
Actor Subba Raju With RK : వారం వారం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ… ఈ ఆదివారం ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదలైంది.. సుబ్బరాజు సినీ రంగంలో ప్రవేశం నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎదుర్కొన్న ఇబ్బందులు దాకా అన్ని ప్రశ్నలు రాధాకృష్ణ అడిగారు.. వీటికి సుబ్బరాజు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
సుబ్బరాజు స్వస్థలం ఆంధ్రాలోని భీమవరం. ఈయన తండ్రి వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎత్తు, పొడవు బాగుండడంతో యాదృచ్ఛికంగా సుబ్బరాజు సినీ రంగంలోకి ప్రవేశించారు.. హీరోకు సంబంధించిన అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఎందుకనో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మిగిలిపోయారు.. మొహమాటం వల్ల దర్శకులను అవకాశాలు అడగకపోవడంతో కెరియర్ అంతంత మాత్రమే సాగింది.. భీమవరం రాజులు అంటే రొయ్యలు, పీతలు, చేపలు, కోడి పందాలు, పేకాటలు ఉంటాయని ఒప్పుకున్న సుబ్బరాజు, కళా రంగంలోనూ రాజులు రాణించారని గుర్తు చేశారు.
అనేక సినిమాల్లో విలన్ గా నటించిన సుబ్బరాజును పలువురు నిర్మాతలు మోసం చేశారు.. పారితోషకానికి సంబంధించి చెక్కులు ఇవ్వడంతో అవి బౌన్స్ అయ్యేవి.. ఇప్పటివరకు ఎన్నో అలాంటి చెక్కులను భద్రపరచుకున్న సుబ్బరాజు.. కొద్దిరోజుల నుంచి అలా చేయడం కూడా మానేశారు.. తనకోసం ఎప్పుడూ పాత్రలు సృష్టించాలని దర్శకులను అడగలేదని చెప్పిన సుబ్బరాజు… నిర్మాతలు ఎవరు తనను నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదని ఒప్పుకున్నాడు. తనకు నటన సెట్ కాకపోతే ఇతర రంగంలోకి వెళ్లేవాడినని ఆర్కే ఎదుట సుబ్బరాజు స్పష్టం చేశాడు. తనకు ఇంతవరకు ఎవరూ నచ్చలేదని, పెళ్లి కూడా చేసుకోనని వివరించాడు.. పెళ్లి అంటే అవసరం కాదని, అది ఒక బాధ్యతలా భావించినప్పుడే చేసుకోవాలని ఆర్కే ఎదుట సూక్తి ముక్తావళి వినిపించాడు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మీ పేరు ప్రస్తావనకు వచ్చింది కదా అని సుబ్బరాజును ఆర్కే ప్రశ్నించినప్పుడు… “ఆ సందర్భంలో నా పేరు బయటకు వచ్చింది.. నేను ఇంట్లో ఉన్నా కూడా నా తలుపు తట్టి నన్ను అడుగుతారు.. అందుకే వారు పిలిచినప్పుడు నేను వెళ్లాను.. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. వాళ్లకి ఏమైనా తేడా అనిపిస్తే జైల్లో వేస్తారు.. నేను కూడా జైలుకే వెళ్దామనుకున్నా.” దీనికి జైలుకు వెళ్తారా అని ఆర్కే అడిగితే… అంతకుమించి మాత్రం నేను చేసేదేముంది అని సుబ్బరాజు బదులు సమాధానం ఇచ్చాడు.. అక్కడితో ప్రోమో ముగిసింది.. చూస్తూ ఉంటే ఈ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓకే అడిగినదానికి, ఎటువంటి మెరుపు లేకుండా సుబ్బరాజు చెప్పిన దానికి లంకె కుదిరింది.