https://oktelugu.com/

Baby Movie : “బేబీ” వల్ల చిన్న కొండ గారి గడుసుతనం.. తెలుగు ప్రేక్షకులకు ఇలా బోధపడింది

చిన్నకొండగారి భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన చెంది దుప్పటి కప్పుకుని నిద్రపోయినాను. మిగతాది చూడాలంటే భయము వేసి "ఆహా"ను అలా కట్టిపెట్టాను.

Written By:
  • Rocky
  • , Updated On : August 25, 2023 / 10:24 PM IST

    Baby Movie

    Follow us on

    Baby Movie : రాత్రి డ్యూటీ నుంచి వచ్చాకా బేబీ సినిమా చూడదలంచి మొదలుపెట్టినాను. సినిమా ప్రారంభం అయ్యి అవ్వగానే.. ఎర్రరిబ్బన్లతో రెండుజళ్ళేసుకున్న ఓ హైస్కూల్‌ బస్తీ బాలిక, తన సహాధ్యాయి అయిన చిన్నకొండగార్ని అదోరకంగా చూస్తూ ప్రతీషాటులోనూ యథాశక్తి మెలికలు తిరుగుతూ పరవశించిపోతూ ఉంటుంది. తరగతిలో ఉన్నాసరే చూపులతోనే కసిదీరా ప్రేమించేస్తోన్న ఆ బాలిక వికృతప్రేమని క్రీగంట గమనిస్తాడు మేష్టారు.. ఇది కాదు పనని చెప్పి ఒకానొక రాఖీ దినమున బాలికచే చిన్నకొండ చేతికి రక్షాబంధన్‌ కట్టించాలని విఫలయత్నం చేస్తాడు మేష్టారు. వలచిన వాడికి రాఖీ కట్టుటయా.. కటకటా.. రాఖీ కాదు కదా తాయెత్తు కూడా కట్టేది లేదని భీష్మించి మేష్టారితో బెత్తం దెబ్బలు కూడా తింటుంది ఆ వీరబాలిక..(జనసేనవారు క్షమింపగలరు..)

    ఇచ్చట మనం ఓ విషయం గమనించాలి..
    దేవరకొండ వంశస్థులు ప్రేమ విషయంలో కాస్తంత ఉదారముగా వ్యవహరింతురని, ఆదికాలమున వచ్చిన అర్జున్‌ రెడ్డినుంచే మనకి ఓ నమ్మిక.. కనుక ఈ చిన్నకొండ కూడా అందుకు అతీతుడేమీ కాదని మరోమారు నిరూపించినాడు. మేష్టారితో వీరోచితముగా బెత్తందెబ్బలు తిన్న బాలిక వీర ప్రేమకి తలొగ్గాడు. (దీనెక్కా.. చదువుకోండ్రా అని బళ్ళోకి పంపింతే వీళ్ళు వెలగబెట్టే యేషాలు ఇవా అని మనం ప్రకోపించరాదు.. వారి బాల్యప్రేమని జయప్రదం చేయుటయే తెలుగు ప్రేక్షకులుగా మన ప్రథమ కనీస కర్తవ్యం.. లేనిచో మనకి వయసైపోయినదని గేలిచేయుదురు నేటి కుర్రకారు..)

    అప్పటిదాకా బుద్దిగా చదువుకునే చిన్నకొండగారు ఈ ప్రేమ అనే పెద్ద విషయంలో పడి, మరింత కష్టపడి చదివి ఫెయిలయ్యి ఆటోడైవ్రర్‌ అవుతాడు.. డైవ్రర్గా మారేది ఆటోమిత్ర పథకంలో వచ్చే పదివేల రూపాయలకోసమా అనునది నాకైతే స్పష్టత రాలేదు.. సరే, చిన్నకొండగారి విద్యాప్రాప్తి విధివశాత్తూ అట్లా జరిగినది కాబోలు, ఇకనైనా ఏదోటి ఏడుస్తాడులే అని వదిలేసిందా ఆ బాలిక అంటే అప్పుడు కూడా వదలదు.. ఆ ఆటో కొన్నది నన్ను తిప్పడానికే కదా అని కొండగారి జీవితాన్ని మరింత చప్పరించసాగింది.. అదలా సాగుతూ ఉండగా. మరి కొన్నాళ్ళ పిదప మాతృమూర్తిగారి నగల తాకట్టుచే ఇంజినీరింగ్లో సీటు కూడా కొనుక్కుని చేరినది బాలిక నుంచి యవ్వనవతిగా రూపాంతరం చెందబడుతోన్న ఆ చిన్నది. ప్రేయసి ఇంజినీరింగ్‌ చదువులో చేరబోతోందని చెవిన పడింది చిన్నకొండకి. వాళ్ళమ్మ నగలు తాకట్టు పెట్టగా లేనిది, నేను కనీసం ఆటోనైనా తాకట్టు పెట్టలేనా అని పౌరుషాన్ని ప్రదర్శించాడు చిన్నకొండగారు. ఆటోని కుదువ పెట్టి మరీ మొబైల్‌ కొనిచ్చాడు పాపకి..ఇదంతా మొదటి అరగంటలోనే టపాటపా జరిగిపోయేసరికి నాకు మిక్కిలి భయము వేసినది. చిన్నకొండగారి భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన చెంది దుప్పటి కప్పుకుని నిద్రపోయినాను. మిగతాది చూడాలంటే భయము వేసి “ఆహా”ను అలా కట్టిపెట్టాను.