Village Life: చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడి కిరణాలు.. తొలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ అంటూ వినిపించే భక్తి గేయాలు.. వాకిలి ఊడ్చి కల్లాపి చల్లే అమ్మ.. దొడ్లో ఉన్న ఆవు పాలు పితికి ఇంట్లోకి తెచ్చే నాన్న.. కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసే నానమ్మ.. ఆరు బయట పడుకుని తెల్ల వారగానే ఇంట్లోకి వచ్చే తాత.. ఉదయాన్నే బుద్ధిగా చదువుకునే పిల్లలు.. ఉత్సాహంగా పొలం పనులకు వెళ్లే కుటుంబ సభ్యులు.. ఇలా పల్లె జీవనం గురించి ఎన్నయినా చెప్పొచ్చు. ఎంతయినా చెప్పొచ్చు. అమ్మంటే ప్రేమ, నాన్నంటే భయం, పెద్దలంటే గౌరవం, స్నేహితులంటే ఇష్టం, ఉపాధ్యాయులంటే మర్యాద.. ఈ లక్షణాలు స్వతహాగా అభివృద్ధి ఆరోజుల్లోనే.. అంటే ఇప్పటి తరానికి ఆ లక్షణాలు లేవా అంటే? ఉన్నాయీ కానీ వాటిని అలవర్చుకునే విధానం పూర్తిగా మారింది.
ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నాటి జ్ఞాపకాలు కూడా నేడు కళ్ళముందు మెదులుతున్నాయి. కొంతమంది ఔత్సాహికులు పల్లె జీవనాన్ని, అక్కడి ప్రజల స్థితిగతులను నేటి మిలినియల్ తరానికి చెప్పడానికి, సజీవంగా చూపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా వారు షూట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో అక్కడి ప్రజల స్థితిగతులను ఆ వీడియో కళ్ళకు కట్టింది.
సూర్యుడు ఉదయిస్తుండగానే లేచే పల్లె జనం.. ఆ నును వెచ్చని సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ ఆవు పాలు పితికే ఇంటి పెద్ద.. కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసే అమ్మ.. ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళే కుటుంబ సభ్యులు.. పొలాన్ని తడిపే సూక్ష్మ బిందువులు.. శ్రమైక జీవనాన్ని చాటి చెప్పే పూరిళ్ళులు..ఇలా ఆ పల్లెల్లో ప్రతీదీ ఓ అద్భుతమే. నడ మంత్రపు అభివృద్ధి ఆ పల్లెకు దూరంగా ఉంది కావచ్చు.. అందుకే ఆ ఊరు తన ఆస్తిత్వాన్ని ఇంకా కోల్పోలేదు.. ఇన్ స్టా గ్రామ్ లో యాష్ చౌదురి అన్న వ్యక్తి పోస్ట్ చేసిన రాజస్థాన్లోని ఆ గ్రామానికి సంబంధించిన వీడియోలో చాలా విషయాలను మర్చిపోతున్నాం. మనం వేటిని విస్మరిస్తున్నామో ఆ పల్లె ప్రజలు చేతల ద్వారా మనకు చూపించారు. రాత్రంతా స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోయి.. బారెడు పొద్దెక్కినా నిద్ర లేవలేక పోతున్నామని.. సూర్యుడు నుంచి డి విటమిన్ స్వీకరించలేకపోతున్నామని. . గ్యాస్ పొయ్యి మీద వంటకు అలవాటు పడి మనదైన కట్టెల పొయ్యి మీద వంట రుచి చూడలేకపోతున్నామని.. స్వచ్ఛమైన ఆవుపాల రుచిని కోల్పోతున్నామని.. అన్నింటికీ ఆరు బయట నిద్రకు దూరమవుతున్నామని..మేడలు, మిద్దెల నిర్మాణాల్లో పడి మన మూలాలు మర్చిపోతున్నామని.. ఇలా చాలా విషయాలను ఆ పల్లె ప్రజలు మనకు గుర్తు చేస్తున్నారు. అన్నట్టు ఈ వీడియోలో కనిపించిన ఓ తాత వయస్సు 80కి దగ్గరలో ఉంటుంది. ఎప్పటికీ ఆయన తలపాగా చుట్టుకుని, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. పైకి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పల్లెల్లో మనం ఎందుకు బతకాలో చెప్పేందుకు.. అందుకే అంటారు ఉన్న ఊరు, కన్నతల్లి.. ఈ రెండింటి పేగు బంధం చాలా బలమైనదని.. అనట్టు ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.