America : “అమ్మో”రికా.. కలలు కల్లలు.. కళ్ళల్లో కన్నీళ్లు

పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ రంగాల వైపు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మైనింగ్, సివిల్, రోబోటిక్స్, మెకాట్రోనిక్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి.

Written By: NARESH, Updated On : February 10, 2024 9:06 pm
Follow us on

America : శ్వేత సౌధం.. కళ్ళు చెదిరే జీవితం.. కళ్ళు బైర్లు గమ్మే జీతం.. అవకాశాలకు స్వర్గం. అపరిమితమైన స్వేచ్ఛకు నిలయం.. ఆధునిక విద్యకు ఆలవాలం.. జీవితాన్ని ఇష్టపడి జీవించేందుకు అనుకూలమైన దేశం.. అమెరికా గురించి ప్రస్తావనకొస్తే పై విషయాలే మదిలో మెదులుతాయి. అలాంటి అమెరికా లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనలో పడింది. కలలు చెదురుతుండడంతో చాలామంది కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి.

అమెరికా అంటేనే టెక్ రంగం గుర్తుకు వస్తుంది. పైగా ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు మొత్తం అక్కడే కొలువై ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి కంపెనీలు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అలాంటి దేశంలో టెక్ రంగంలో మందగమనం నెలకొంది. దీంతో కొత్త ఉద్యోగాల కల్పన అటు ఉంచితే ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇప్పటికే లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. లే_ ఆఫ్ పేరుతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. దీంతో అక్కడ ఎలా బతకాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

ఇక కొన్ని సంవత్సరాలుగా అమెరికా పరిధిలోని టెక్ రంగంలో మందగమనం నెలకొంది. దీనికి తోడు ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులపై ట్యూషన్ ఫీజుల భారం విపరీతంగా పెరిగింది. దీంతో చాలామంది అమెరికా చదవంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం శ్వేత దేశం రావడం పై మరొకసారి ఆలోచించుకోవాలని భారతీయ విద్యార్థులకు అమెరికాలోని భారతీయ సీనియర్లు సూచనలు చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో అప్పులు చేసి మాస్టర్ డిగ్రీ పొందాలి అనుకుంటున్న విద్యార్థులు ఒకసారి ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. ఈ మేరకు అక్కడున్న పరిస్థితులపై కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఆ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.

“చాలామంది అమెరికా అంటే గొప్ప దేశం అనుకుంటారు. అక్కడ ఉన్నత విద్య చదివి పెద్ద సంస్థలు ఉద్యోగం చేయాలి అనుకుంటారు. అక్కడ మొత్తం స్వర్ణ యుగం ఉంటుంది కాబట్టి, జీవితం వడ్డించిన విస్తరి అవుతుంది అనుకుంటారు. కానీ అమెరికాలో అలాంటిదేదీ ఉండదు. అమెరికా రావడం అంటే సమయం, డబ్బు వృధా చేసుకోవడం తప్ప. గత కొంతకాలంగా ఉన్నత విద్యపై యూనివర్సిటీలు విపరీతంగా ట్యూషన్ ఫీజు పెంచాయి. మరోవైపు లాటరీలో హెచ్ _1 బీ వీసా పొందే అవకాశం స్వల్పంగా ఉంది. గ్రీన్ కార్డ్ పొందే అవకాశం లేకపోవడం ఇందుకు మరొక కారణం” అని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చాలామంది ఎంఎస్ కోసం అమెరికా వస్తున్నారని, ఆ కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం రావడం అనేది కలే అని ఓ నెటిజన్ ట్విట్టర్ ఎక్స్ లో వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. మార్కెట్ లో మందగమనం నెలకొనడంతో ఉద్యోగం వచ్చినప్పటికీ తక్కువ వేతనం లభిస్తున్నది. హెచ్ 1బీ వీసాకు సంబంధించి నిర్వహించే లాటరీలో అస్థిరత ఏర్పడింది..దీంతో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. మరోవైపు కంపెనీలు లే ఆఫ్ లు ప్రకటిస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఒక్క ఉద్యోగం కోసం వందల మంది పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ రంగాల వైపు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మైనింగ్, సివిల్, రోబోటిక్స్, మెకాట్రోనిక్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి.