Chandrababu Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీనీ ఓడించడం కోసం ప్రతిపక్షాలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి చాలా వరకు దెబ్బ తిన్నది. దీంతో వచ్చే ఎన్నికల్లో మరో పార్టీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనసేనతో కలిసి వెళ్లాలని పరోక్షంగా ఇటీవల హింట్ ఇచ్చారు.. అయితే పవన్ సైడ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది.

గత కొన్ని రోజులుగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో జనసేన కంటే టీడీపీ నాయకులే పలు సమావేశాల్లో పొత్తు విషయం గురించి మాట్లాడారు. జనసేన నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగానే స్పందిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఓ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుండ బద్దలు కొట్టినట్లు పొత్తు విషయం తేల్చేశారు. రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే తప్పేంటి..? అని వాదించారు. దీంతో టీడీపీ, జనసేన కలిసి వెళ్లనున్నాయా..? అన్న చర్చ సాగుతోంది.
అయితే ఈ సందర్భంగా బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ అవసరాలకు పొత్తు పెట్టుకుంటే తప్పేంటి..? అయితే పొత్తుల విషయంలో వన్ సైడ్ లవ్ ఉండకూడదు. ఈ విషయంలో తమపై కొందరు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ కొత్త బిచ్చగాళ్ల పార్టీ అని, అందుకే వారికి ఇలాంటి విషయాలు తెలియవు’ అని అన్నారు. దీంతో జనసేనతో పొత్తు ఖాయమనే సంకేతాలను చంద్రబాబు పరోక్షంగా పంపించినట్లు తెలుస్తోంది.
అటు టీడీపీ శ్రేణులు సైతం మరో పార్టీతో కలిసి వెళితేనే బెటరని ఆలోచిస్తున్నారు. మరోవైపు టీడీపీకి పొత్తులతో కలిసి వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో దారుణ పరాభావం ఎదురైంది. అంతకుముందు 2014లో జనసేన-బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి పవన్ ను పక్కన బెట్టుకుంటే కాస్త ప్రయోజనం ఉండే అవకాశం ఉందని టీడీపీ నాయకులు ఆలోచిస్తున్నారు.
మొన్నటి వరకు బీజేపీతో పొత్తులో ఉండి ప్రస్తుతం టీడీపీ దూరంగా ఉంటోంది. బీజేపీతో కలిసుండడం వల్ల జనసేనకు ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పలు ఆందోళన కార్యక్రమాల్లో జనసేన ముందుకు వెళ్లినా.. బీజేపీ మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో కొన్ని కార్యక్రమాలను జనసేన ఒంటరిగా చేసి సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు టీడీపీ నాయకులతో కలిసి వెళ్లాల్సి వస్తే.. జనసైనికులు ఏ విధంగా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అయితే రాజకీయ అవసరాల కోసం ఇలాంటివి తప్పవని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు ఆఫర్ చేస్తే జనసేన అధినేత పవన్ ఏ విధంగా స్పందిస్తారోనన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కమ్యూనిస్టులు, బీజేపీతో చెడిన సందర్భంగా ఈసారి ఆచితూచి అడుగువేయాలని పవన్ ఆలోచిస్తున్నారు. గతంలో టీడీపీ కోసం పవన్ ప్రచారం చేసినా.. ఆ సమయంలో జనసేన పార్టీ లేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీని అభివృద్ధి చేసుకోవడంతో పాటు టీడీపీకి సపోర్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విషయంలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తారా..? లేదా సంయమనంతో పొత్తు పెట్టుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదీ ఏమైనా టీడీపీ, జనసేనల పొత్తుతో ఏపీలో కొత్త రాజకీయం ఆరంభమైనట్లేనని అనుకుంటున్నారు.