America: అమెరికా ప్రజలు అక్కడి సమస్యలు, ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే అక్కడి ప్రజలు మాత్రం ఎన్నికల ఏడాది వీటన్నింటికంటే అక్రమ చొరబాటుదారుల గురించే ఎక్కువగా భయపడుతున్నారట. ఎన్నికల్లో ప్రభావితం చూసే అంశాలపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ సంచలన నిజం బయటపడింది. ఆ వివరాలు చూద్దాం.
35 ప్రజల్లో చొరబాటు భయం..
అమెరికా ప్రజల్లో 35 శాతం మంది ప్రజలు అక్కడి ధరల పెరుగుదల కన్నా.. మెక్సికో, భారత్, పాకిస్తాన్, చైనా తదితర దేశాల నుంచి వస్తున్నవారి గురించే భయపడుతున్నారట. ఎందుకంటే విదేశీయులు చదువుకోవడానికి వచ్చి.. తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని, తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారన్న ఆందోళనే స్థానికుల్లో ఎక్కువగా ఉందట. ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపే అంశం ఇదే అంటున్నారు.
ధరల పెరుగుదలపైనా..
ఇక ధరల పెరుగుదలపైనా ఆందోళన చెందేవారు తర్వాతి స్థానంలో ఉన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యంతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారు. ధరల పెరుగుదలపై సర్వేలో 32 శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న నిరుద్యోగం..
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. విదేశీయులకు ఉపాది కల్పిస్తున్న అమెరికా.. అక్కడి వారికి మాత్రం ఉపాధి కల్పించడం లేదు. విదేశీయుల కారణంగానే తమకు ఉద్యోగాలు దక్కడం లేదని, ఉద్యోగాలు కల్పించే వారినే అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని అమెరికాలో 25 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మొత్తంగా ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ మూడు అంశాలే కీలకంగా మారబోతున్నట్లు ఎక్కువ శాతం అమెరికన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.