Amit Shah On Chandrababu: “ఇవే నాకు చివరి ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా నేను ముఖ్యమంత్రి కావడం అవసరం.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నష్టపోయింది. చివరికి రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు.. ఆర్థిక అభివృద్ధి మాట దేవుడెరుగు.. సమీప భవిష్యత్తులో బాగుపడుతుందని గ్యారెంటీ లేదు” ఇవీ ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తన అంతరంగికులతో అన్నట్టుగా ఓ సెక్షన్ మీడియా రాసిన కథనం.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ మీడియా కూటమిలో జనసేనకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తుందో చెప్పేందుకు.. ఈ క్రమంలోనే కూటమిలో ఇంకా చేరకపోయినప్పటికీ కొన్ని విషయాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టారు. ఆ మాటలను చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రచురించలేదు గాని.. మిగతా మీడియా సంస్థలు మాత్రం పతాక శీర్షికతో అచ్చువేశాయి.
కేంద్రంలో ఈసారి నాలుగు వందలకు పైగా స్థానాలు గెలుచుకోవాలని బిజెపి భావిస్తోంది. సొంతంగానే 370 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని వివిధ సర్వే సంస్థలు చెబుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవే చివరి ఎన్నికలు కావడంతో.. ఇందిరాగాంధీ సాధించిన రికార్డును బ్రేక్ చేయాలని ఆయన భావిస్తున్నారు.. ఈనేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి దేశంలోని మిగతా పక్షాలను తన కూటమిలోకి చేర్చుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏ కూటమిలోకి అన్ని పక్షాలను ఆహ్వానిస్తున్నారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఇతర పార్టీలతో అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నారు.. ఈ సంప్రదింపుల్లో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు ఆయనను కలిశారు. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. ఆ చర్చల సారాంశం ఇదీ అని అటు చంద్రబాబు గాని, ఇటు అమిత్ షా గాని బయట పెట్టలేదు. అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా మాత్రం టిడిపి కోణంలో వార్తలు రాసుకోచ్చింది.
త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అమిత్ షా ఇటీవల టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ విలేఖరి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే మధ్యలో ఏపీకి సంబంధించిన చర్చ రావడంతో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. “కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే చంద్రబాబు లేదా లోకేష్ ముఖ్యమంత్రి కారు అనే సంకేతాలు అమిత్ షా ఇచ్చారు. అంతేకాదు తమకు నమ్మకమైన భాగస్వామినే ముఖ్యమంత్రి చేస్తాం. దక్షిణాది రాష్ట్రాల్లో మేము మరింత బలపడాలి అనుకుంటున్నాం. ఏపీలో కూడా చాలా మెరుగైన స్థానంలో పోటీ చేయాలి అనుకుంటున్నాం. గతంలో మాదిరి కాకుండా ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాం” అని అమిత్ షా అన్నారు. దీంతో ఒక్కసారిగా టిడిపి లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొత్తు గురించి ఆ పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో టిడిపి సొంతంగా పోటీ చేసే పరిస్థితులు లేవు. పైగా అమరావతి వ్యవహారంలో ఆ పార్టీ తీరు.. ప్రత్యేక హోదాకు సంబంధించి తీసుకున్న యూటర్న్, ఆ తర్వాత దానిని ఎత్తుకున్న విధానం.. ఇవన్నీ కూడా టిడిపికి ప్రతిబంధకం గానే ఉన్నాయి. అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాల్సి ఉంది.