https://oktelugu.com/

Secret Story : 50 సంవత్సరాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఒక ప్రేమ, ద్వేషం, హత్యల కథ తెలుసా?

పైగా ఆ రోజుల్లో ఒక మహిళను చంపేందుకు సుపారి మాట్లాడటం.. అందులోనూ అది వివాహేతర సంబంధం వల్ల కావడం.. ఢిల్లీ కోర్టు కూడా దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడం వల్ల.. జనానికి ఆసక్తి కలిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 11:01 PM IST
    Follow us on

    secret story : ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఒక వ్యక్తిని యధాతధంగా అంగీకరించడం.. అలాంటి ప్రేమ ద్వేషాన్ని కోరుకుంటుందా? ఒక మనిషిని చంపేలా పురిగొల్పుతుందా? వీటన్నింటికీ 1973 ఢిల్లీలో జరిగిన ఓ దారుణ సంఘటనే సమాధానం. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది? అది దేశాన్ని ఎందుకు కుదిపేసింది? ఈరోజుకు ప్రస్తావనకు వస్తే అప్పటి మీడియా ప్రతినిధులు ఎందుకు వణికి పోతారు? ఎందుకంటే ఆ నేరం జరిగిన తీవ్రత అటువంటిది కాబట్టి.. సాధారణంగా మన దైనందిన జీవితంలో చదివే వార్తాపత్రికల్లో ఎన్నో నేరమయ కథనాలు చదువుతుంటాం.. కొన్ని కథనాలు ఇబ్బంది పెడితే.. మరికొన్ని కథనాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.. అలాంటి కథనమే ఇది.

    అది 1973.. శీతాకాలం.. దక్షిణ ఢిల్లీ లోని డిఫెన్స్ కాలనీ.. చలితో గజగజ వణికి పోతోంది. సమయం రాత్రి ఏడు గంటలవుతోంది. భారత రాష్ట్రపతి వీవీ గిరికి నేత్ర వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ నరేంద్ర సింగ్ జైన్ తన భార్య విద్యా జైన్(45)తో కలిసి తన సోదరిని కలిసేందుకు బయటకు వచ్చారు. వారిద్దరూ గేట్ నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు పార్కు చేసిన కారు వద్దకు వెళ్లారు. కారు కోడి డోర్ వైపు నరేంద్ర సింగ్ జైన్ వెళితే.. ఎడమ వైపు ఆయన భార్య విద్యాజైన్ వెళ్ళింది. ఈలోగా అతడు కారు డోరు తీసి.. వాహనాన్ని స్టార్ట్ చేస్తాడు.. కానీ తన భార్య కారులోకి ఎక్కకపోవడంతో ఆందోళన చెంది కిందికి దిగి చూస్తాడు. ఆమె అక్కడ కనిపించదు.. కారు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో ఓ వ్యక్తి నరేంద్ర జైన్ వైపు తుపాకి చూపిస్తూ మరో వ్యక్తితో కలిసి పారిపోతాడు. అయితే ఆ వ్యక్తి వచ్చిన డ్రైనేజీ కాలువలో విద్యా జైన్ అచేతనంగా పడి ఉంటుంది. అతి కష్టం మీద నరేంద్ర జైన్ ఆమెను బయటకు తీస్తాడు. వెంటనే తన కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని నిర్ధారిస్తారు. పైగా ఆమె ఒంటి మీద 14 వరకు కత్తిపోట్లు ఉంటాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె సంఘటన స్థలంలోనే చనిపోయిందని వైద్యులు చెబుతారు.. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయి.

    నరేంద్ర జైన్ కు చంద్ర శర్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంటుంది. ఆమెకు గతంలో రెండు వివాహాలు జరిగినప్పటికీ.. అవి మధ్యలోనే పెటాకులయిపోయాయి. దీంతో చంద్రేష్ శర్మ నరేంద్ర జైన్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. పెళ్లికి ముందే నరేంద్ర జైన్ చంద్రేశ్ శర్మతో వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు. పైగా చంద్రేశ్ శర్మను తన వ్యక్తిగత సహాయకురాలిగా నరేంద్ర జైన్ నియమించుకుంటాడు. విద్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా.. నరేంద్ర జైన్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ విషయం విద్యకు తెలుస్తుంది. భర్తతో గొడవపడి చంద్రేష్ శర్మ ను విధుల నుంచి తొలగించి బయటికి పంపిస్తుంది. అయినప్పటికీ నరేంద్రజైన్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే తన బంధానికి విద్య అడ్డుగా ఉందని ఆమెను తొలగించుకోవాలని చంద్రేశ్ శర్మ, నరేంద్ర జైన్ భావిస్తారు.

    డిసెంబర్ 4 1967 లో నరేంద్ర జైన్, చంద్రేశ్ శర్మ రాకేష్ అనే వ్యక్తిని కలుస్తారు.. అతడి ద్వారా రాంజీ అనే వ్యక్తికి సమాచారం పంపిస్తారు. వారంతా చాందిని చౌక్ లోని న్యూ వింగ్ రెస్టారెంట్ వద్ద కలుస్తారు.. అనంతరం విద్యా జైన్ ను చంపే ప్రణాళిక గురించి చర్చిస్తారు. అప్పటికే చంద్రేశ్, భగీరథ్, కళ్యాణ్, ఉజాగర్, కర్తార్ అనే వ్యక్తులతో చర్చిస్తూ ఉంటుంది. ఈలోగా నరేంద్ర జైన్ ఉజాగర్ అనే వ్యక్తి తో మాట్లాడతాడు. ప్రణాళిక సక్రమంగా అమలు చేయాలని హెచ్చరించి వెళ్తాడు. కోరుకున్న మొత్తాన్ని ఇస్తానని చెప్పి, కేసు కాకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు.

    నరేంద్ర జైన్ వెళ్ళిన తర్వాత చంద్రేష్ ఇతర వ్యక్తులతో మాట్లాడి.. తాను కూడా సాయంత్రం 6:30 నిమిషాలకు డాక్టర్ జైన్ ఇంటికి చేరుకుంటానని.. అతడి ఇంటి వెలుపల కాపుగాస్తానని చెబుతుంది. అంతేకాదు నరేంద్ర జైన్ కు గాయాలు కాకుండా విద్యను చంపాలని ఉజాగర్, కర్తార్ కు సూచిస్తుంది. రెస్టారెంట్ నుంచి రాంజీ, భగీరథ్, కళ్యాణ్ టాక్సీలో బోగల్ ప్రాంతానికి బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చేరుకుని అక్కడ నిర్దేశించుకున్న విధంగా విద్యను చంపేస్తారు..

    వాస్తవంగా ఈ ఘటనలో పోలీసులకు ముందే ఒక స్పష్టమైన ఆధారం లభించింది. ఒకవేళ విద్యను చంపుతుంటే నరేంద్ర జైన్ ఎందుకు వారిని ప్రతిఘటించలేదు? నరేంద్ర జైన్ కు ఒక్క గాయం కూడా ఎందుకు కాలేదు? అంత జరుగుతున్నప్పటికీ అతడు ఒక ప్రేక్షకుడి లాగా ఎందుకు ఉన్నాడు? ఈ సందేహాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి. చంద్రేష్ శర్మ నరేంద్ర జైన్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఆమెకు జీతం కంటే ఎక్కువ నగదు ఇచ్చేవాడు. ఆమె బ్యాంకు ఖాతాలో చెక్కులు జమ చేసేవాడు. నరేంద్ర, చంద్రేష్ మధ్య వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకే విద్యను చంపేందుకు కుట్రపన్నారు.

    కేసును కోర్టు విచారించిన అనంతరం నరేంద్ర జైన్, చంద్రేష్ శర్మ, రాకేష్ కౌశిక్, భగీరథ్, కళ్యాణ్ గుప్త, కర్తార్ సింగ్, ఉజాగర్ సింగ్ పై భారతీయ శిక్షాస్మృతి 1860, 120 బీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. అయితే విద్యా జైన్ మరణానికి ఉజాగర్, కర్తార్ కారణమని ఢిల్లీ హై కోర్టు భావిస్తూ 1977 సెప్టెంబర్లో వారికి మరణశిక్ష విధించింది. ఉజాగర్, కర్తార్ తమకు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు కొట్టి వేసింది. అక్టోబర్ 9 1983న వారిద్దరిని ఉరితీసారు. ఉరిశిక్షకు ముందు ఉజాగర్, కర్తార్ ను కొంతమంది విలేకరులు కలవగా.. “ఈ నేరంలో సూత్రధారులు, పాత్రధారులు ధనవంతులు కాబట్టి తప్పించుకున్నారు. మేము పేదవాళ్లం కాబట్టి మరణిస్తే మేము పేదవాళ్లం కాబట్టి మరణ శిక్ష అనుభవిస్తున్నామని” వ్యాఖ్యానించారు.

    జైన్, చంద్రేష్ శర్మ, మిగతా నిందితులకు (గుప్తా మినహా) కోర్టు జీవిత ఖైదు విధించింది. కొంతకాలానికి వారు బయటకి వచ్చారు. కానీ ఈ కేసు మిగిల్చిన శేష ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఆరోజుల్లోనే కాదు ఈ రోజుల్లోనూ వివాహేతర సంబంధాలు తీవ్రంగా ఉన్నాయి. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం.. అంతిమంగా పోలీసులకు దొరికిపోవడం.. పోలీస్ స్టేషన్లలో శిక్ష అనుభవించడం.. కోర్టుల్లో అపరాధ భావం ఎదుర్కోవడం.. అయినప్పటికీ మనుషులు మారడం లేదు. అయితే ఇలాంటి నేరాల్లో డబ్బున్న వారికి న్యాయం త్వరగానే దక్కుతోంది. కానీ పేదవారికి అది తీరని శిక్షగా మిగులుతోంది. అంటే ఇక్కడ మా ఉద్దేశం చంపమని కాదు. నరేంద్ర జైన్ కేసు అంతటి సంచలనానికి దారి తీయడానికి ప్రధాన కారణం అతడు సమాజంలో స్థితిమంతుడు. రాష్ట్రపతికి వ్యక్తిగత వైద్యుడు.. పైగా ఆ రోజుల్లో ఒక మహిళను చంపేందుకు సుపారి మాట్లాడటం.. అందులోనూ అది వివాహేతర సంబంధం వల్ల కావడం.. ఢిల్లీ కోర్టు కూడా దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడం వల్ల.. జనానికి ఆసక్తి కలిగింది. ఆరోజు కోర్టు తీర్పు వెలు వరిస్తున్నప్పుడు.. న్యాయస్థానం బయట ప్రజలు ఎదురు చూశారంటే.. ఆ సంఘటన వారిపై ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.