Vijayakanth Passed Away: నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ నేడు మరణించారు. చెన్నైలోని మియత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణానికి కారణం కరోనా ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. 71 ఏళ్ల విజయకాంత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నవంబర్ 18న దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో మియత్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
20 రోజులకు పైగా ఆయనకు మియత్ లో చికిత్స జరిగింది. దీంతో కన్నుమూశారంటూ పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లపై ఆయన సతీమణి క్లారిటీ ఇచ్చారు. వదంతులు వ్యాపించవద్దని వేడుకున్నారు. డిసెంబర్ 11న విజయకాంత్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
కొద్దిరోజులు బాగానే ఉన్న విజయకాంత్ ఒకటి రెండు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. సడన్ గా ఆయన ఆరోగ్యం మరలా క్షీణించింది. మంగళవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. నేడు ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయకాంత్ 1979లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన మొదటి చిత్రం ఇనిక్కుమ్ లియమై. ఈ చిత్రంలో ఆయన విలన్ రోల్ చేయడం విశేషం. అనంతరం హీరోగా మారి సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 80-90లలో కోలీవుడ్ స్టార్స్ లో విజయకాంత్ ఒకరు. ఆయన సినిమాలకు తెలుగు, హిందీలో కూడా మార్కెట్ ఉండేది. 2005లో ‘దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించాడు. 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన డీఎండీకే పార్టీ కీలకంగా మారింది. అయితే విజయకాంత్ ఒక్కరే గెలిచారు.