American Youth: స్వేచ్ఛ.. ఈ పదం అర్థం మారిపోతోంది. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు. అలాగే వందమంది బలార్జునులైన దేశం కోసం ప్రాణాలర్పించే యువత నాతో ఉంటే దేశగతిని మార్చుతా అన్నారు వివేకానంద. ఒకప్పుడు మనిషి మనిషిగా బతకడానికి స్వేచ్ఛ కావాలని, వనరుల సద్వినియోగానికి స్వేచ్ఛ కావాలని, శ్రమ దోపిడీ నుంచి స్వేచ్ఛ కావలని, బానిస బతుకుల నుంచి స్వేచ్ఛ కావాలని నినదించే వారు కానీ, నేడు ప్రజాస్వామ్య దేశాల్లో వ్యక్తిగత హక్కుల కోసం స్వేచ్ఛ కావాలంటున్నారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛాయుత దేశం అని అర్థం. ఇలాంటి దేశాల్లో నేటి యువతరం పోకడలు స్వేచ్ఛకు అర్థాన్ని మార్చేస్తున్నాయి.
పబ్బులు, క్లబ్బులు, ఎంజాయ్..
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో నేటి తరం స్వేచ్ఛ అంటే కొత్త అర్థం చెబుతున్నాయి. స్వేచ్ఛ అనగానే వ్యక్తిగతంగా అనుభవించే హక్కుగా భావిస్తున్నాయి. పబ్బులు, క్లబ్బులు, విచ్చలవిడితనం ఇదే స్వేచ్ఛ అనే భావన నెలకొంది. దీంతో ప్రజాస్వామ్యం అంటేనే అర్థం మారిపోతోంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ కోసం..రాచరికం, నియంతల పాలన అంతం కోసం స్వేచ్ఛను కొరుకునేవారు. కానీ, నేడు అవి లేకపోయినా, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కొరవడింది అనే భావనలో ఉంటున్నారు. తమకు అనుకులంగా పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛగా బతుకుతున్నామన్న భావనలో ఉంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అగ్రరాజ్యం అమెరికా యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మచ్చుకైనా కానరావడం లేదని తాజాగా ఓ సర్వే తేల్చింది. తాము వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండడం కావాలని కోరుకుంటోంది.
ప్రజాస్వామ్య దేశానికే శాపం..
యువతరంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడడం ఆ దేశాలకు శాపంగా పరిణమిస్తుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇజ్రాయోల్, హమాస్ యుద్ధంపై ఇటీవల అమెరికాలోని యువతరం ఏమనుకుంటోందని ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయోల్‌కు మద్దతు తెలుపుతోంది. కానీ, ఇజ్రాయోల్ సాగిస్తున్న మారణకాండను ఐక్యరాజ్యసమితి ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశమైన అమెరికా యువతరం ఎటువైపు ఉందని తెలుసుకునేందుకు ఓ సంస్థ చేసిన ప్రయత్నం ఈ సర్వే. ఇందులో 18 నుంచి 24 ఏళ్లలోపు యువతలో 51 శాతం మంది ఇజ్రాయోల్–హమాస్ వార్ ముగియాలంటే ఇజ్రాయోల్‌ను తుడిచిపెట్టాలని అన్నారట. ఇక 34 శాతం మంది మాత్రమే ఇరుదేశాలతో సంప్రదించి సమస్య పరిష్కారం కనుగోనాలని పేర్కొన్నారట.
సోషల్ మీడియా ప్రభావం..
ప్రపంచ వ్యాప్తంగా యువత ఇప్పుడు సోషల్ మీడియా వెంటపడుతోంది. దాని ప్రభావమే యువతరంపై ఎక్కువగా ఉంటుంది. తాజా సర్వే కూడా అదే నిర్ధారించింది. ప్రజాస్వామ్యం అంటేనే ఏంటో తెలియని పరిస్థితిలో యువత పోకడలు ఉన్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి శాపంగా మారడం ఖాయమంటున్నారు.