https://oktelugu.com/

Nenavath Surya Naik: బహుజన బిడ్డ లాకప్ డెత్ జరిగినా.. స్పందన లేదా? ఏం జరుగుతోంది?

తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. తొలివెలుగు రఘు ఇంకా గత ప్రభుత్వ తప్పిదాలను తవ్వి తీసే పనిలో ఉన్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 12, 2023 / 12:08 PM IST

    Nenavath Surya Naik

    Follow us on

    Nenavath Surya Naik: ప్రశ్నించడం అనేది గొప్ప లక్షణం. ఆ ప్రశ్న ద్వారానే ఎన్నో సమాధానాలు బయటకు వస్తాయి. ఆ సమాధానాల ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడే సమాజం ఒక సరైన దిశలో నడుస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో అలా ప్రశ్నించే వారి సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి. మొన్నటిదాకా తీన్మార్ మల్లన్న, తొలి వెలుగు రఘు, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు భారత రాష్ట్ర సమితి తప్పులను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టేవారు. అలా అవి జనంలోకి బాగా చొచ్చుకు వెళ్లడం వల్ల ఒక చర్చ జరిగేది. అంతిమంగా పాలక పక్షం రంగంలోకి దిగి ఆ సమస్య పరిష్కారానికి చొరవ చూపేది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలు నిశ్శబ్దం పాటిస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. తొలివెలుగు రఘు ఇంకా గత ప్రభుత్వ తప్పిదాలను తవ్వి తీసే పనిలో ఉన్నాడు.. సరిగ్గా ఇదే సమయంలోనే అంటే గతంలో భారత రాష్ట్ర సమితి డప్పు కొట్టిన వాళ్లు ఇప్పుడు ప్రశ్నించే గొంతుకల అవతారం ఎత్తారు.

    ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో నేనావత్ సూర్య నాయక్ అనే గిరిజనుడు లాకప్ డెత్ కు గురయ్యాడు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇది జరగడంతో.. ఒక సెక్షన్ మీడియా ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడింది. అటు మొదటిదాకా అధికారిక మీడియా గా చలామణి అయిన ఓ వర్గం మీడియా కూడా ఈ విషయాన్ని అంతగా బయటకు తీసుకురాలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని మొదటి దాకా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసిన కొంతమంది యూట్యూబర్లు ఈ విషయంలో వేగంగా స్పందిస్తున్నారు.. ఒక బహుజనుడు హత్యకు గురైతే మిగతావారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో గతంలో ఇదే నల్లగొండ జిల్లాలో మరియమ్మ అనే ఒక దళిత మహిళ లాకప్ డెత్ కు గురైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్న గొంతుకలు అప్పుడు నిశ్శబ్దాన్ని పాటించాయి.. ఆ సంఘటనను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ప్రతిఘటించడం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవడంతో మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగింది. ఆ ఘాతుకానికి పాల్పడిన పోలీసులపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. అంతే కాదు సిద్దిపేటకు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కూడా అప్పట్లో లాకప్ డెత్ కు గురయ్యాడు.. ఈ విషయంలో కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్న గొంతుకలు అప్పుడు నిశ్శబ్దాన్ని పాటించాయి.

    అధికారాన్ని బట్టి..

    తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు తమ అధికార స్థాయిని బట్టి వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మేధావులు, మరి కొంతమంది యూట్యూబర్లు తెరమీదకి వేగంగా వచ్చేవారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే వెంటనే ప్రశ్నించేవారు. ఓ వర్గం మీడియా కూడా వారికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేది. అప్పట్లో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే వారంతా దీనిని ఖండించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో ప్రశ్నించిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారు ఇప్పుడు ప్రశ్నించే గొంతుకల అవతారం ఎత్తారు. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రశ్న అనేది గొప్పది.. దాన్ని సమాజంలోకి తీసుకుపోవడమనేది ఇంకా గొప్పది. అలాంటప్పుడు ఆ ప్రశ్నలు సామాన్య జనం తమ తలకెత్తుకుంటేనే పరిష్కారం లభిస్తుంది. అంతేగాని తమ ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతుకల అవతారం వెళ్తే వారిని అనుసరిస్తే మాత్రం చివరికి నిరాశే మిగులుతుంది.