ఒకప్పుడు వినోదం అంటే సినిమా హాళ్లు.. తర్వాత బుల్లితెర.. కానీ ఇప్పుడు వినోదానికి అర్థం మారిపోయింది. బహుళ జాతి సంస్థలు రావడంతో వేలకోట్ల వ్యాపారంగా మారిపోయింది.. మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత వినోద రంగ పరిశ్రమలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.. స్మార్ట్ ఫోన్ యుగంలో ఓటీటీలు కళ్ళముందే వినోదాన్ని తీసుకొచ్చాయి. అలాంటి ఓటిటిలో జి 5 ఒకటి.. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ఇది నిర్మిస్తోంది.. తాజాగా ఈ ఓటిటి నుంచి రాజ్ తరుణ్, శివానీ జంటగా నటించిన ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతున్నది. దీనికి సంజీవరెడ్డి దర్శకత్వం వహించారు.. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం

ఇంతకీ కథ ఏంటంటే
రాజ్ తరుణ్ (శ్రీను) తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలతో అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడనని అమ్మకు వాగ్దానం చేస్తాడు.. శ్రీనుని క్రికెటర్ ను చేద్దామని తండ్రి నో బాల్ నారాయణ(హర్షవర్ధన్) అనుకుంటే ఫిజియోథెరపిస్ట్ అవుతాడు. అనుకోకుండా ఒక రోజు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే తల్లిదండ్రులు షాక్ అవుతారు.. కొడుకు నిర్ణయాన్ని సమ్మతించి పెళ్లి చూపులకు వెళ్తారు. అమ్మాయి శ్రీనుకు నచ్చడంతో పెళ్లి ఖరారు అవుతుంది. తీరా పెళ్లి జరిగే సమయానికి అమ్మాయి వేరే వ్యక్తితో పారిపోతుంది. దీనిని శ్రీను అవమానంగా భావిస్తాడు. తన పెళ్లి చెడిపోవడానికి మహా( శివానీ) కారణమని శ్రీనుకి తెలుస్తుంది. దీంతో ఆమె పెళ్లి కూడా చెడగొట్టి గుణపాఠం చెప్పాలనుకుంటాడు.. స్నేహితుల సాయంతో మహాను కిడ్నాప్ చేసిన శ్రీనుకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడతాడు. గత్యంతరం లేక తన ఫ్లాట్ లోనే మహాను పెట్టుకుంటాడు.. ఈ క్రమంలో శ్రీను, మహా మధ్య ప్రేమ చిగురుస్తుంది. తనను కిడ్నాప్ చేసింది శ్రీను అని మహాకు తెలుస్తుంది.. అయితే తర్వాత ఏం జరిగిందనే ప్రశ్నకు సమాధానం కావాలి అంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉంది అంటే..
ఇలాంటి కుటుంబం ఉన్న సినిమాలకు ప్రధాన బలం డ్రామా. రెడీ, పరుగు, ఇటీవల విశ్వక్ సేన్ నటించిన అశోకవనం లో అర్జున కళ్యాణం.. వంటి సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాలకు కావాల్సిందల్లా చక్కటి డ్రామా, సున్నితమైన హాస్యం. ఈ రెండు కూడా ఆహనా పెళ్ళంట లో సమపాళ్ళల్లో ఉండేలా దర్శకుడు సంజీవరెడ్డి చూసుకున్నాడు. ఈ విషయంలో అతడు విజయవంతమయ్యాడు. ఇక వెబ్ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కు పెళ్లి తంతుకు సంబంధించి చెరసాల, పాణి గ్రహణం, బ్రహ్మ ముడి, సప్తపది, అరుంధతి నక్షత్రం, జీలకర్ర బెల్లం, మధుపర్కం, మంగళసూత్ర ధారణ వంటి పేర్లు పెట్టాడు. అందుకు అనగుణంగా కథ, కథానాలు రూపొందించాడు. శ్రీను చిన్నప్పటి సన్నివేశాలతో వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది.. అయితే పాత్రల పరిచయానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అయితే వీటి మధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి.. శ్రీను పెళ్లి ఆగిపోవడం, మహాను కిడ్నాప్ చేయడం వంటివి రొటీన్ గా అనిపిస్తాయి. వీటి మధ్య వచ్చే సన్నివేశాలు సాగతీతను తలపిస్తాయి.. శ్రీను స్నేహితులు వేసే పంచ్ లు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మహా పోలీసుల ఎదుట చేసే హంగామా అతిగా అనిపిస్తుంది.. కిడ్నాప్ తర్వాత మహా, శ్రీను ఫ్లాట్ కు చేరుకోవడం, ఇద్దరి మధ్య స్నేహం చిగురించడం, ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడినా దాన్ని బయటకు వ్యక్తం చేయలేకపోవడం తదితర సన్నివేశాలతో తర్వాత ఎపిసోడ్లు సాగుతాయి.. అయితే శ్రీను, మహా మధ్య ప్రేమ చిగురించేందుకు బలమైన సన్నివేశం, సంఘర్షణ కానీ కనిపించదు. లాజిక్ పక్కన పెట్టి చూస్తే పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్, దానిని తెరకు ఎక్కించిన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మధ్య వచ్చే వెబ్ సిరీస్ ల్లో అశ్లీలత, హింస, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు ఎక్కువ ఉంటున్నాయి. కుటుంబంతో చూసే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. దానికి ఆహా నా పెళ్ళంట విరుద్దం. కుటుంబం అంతా కూర్చుని కలిసి చూసేలా దర్శక నిర్మాతలు రూపొందించారు..
నటన ఎలా ఉంది అంటే
శ్రీను లాంటి పాత్రలు రాజు తరుణ్ కు కొత్త కాదు. చాలా సులభంగా చేశాడు.. తన పాత్రకు మించి ఎక్కువ ఏదీ చేయలేదు.. ఇక శివాని నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రం అతి అనిపిస్తుంది. హర్ష వర్ధన్, ఆమని, పోసాని, మధు నందన్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవితేజ, త్రిశూల్ ఆకట్టుకున్నారు. జుదాహ్ పాటలు, పవన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మధు రెడ్డి తన కత్తెర కు ఇంకాస్త పని చెప్పాల్సి ఉండేది. నాగేష్, అక్షర్ ఫోటోగ్రఫీ బాగుంది.
బలాలు
*తారాగణం
*ఆకట్టుకునే కామెడీ
*పంచ్ డైలాగులు
*దర్శకత్వం
*లాస్ట్ లో వచ్చే ట్విస్టులు
బలహీనతలు
*సాగదీత సన్నివేశాలు
*హీరో హీరో యిన్ల మధ్య సంఘర్షణ లేకపోవడం
*హీరోయిన్ అతి నటన
బాటమ్ లైన్: ఒక క్లీన్ ఫ్యామిలీ వెబ్ సీరిస్
రేటింగ్: 2.5/5