https://oktelugu.com/

AHA Aap : అల్లు అరవింద్ కు ‘ఆహా’ షాక్.. గూగుల్ ఇలా దెబ్బ కొట్టిందేంటి?

అయితే ఈ కేసు కు సంబంధించి ఇప్పటికే ఒకసారి విచారణ జరిగిన నేపథ్యంలో మరోసారి మార్చి 19న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. మరి ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ తో కాళ్ళ బేరానికి వస్తాయా.. లేక అలానే ఉండిపోతాయా అనేది తేలాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2024 / 09:10 PM IST
    Follow us on

    AHA Aap :  ఆయన మెగా ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్.. తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తున్న వ్యక్తుల్లో తను ఒకడు. అలాంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో మొట్టమొదటిసారిగా ఓటీటీ ని ప్రారంభించినప్పుడు చాలామంది “ఆహా” ఓహో అన్నారు. భవిష్యత్తు కాలాన్ని ముందే అంచనా వేసిన ఘనాపాటి అని కొనియాడారు. కానీ ఓటీటీ మార్కెట్ పూలపాన్పు కాదని ఆయనకు అర్థమవడానికి ఎంతో కాలం పట్టలేదు. పైగా ఈ ఫీల్డ్ లో బిగ్ షాట్స్ ఉన్నాయి. అవే ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే.. ఈ మెగా ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన ఓటీటీకి మాత్రం ఏం గిరాకీ ఉంటుంది? ఫలితంగా నష్టాలు. అలాగే కొనసాగించాలంటే కష్టాలు.. భారీ సినిమాలు కొనుగోలు చేయలేడు.. కంటెంట్ సృష్టించలేడు.. ఎందుకంటే అది తడిసిమోపెడయ్యే వ్యవహారం కాబట్టి. పైగా ఆ మధ్య దానిని అమ్మాలని ఆ మెగా ప్రొడ్యూసర్ అనుకున్నారు.. సోనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కుదరదు అన్నారు. జీ దగ్గర కు వెళ్తే బేరం వర్క్ అవుట్ అవ్వలేదు. మరో సంస్థ దగ్గరికి వెళ్తే డీల్ సెట్ కాలేదు. అందుకే ఆయన సైలెంట్ గా ఉండిపోయారు.

    అలాంటి ఆ నిర్మాతకు ఇప్పుడు గూగుల్ చేదు వార్త చెప్పింది.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ ప్రొడ్యూసర్ ఓటీటీ యాప్ ను తొలగించింది. ప్రస్తుతం ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించడం లేదు. ఫలితంగా కొత్త సబ్ స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే గూగుల్ ఈమధ్య తన ప్లే స్టోర్ పాలసీ మొత్తం మార్చేసింది. తన పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ మొత్తాన్ని తొలగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఆ మెగా ప్రొడ్యూసర్ ఓటీటీ పై కూడా వేటు పడింది. కేవలం దానిపైన మాత్రమే కాదు ఆల్ట్ బాలాజీ, నౌకరి డాట్ కామ్, షాది డాట్ కామ్, 99 ఎకర్స్, కేరళ మ్యాట్రిమోనీ, కూకు ఎఫ్ఎం, శిక్ష భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది.

    ఇలా ఏకపక్షంగా, నోటీస్ లేకుండా తమ యాప్స్ తొలగించడం అన్యాయమని ఆ సంస్థల యజమానులు అంటున్నారు. ఇప్పటికే ఆదాయాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని.. ఇలాంటి సమయంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఆ మెగా ప్రొడ్యూసర్ ఓటీటీ యాప్ స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    కాగా గూగుల్ ప్లే స్టోర్ కి సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ పేమెంట్ పాలసీలపై కొన్ని యాప్స్ ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ కేసు పై ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకసారి స్పందించింది. మీకు సమస్యలు ఏమైనా ఉంటే గూగుల్ సంస్థను కలవాలని, వాళ్లతో చర్చలు జరపాలని సూచించింది. కానీ ఇంతలోనే గూగుల్ ప్లే స్టోర్ ఆ యాప్స్ ను తొలగించడం విశేషం. అయితే ఈ కేసు కు సంబంధించి ఇప్పటికే ఒకసారి విచారణ జరిగిన నేపథ్యంలో మరోసారి మార్చి 19న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. మరి ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ తో కాళ్ళ బేరానికి వస్తాయా.. లేక అలానే ఉండిపోతాయా అనేది తేలాల్సి ఉంది.