https://oktelugu.com/

Aditya L-1 : ఇస్రో ‘ఆదిత్య ఎల్_1’ మిషన్ కు హైదరాబాద్ అండాదండా

తాజాగా 11 మీటర్ల యాంటెన్నా ను కూడా ఇస్రోకు ఈసీఐఎల్ అందజేసింది. ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే గగన్ యాన్, మంగళ్ యాన్_2 పరిశోధనలకు యాంటెన్నాలను సరఫరా చేయనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2023 / 02:34 PM IST

    Aditya L-1

    Follow us on

    Aditya L-1 : హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కోకాపేటలో ఎకరం 100 కోట్ల రికార్డును తన పేరుతో లిఖించుకున్న ఈ నగరం.. శాస్త్ర సాంకేతిక రంగల్లోనూ సత్తా చాటుతోంది. ఇస్రోకు హైదరాబాదులోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. చంద్రయాన్_3 తో పాటు, ప్రస్తుత ఆదిత్య ఎల్_1 మిషన్ లోనూ ఇవి తమ వంతు పాత్ర పోషించాయి.

    అంతరిక్షంలోకి ఇస్రో పంపించిన ఉపగ్రహాలను, బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి అనుసంధానించే యాంటెన్నా లను నగరంలోని ఈసీఐఎల్ సరఫరా చేస్తుంది. ఆదిత్య ఎల్_1 మిషన్ కోసం బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈసీఐఎల్ 32 మీటర్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాను తయారుచేసింది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఆదిత్య ఎల్_1 నుంచి సిగ్నల్స్ ను స్వీకరిస్తుంది. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందిస్తుంది. అంతేకాదు ఎల్_1 పాయింట్ కు చేరుకున్న తర్వాత ఆదిత్య పంపించే సమాచారాన్ని, ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అందజేస్తుంది. తాజాగా 11 మీటర్ల యాంటెన్నా ను కూడా ఇస్రోకు ఈసీఐఎల్ అందజేసింది. ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే గగన్ యాన్, మంగళ్ యాన్_2 పరిశోధనలకు యాంటెన్నాలను సరఫరా చేయనుంది.

    మిధానీ

    ఇస్రో ప్రస్థానంలో తొలి నుంచి మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిధాని) పాత్ర ఉంది. ఉపగ్రహాలు, రాకెట్ల తయారీకి అవసరమయ్యే ప్రత్యేకమైన లోహాలు మిధాని సరఫరా చేస్తోంది. ఆదిత్య ఎల్_1 ను ప్రయోగించిన తర్వాత పిఎస్ఎల్వి సీ_57 రాకెట్ తయారీలో, అనేక ఇతర భాగాలలో మిధాని సరఫరా చేసిన లోహాలను ఇస్రో వాడింది.

    ఎంటీఏఆర్ టెక్నాలజీస్

    నగరానికి చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పీఎస్ ఎల్ వీ57 కు విడి భాగాలను సరఫరా చేసింది. వికాస్ ఇంజన్లు, ఎల్ క్ట్రా న్యూమాటిక్ మాడ్యూల్స్, వాల్వ్ లు, సేఫ్టీ కపులర్స్, నోస్ కోన్ వంటి విడి భాగాలను సరఫరా చేసింది..

    జడ్చర్ల యువ శాస్త్రవేత్త పాత్ర

    హైదరాబాద్ మాత్రమే కాకుండా ఆదిత్య ఎల్ _1 ఉప గ్రహ తయారీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శాస్త్రవేత్త నీల ప్రదీప్ కుమార్ కీలకపాత్ర పోషించారు. మిషన్ సాఫ్ట్ వేర్ కమాండింగ్ విభాగానికి ఆయన టీం లీడర్ గా వ్యవహరించారు. ప్రదీప్ కుమార్ ఇస్రోలో చేరకముందు బాష్ కంపెనీలో భారీ వేతనంతో పనిచేసేవారు. తో సహా జర్మనీలో ఉద్యోగానికి కంపెనీ ఆయనకు అవకాశం ఇచ్చింది. కానీ దాన్ని స్వచ్ఛందంగా వదులుకొని ఇస్రోలో చేరి యువ శాస్త్రవేత్తగా ఎదుగుతున్నారు. ఆదిత్య ఎల్_1 తయారీలో కీలకపాత్ర పోషించారు. భారతదేశ కీర్తిని నలు దిశలా విస్తరించడమే తన ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు.