Ambati Rayudu: ఏపీ సీఎం జగన్ కు మరో షాక్. వారం రోజుల కింద పార్టీలో చేరిన యువ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు.తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని.. అందుకే వైసిపి నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించి సంచలనం రేకెత్తించారు. దీంతో వైసిపి శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కొద్ది నెలల కిందట క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు సీఎం జగన్ ను కలిశారు. వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగేవారు. తనకు రాజకీయ ఆకాంక్ష ఉందని.. తన మనసుకు నచ్చే పార్టీలో చేరుతానని మీడియాకు చెప్పుకొచ్చేవారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారం రోజులు గడవక ముందే పార్టీకి రాజీనామా చేయడం విశేషం.
విద్యారంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఆకర్షితుడునై వైసీపీలో చేరుతున్నట్లు అంబటి రాయుడు ప్రకటించారు. అయితే అంతకంటే ముందే ఏపీ సీఎం జగన్ ను పలు సందర్భాల్లో రాయుడు పొగడ్తలతో ముంచేత్తారు. వైసీపీలో చేరుతానని మీడియాకు లీకులు ఇచ్చారు. అంబటి రాయుడు పార్టీలో చేరకముందే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అటు రాయుడును వైసీపీలో చేర్పించడానికి ఆ పార్టీ నేతలు ఉత్సాహం చూపారు.
అయితే సడన్ గా రాయుడు రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం అంతు పట్టడం లేదు. క్రికెట్ కెరీర్ ను కొనసాగిస్తానని.. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెబుతున్నారు. కానీ తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. కోరుకున్న సీటు దక్కకపోవడమో.. లేకుంటే వైసిపి ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటుందని తెలుసుకోవడమో.. ఏదో ఒకటి జరిగి ఉంటుందని.. అందుకే రాయుడు రాజీనామా ప్రకటించారని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీలో చేరిన తర్వాత పలు ఇంటర్వ్యూలో కూడా అంబటి రాయుడు చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎంపీ స్థానంపై మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్ తో ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గానీ.. ఉన్నపలంగా రాజీనామాచేసి సంచలనం సృష్టించారు.