Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీని వీడారు. ఆ పార్టీలో చేరి పది రోజులు కాకముందే రాజీనామా చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు పవన్ తో చర్చలు జరిపారు. దీంతో రాయుడు జనసేన లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీలోకి దిగుతారని తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలిటికల్ కెరీర్ కు సిద్ధమయ్యారు. గత నెల 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇప్పటికే ఆయన గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలో పర్యటనలు కూడా చేశారు. వైసీపీలో చేరిన వెంటనే గుంటూరు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది.కానీ పార్టీలో చేరిన 10 రోజుల్లోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే క్రికెట్ కెరీర్ కోసమే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనేందుకు తాను రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించారు.
అయితే అదే అంబటి రాయుడు ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తన మనసులో ఉన్న మాటను పవన్ కు వెల్లడించారని.. జనసేన లో చేరిక ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే అంబటి రాయుడు ఆశించిన గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి అంబటి రాయుడును పోటీ చేయిస్తారా? మరో స్థానం కేటాయిస్తారా? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.