొత్త దుస్తులు కూడా కొనుక్కోలేదు. అది గమనించిన విమల తాత అప్పటికప్పుడు తన గాంధీ టోపీ తీసి ఆయన నెత్తిమీద పెట్టారు. వాళ్లను దీవించేందుకు వచ్చిన అతిథులకు ఛాయ్‌, బిస్కెట్‌ ఇచ్చారు. అలా వారి పెళ్లికి అయిన ఖర్చు కూడా అంతా కలిసి రూ.40 లోపే. పెళ్లికి మూడు రోజుల ముందే గద్దర్‌కు కెనరా బ్యాంకు క్లర్కుగా జాయినింగ్‌ ఆర్డర్‌ వచ్చింది. ఆ విషయం విమల బంధువులకు చెబితే… ‘పాటలు పాడుతూ తిరిగే నీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది’ అని అంతా నవ్వారు.

    చిన్నగదిలో కాపురం…

    పెళ్లి అయ్యాక రెండు రోజులు గద్దర్‌ సోదరి ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత మారేడుపల్లిలో చిన్నగది ఒకటి కిరాయికి తీసుకున్నారు అదీ మెట్ల కింద ఉండేది. దానిలోనే వారి సంసార జీవితం మొదలైంది. అప్పుడు వారి సామాను అంటే ఒక చాప, కిరోసిన్‌ స్టవ్‌, రెండు వంట పాత్రలు… అంతే. అప్పటికే విమల ఎర్రగడ్డ మీటరు ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేస్తోంది. అప్పుడు ఆమె నెల జీతం పన్నెండు రూపాయలు. విమల చదివింది 8వ తరగతే. పేదరికంవల్ల ఆమెకు 16వ ఏట ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. గద్దర్‌ మీద మీద హత్యాయత్నం తర్వాత 1997లో వీఆర్‌ఎస్‌ తీసుకుంది.

    ఎమర్జెన్సీ సమయంలో..
    ఎమర్జెన్సీ సమయంలో ఓ రోజు హఠాత్తుగా గద్దర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లారో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు విమల నిండు గర్భిణి. ఆ సమయంలో ఏంచేయాలో తెలియక, వారి కుటుంబానికి అత్యంత ఆప్తుడు జేబీ రాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆయన సూచనతోనే ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే సైదులును కలిసి గద్దర్‌ను విడిపించాల్సిందిగా మొర పెట్టుకున్నది. అప్పటి వరకు చాలామంది గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లారని అనుకునేవారు. వారందరినీ నేను వెళ్లి కలిసిన తర్వాత ఆంజనేయరెడ్డి ఆనాటి ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి పెట్టడంతో…. పది రోజులకు గద్దర్‌ను విడుదల చేశారు. అంతకు రెండు రోజుల ముందే విమలకు డెలివరీ అయింది. ఆస్పత్రి నుంచి నేరుగా గద్దర్‌ దగ్గరకు వెళ్లి, చేతిలో బాబును ఉంచింది. అప్పటికే గద్దర్‌ మీద థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. విమల వెళ్లడం ఒకరోజు ఆలస్యమైనా, ఆయన్ను ఎన్‌కౌంటర్‌ చేసేవాళ్లు.

    చిన్న గుడిసెలో కాపురం

    కొన్నాళ్ల తర్వాత గద్దర్‌ కెనరా బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పుడు ఫిరోజ్‌గూడ బస్తీలోని ఒక చిన్న గుడిసెలో కొంతకాలం భార్యతో ఉన్నారు. అక్కడున్న ప్రభుత్వ జాగాలో బస్తీ వాసులంతా కలిసి పిల్లలకు ఉచిత పాఠశాలను నడపాలనుకున్నారు. దాన్ని కొందరు గూండాలు కబ్జా పెట్టారు. ‘ఇదేంటని’ నిలదీసిన బస్తీవాళ్ల మీదా దాడి చేశారు. అప్పుడు వారంతా వచ్చి గద్దర్‌కు చెబితే, ఆయన వెళ్లి కొట్లాడాడు. ఆ కక్షతో ఓ రోజు వారంతా గుంపుగా గద్దర్‌ గుడిసె మీదకు వచ్చారు. వాళ్లతో వచ్చిన ఆడవాళ్లు కొందరు తడికెలతో కట్టిన స్నానాల గదిలో ఉన్న విమలను జుత్తు పట్టుకొని బయటకు ఈడ్చి నేల మీద పడేసి కొట్టారు. అడ్డువచ్చిన మూడేళ్ల గద్దర్‌ కుమారుడు సూర్యాన్ని కూడా కొట్టారు. అంతటితో వదలకుండా గుడిసెకు నిప్పు పెట్టబోతే, అంతలోకి చుట్టుపక్కల జనం వచ్చి అడ్డుకున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఉండటం ప్రాణాలకూ ప్రమాదమని గమనించి, అల్వాల్‌ వెంకటాపురంలో కిరాయి ఇంటికి మారారు. అందులోనే చాన్నాళ్లు ఉన్నాం. తర్వాత విమల పీఎఫ్‌ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. అంతకు మించి గద్దర్‌కు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఇలా పలు విషయాల పై విమల మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూ చదువుతుంటే కంటి నిండా నీరు, గుండెల నిండా ఆర్థ్రత.. జనం కోసం బతికి, జనంతో ఉన్న వారి జీవితం ఇలానే ఉంటుంది కాబోలు.