Ananthula Madan Mohan- KCR: కెసిఆర్.. కొంతమంది విమర్శించవచ్చు. ఇంకొంతమంది ఆకాశానికి ఎత్తేయవచ్చు. భారత రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ బాపు అని పిలుచుకోవచ్చు. ఆయనంటే ఇష్టపడేవారు రాజకీయాల్లో గండరగండడు అని సంబోధించవచ్చు. కానీ అలాంటి కెసిఆర్ రాజకీయ ప్రయాణం కేక్ వాక్ కాదు. ఆ మాటకు వస్తే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కేసీఆర్.. మొండిగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫునుంచి పోటీ చేశారు.. తొలిసారి ఆయన పోటీ చేసినప్పుడు పరాజయమే పలకరించింది. వాస్తవానికి అప్పట్లో ఆయన తరపున ప్రచారం చేసేందుకు సీనియర్ ఎన్టీఆర్ వస్తానని మాట ఇచ్చారు. కెసిఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ తనకోసం వస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ ఊపిరి సలపని షెడ్యూల్ వల్ల ఎన్టీఆర్ కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి రాలేదు. దీంతో ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. ఫలితంగా కెసిఆర్ కు కన్నీరే మిగిలింది. ఫలితాల అనంతరం సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కెసిఆర్ కన్నీటి పర్యంతమయ్యారని ఇప్పటికి రాజకీయ వర్గాల్లో అప్పటి సీనియర్లు చెబుతుంటారు.
కెసిఆర్ రాజకీయ ఆరంగేట్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ప్రభంజనం చూసి టిడిపిలో చేరారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనంతుల మదన్ మో హన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం ఉండటంతో తాను సులభంగా గెలుస్తానని కేసీఆర్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మదన్ మోహన్ 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఓటమితో కేసీఆర్ ఒక్కసారిగా డీలా పడ్డారు. కొద్దిరోజుల వరకు ఆయన తన కార్యకర్తలను కలవలేదు. సీనియర్ ఎన్టీఆర్ ను కలిసి బోరున విలపించారు. ఆయన హితబోధ చేయడంతో మళ్లీ రంగంలోకి దిగారు. బూడిదలో నుంచి లేచిన ఫీనిక్స్ పక్షిలాగా శక్తిని కూడ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో రికార్డ్ స్థాయిలో మెజారిటీ సాధించి తనకు తిరుగులేదు అనిపించుకున్నారు. తన ప్రసంగంతో తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేశారు..
1983లో ఓడిపోయిన కేసీఆర్.. ఓటమిని గెలుపు పాఠంగా మార్చుకొన్నారు. పరాజయం అనేది లేకుండా ముందుకు సాగారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. తన రాజకీయ జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో జరిగిన పోటీలో ఓడించిన మదన్ మోహన్ ను 1989,1994 వరుస ఎన్నికల్లో కెసిఆర్ మట్టి కనిపించారు. ఆ తర్వాత మదన్మోహన్ రాజకీయాలకు దూరమయ్యారు. అనారోగ్యంతో 2004లో కన్నుమూశారు. ఈ క్రమంలో తనకు ఓటమి రుచి చూపించి తనలో గెలవాలనే కసిని పెంచిన మదన్ మోహన్ ను రాజకీయ గురువు గా కెసిఆర్ ప్రకటించుకున్నారు. కాగా, తన తొలి ఓటమిని కెసిఆర్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఓటమే గెలుపుకు నాంది అని, ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పారు.