Tamil Nadu: తప్పిపోయిన బిడ్డ చెంతకు వస్తే.. తల్లి ఆనందమే వేరు! ఏనుగు, పిల్ల ఏనుగు కలిసిన వీడియో వైరల్

తమిళనాడు రాష్ట్రంలోని అన్నామలై టైగర్ రిజర్వాయర్ లో ఏనుగులు విస్తారంగా ఉంటాయి. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఏనుగులు అందులోనే ఆహారాన్ని సంపాదించుకొని తింటూ ఉంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : January 3, 2024 6:31 pm

Tamil Nadu

Follow us on

Tamil Nadu: ఈ సృష్టిలో అత్యంత మధురమైనది అమ్మ ప్రేమ. ఆ ప్రేమను ఇంకెవరూ భర్తీ చేయలేరు. ఆ అనురాగాన్ని ఇంకెవరూ ఇవ్వలేరూ.. అందుకే అమ్మ అన్నది కమ్మని మాట.. ఆమె ప్రేమ మమతల మూట అనే పాట పుట్టింది. అలాంటి తల్లి తన బిడ్డల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది. ఎంతటి కష్టాలైనా ఓర్చుకుంటుంది. బిడ్డ కనిపించకుండా పోతే కన్నీరు పెడుతుంది. పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా పస్తులు ఉంటుంది. బిడ్డ కోసం ఆత్రుతగా వెతుకుతూ ఉంటుంది. కేవలం మనుషులు మాత్రమే కాదు.. పశువుల్లో కూడా అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది. అయితే ఓ జంతువు తన బిడ్డ కోసం చూపించిన ప్రేమ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే తప్పిపోయిన ఆ బిడ్డను తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీశాఖ మాములు ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నమే ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపిస్తున్నది.

తమిళనాడు రాష్ట్రంలోని అన్నామలై టైగర్ రిజర్వాయర్ లో ఏనుగులు విస్తారంగా ఉంటాయి. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఏనుగులు అందులోనే ఆహారాన్ని సంపాదించుకొని తింటూ ఉంటాయి.. అయితే ఇటీవల ఒక చిన్న ఏనుగు పిల్ల తప్పిపోయి ఆ అడవి నుంచి బయటకు వచ్చింది. దీంతో దాని తల్లి అడవి మొత్తం తిరగడం ప్రారంభించింది. తన బిడ్డ ఆచూకీ కోసం తాపత్రయ పడింది. నీరు ముట్టకుండా, తిండి తినకుండా కంటనీరుతో అడవి మొత్తం ఆర్తనాదాలు చేయసాగింది. ఇది అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రూప్ కెమెరాలలో రికార్డు కావడంతో వారికి తెలిసింది. దీంతో అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ తల్లి ఏనుగు జాడను పసి గట్టడం ప్రారంభించారు. ఇలా రెండు మూడు రోజుల తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. కిలోగా వారి సంరక్షణలో ఉన్న చిన్న ఏనుగు పిల్లను అత్యంత జాగ్రత్త చర్యల మధ్య దానిని తల్లి వద్దకు చేర్చారు. ఎప్పుడైతే ఆ బుల్లి ఏనుగు పిల్లను చూసిందో అప్పుడు ఆ తల్లి ఏనుగు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బుల్లి ఏనుగులు దగ్గరికి తీసుకుని తొండంతో ప్రేమగా నిమిరింది. చాలాసేపు అలానే తన వద్ద ఉంచుకుని ఆ తర్వాత దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది. తల్లి ముందు వెళ్తుంటే ఆ చిన్న ఏనుగు పిల్ల అనుసరించింది.

అటవీశాఖ చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ను సుప్రియ సాహూ అనే ఐఏఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు. తమిళనాడు అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు తల్లి ఏనుగును, ఏనుగును ఒక దగ్గరికి చేర్చారని.. దీనికోసం వారు డ్రోన్ కెమెరాలు, రెస్క్యూ ఆపరేషన్ చేశారని ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చారు. వారు ఇప్పటికీ కూడా అడవిలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ రామసుబ్రహ్మణ్యన్, భార్గవ తేజ, మణికంఠన్ అనే అధికారుల ఆధ్వర్యంలో జరిగిందని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తల్లిని, ఆమె బిడ్డను ఒకే దగ్గరికి చేర్చిన అటవీశాఖ అధికారులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..