Chandrababu CID Custody: చంద్రబాబును సిఐడి తన కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు, రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించనుంది. అంతవరకు ఓకే కానీ చంద్రబాబు అసలు సిఐడికు సహకరిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు రోజులు పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసిబి కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబును విచారించేందుకు సిఐడి తరఫున 12 మందికి అనుమతిస్తున్నట్లు ఏసిబి కోర్టు తెలిపింది. దాదాపు 30 ప్రశ్నలతో సిఐడి అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సిఐడి అధికారులు పక్కా ప్లాన్ తో వెళ్తుండగా.. చంద్రబాబు ఏ మేరకు సహకరిస్తారా అన్నది ప్రశ్నగా ఉంది.
చంద్రబాబు తరఫున గింజుపల్లి సుబ్బారావు, దొమ్మాలపాటి శ్రీనివాస్ అనే న్యాయవాదులు విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది. 9 మంది విచారణ అధికారులు, ఇద్దరు మధ్యవర్తులు, ఒక వీడియో గ్రాఫర్ విచారణలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రశ్న పత్రంతో సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ప్రతి గంటకు ఐదు నిమిషాలు చొప్పున బ్రేక్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి చంద్రబాబును విచారించారు. ఆ సమయంలో చంద్రబాబు తమకు సహకరించడం లేదని సిఐడి అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తాజా విచారణలో కొత్త వ్యూహాలతో సిఐడి సిద్ధమవుతోంది. దాదాపు 30 అంశాలకు సంబంధించి ప్రశ్నలను సిఐడి చంద్రబాబుకు అడగనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడంపై సిఐడి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. నిధుల విడుదలపై ఫైనాన్స్ అధికారులు వద్దన్నా.. చంద్రబాబు ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారనే అంశంపై సిఐడి ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. ఈ అంశంపైనే గుచ్చి గుచ్చి చంద్రబాబుకు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై 34 అభియోగాలు మోపారు. ఇందులో తప్పుడు పత్రాలు సృష్టించడం, నిధుల మళ్లింపు, సిమన్స్ ఒప్పందం, డాక్యుమెంట్స్ ఫోర్జరీ, నోట్ ఫైల్స్ పై సంతకాలు వంటి అంశాలపై సిఐడి ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
అయితే తాను ఏ తప్పు చేయలేదని.. తనపై నిరాధార ఆరోపణలు, కేసులు నమోదు చేశారని.. రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు బలమైన వాదనలు వినిపించారు. నిన్న ఏసీబీ న్యాయమూర్తికి సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో సిఐడి కి ఎంతవరకు సహకరిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉంది. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మిగతా కేసులకు సంబంధించి సైతం బెయిల్ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపైన సైతం త్వరలో విచారణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు చంద్రబాబు సిఐడి కస్టడీ ప్రాధాన్యత అంశంగా మారిపోయింది.