
ABN RK – Chandrababu : ” జగన్ రెడ్డి భావించినట్టు తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలంటే షర్మిల రూపంలో ప్రతి బంధకం ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన సొంత చెల్లి షర్మిల పోటీపడే అవకాశం ఉంది. అదే జరిగితే వివేకానంద రెడ్డి జీవించి ఉంటే షర్మిలకే మద్దతు ఇచ్చి ఉండేవారని దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. ఈ కారణంగానే ముందుగా వివేక అడ్డు తొలగించుకొని ఆ తర్వాత షర్మిలను బయటకు గెంటారని రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. భారతికి లైన్ క్లియర్ చేసేందుకే ఇదంతా జరిగిందన్న అభిప్రాయం వైఎస్ఆర్ కుటుంబంలో బలంగా ఉంది. సిబిఐ దర్యాప్తు కూడా ఈ కోణంలోనే జరుగుతోంది.” ఇవీ ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులోని వ్యాఖ్యలు. చదువుతుంటే ఏమైనా డిఫరెంట్ గా అనిపించిందా? అసలు 2018లో చంద్రబాబు అధికారంలో ఉన్నాక, జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? ఈ సోయి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు లేదు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది టిడిపి. అప్పటికి తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నాడు. ఆంధ్రజ్యోతి కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా రాసేది. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరుగుతున్న క్రమంలో.. లాజిక్ లెవీ పట్టించుకోకుండా రాధాకృష్ణ ఇలా రాసుకుంటూ పోయాడు..
రాధాకృష్ణ కు చంద్రబాబు మీద భక్తి ఎక్కువ. ఆయన కోసం ఏదైనా రాస్తాడు. ఎలాగైనా రాస్తాడు. చంద్రబాబు భజనలో ఆరి తేరిపోయాడు గనుక పసుపు కొరడాతో ఒళ్లంతా కొట్టుకుంటాడు. రాధాకృష్ణ రాసినట్టు ఒకవేళ భారతిని ముఖ్యమంత్రి అయ్యేందుకు వివేకానంద రెడ్డి ఎందుకు అడ్డుపడతాడు? అప్పటికి జగన్ ఇంకా బెయిల్ మీద బయటే ఉన్నాడు. పైగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో టచ్ లో ఉన్నాడు.. అలాంటప్పుడు ఆయన జైలుకు వెళ్తాడని ఎలా అనుకుంటాడు? ఒక వేళ జైలుకు వెళ్లినా తన భార్యను ముఖ్యమంత్రిని చేస్తాడు. దీనికి షర్మిల ఎందుకు అడ్డుపడుతుంది? ఒకవేళ అలా అడ్డుపడేదే అయితే జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె ఎందుకు యాత్ర చేస్తుంది? కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది?
“వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాజకీయ కారణాలతో ఇప్పటివరకు సిబిఐ మీనమేషాలు లెక్కించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టే అవకాశం లభించడంతో కవితపై చర్యలు తీసుకోవాలంటే అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయక తప్పని పరిస్థితి భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో తెలిసినా ఇప్పటివరకు చర్య తీసుకోకుండా, లిక్కర్ కుంభకోణంలో కవితను మాత్రమే అరెస్ట్ చేస్తే కేసీఆర్ సానుభూతి పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నందున, అవినాష్ రెడ్డి పై చర్యలు తీసుకోవడానికి సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వినబడుతున్నది. హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత అయినా వివేక కేసు తుది దశకు చేరుకుందని అభిప్రాయం కలుగుతున్నప్పటికీ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని శిక్ష నుంచి తప్పించుకోవడంలో డాక్టరేట్ చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు మౌనంగా ఉంటారని అనుకోలేము” ఆర్కే రాసిన ఈ వ్యాఖ్యాల్లో కొంతమేర నిజం ఉన్నప్పటికీ.. కవిత కేసుకు, అవినాష్ కేసుకు లంకె ఎలా కుదురుతుందో ఆర్కే మర్చిపోయాడు.. ఒకవేళ ఆర్కే చెప్పినట్టు కెసిఆర్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తాడు అనుకుంటే.. కేంద్రం లిక్కర్ స్కాంను తెరపైకి తీసుకొచ్చేదే కాదు కదా! జగన్ అండ్ కోతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు, అవినాష్ రెడ్డి పై ఎందుకు ఒత్తిడి తెస్తారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఉక్క పూతకు గురిచేస్తారు.
మొత్తానికి ఆర్కే కొత్త పలుకు వ్యాసంలో కొన్ని నిజాలు ఉన్నాయి. కానీ వాటికి మసాలా బాగా దట్టించడంతో నిజాలు మరుగున పడిపోయి.. చంద్రబాబు స్తుతి కీర్తనలు తెరపైకి వచ్చాయి.. ఇంత రాసిన ఆర్కే.. చంద్రబాబు స్టే లు ఎందుకు తెచ్చుకుంటున్నాడో మాత్రం చెప్పడు. ఎందుకంటే అది బాబు భక్తి కనుక.