RK Kotha Paluku: సరిగ్గా ఒక ఐదు నెలల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండి కం సుప్రసిద్ధ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో వ్యాసం రాశారు. వైయస్ అవినాష్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు అర్ధరాత్రి మూడు గంటలకు వైయస్ భారతికి ఫోన్ చేశారని.. ఆ సమయంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యేకంగా నొక్కి వక్కానించారు. సాధారణంగా పైకి చదివేందుకు అవి కొన్ని పంక్తుల మాదిరి కల్పించవచ్చు. కానీ లోతుగా చదివితే అర్థం వేరే వస్తుంది. మరి ఇలాంటి రాతలను ఏమనాలి? రాసిన వ్యక్తిని ఏమనాలి? నాడు విచారణ అధికారుల ఎదుట అజేయ కల్లం ఇదే చెప్పాడు అని వేమూరి రాధాకృష్ణ కవర్ చేస్తుండవచ్చు గాక.. కానీ ఆ తర్వాత అజేయ కల్లం తను అలా అనలేదని స్పష్టంగా చెప్పాడు. కానీ అదే విషయాన్ని ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రచురించలేదు.. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాత్రికేయమనేది ఎలా మారిపోయిందో చెప్పడానికి.. ఈరోజు కొత్త పలుకులో జగన్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అభిమానమా? ఉన్మాదమా? అని వేమూరి రాధాకృష్ణ పెద్ద వ్యాసం రాశాడు. అందుకు వేసిన కార్టూన్ కూడా ఆంధ్రజ్యోతి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోంది..
జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు, సునీతకు ప్రస్తుతం వివాదాలు జరుగుతున్నాయి. అది వారి కుటుంబ సమస్య. ఇదే తారకరత్న గుండెపోటుకు గురై కన్నుమూస్తే.. నందమూరి కుటుంబం ఏ స్థాయిలో ఓన్ చేసుకుంది? చివరికి దశదినకర్మలోనూ రకరకాల వార్తలు వినిపించాయి కదా? మరి వాటి గురించి ఆర్కే ఏనాడూ ఎందుకు రాయడు? మొన్నటికి మొన్న నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదం సంగతి ఏంటి? దాని గురించి రాధాకృష్ణ ఎందుకు రాయడు? అసలు తన పత్రికలోనే రాధాకృష్ణ బాలకృష్ణ మీద మొన్నటిదాకా నిషేధం విధించాడు కదా? అక్కడిదాకా ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతిని ఓ సెక్షన్ మీడియా ఏ విధంగా వేధిస్తుందో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం.. సీనియర్ ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఎటువంటి కార్టూన్స్ ఈనాడులో వేశారో? లక్ష్మీపార్వతి గురించి ఎలాంటి రాతలు రాశారో? ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. ఆంధ్రజ్యోతి కూడా తక్కువ తినలేదు. మరి అలాంటి పనులకు పాల్పడినవారు నీతులు చెప్పవచ్చా?
ఇదే షర్మిల గతంలో తన అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే రాధాకృష్ణ ఏ స్థాయిలో కవరేజ్ ఇచ్చాడు అందరికీ తెలుసు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య గ్యాప్ ఉంది కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థి కాబట్టి.. ఆ కోణంలో రాధాకృష్ణ రాసుకు వస్తున్నాడు. అంతే తప్ప షర్మిల విషయంలో ఏదో పాత్రికేయ కోణంలో కాదు. ఇదే షర్మిలకు గతంలో టాలీవుడ్ హీరో తో ముడి పెడుతూ వార్తలు రాయలేదా? వార్తలను షర్మిల ఖండించలేదా? అవేం చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు కదా.. ఇక్కడ జగన్ సుద్దపూస అని చెప్పడం మా ఉద్దేశం కాదు. షర్మిల, సునీతకు వ్యతిరేకం కాదు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వీరేవరితోనూ మాకు శత్రుత్వం లేదు. కానీ పాత్రికేయం ముసుగులో, అవసరాలకు అనుగుణంగా రాతలు రాయడాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అభిమానుల వ్యవహార శైలి తారస్థాయి దాటిందని.. ఇది ఉన్మాద చర్య అని.. వాపోయిన రాధాకృష్ణ.. టిడిపి నాయకులు చేస్తున్న దాని గురించి ఎందుకు మాట్లాడడు? టిడిపి నాయకులు కూడా సోషల్ మీడియాలో వైయస్ భారతి, వైయస్ విజయలక్ష్మి, వైయస్ షర్మిలను ఉద్దేశిస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారో రాధాకృష్ణకు తెలుసా? పోనీ తెలిసినా కూడా నటిస్తున్నాడా? ఆ లెక్కన రాధాకృష్ణ సూత్రికరణ ప్రకారం ఆ పోస్టులు అన్నింటికీ చంద్రబాబు నాయుడే బాధ్యులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు షర్మిలను, సునీతను ఉద్దేశిస్తూ జగన్ అభిమానులు చేస్తున్న కామెంట్లు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఉన్మాదానికి దారితీస్తున్నాయని.. దానికి బాధ్యుడు జగన్ అని రాధాకృష్ణ రాశాడు కాబట్టి..
ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కనుక బాధ్యుడు అయితే కచ్చితంగా అతడు శిక్షకు గురవుతాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉండవచ్చు. కానీ రేపటి నాడు ఆ పదవిని కోల్పోయిన తర్వాత.. ఒకవేళ ఆ కేసులో ఏదైనా పురోగతి లభిస్తే.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు. కానీ దర్యాప్తు సంస్థల బాధ్యతను కూడా రాధాకృష్ణ మీద వేసుకోవడమేమిటో అర్థం కాని విషయం. జార్ఖండ్ ముఖ్యమంత్రి, మరో ముఖ్యమంత్రి విషయాన్ని ఉదాహరణగా చెప్పిన రాధాకృష్ణకు.. చంద్రబాబు నాయుడు పాల్పడిన స్కిల్ కేసు ఎందుకు గుర్తుకురాదు.. ఈ వార్త మొదటి చెప్పినట్టు పాత్రికేయమనేది న్యూట్రల్ గా ఉండాలి. ఏ వర్గానికి కూడా కొమ్ము కాసినట్టు ఉండకూడదు. అలా కొమ్ముకాస్తూ.. ఎదుటి వారి మీద బట్ట కాల్చి వేస్తామంటేనే అసలు సమస్య.