https://oktelugu.com/

Rajamahendravaram: పైన చీకటి.. కింద గోదావరి.. గాలిలో ప్రాణాలు..గుండె చెమ్మగిల్లే బాలిక కథ ఇది

గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సుహాసిని (36) భర్తతో విభేదాల వల్ల విడిపోయింది.. కూలి పనులు చేసుకుంటూ కుమార్తె కీర్తనతో కలిసి ఉంటోంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 7, 2023 / 12:49 PM IST

    Rajamahendravaram

    Follow us on

    Rajamahendravaram: కన్నీరే కన్నీరు పెట్టుకునే సందర్భం ఇది. బాధే బాధపడే నేపథ్యం ఇది. తల్లి తండ్రి తో విభేదాల వల్ల రెండు సంవత్సరాల క్రితమే విడిపోయింది. ఆ బాలిక వయసు అప్పటికి 11 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమె తల్లికి మరొక వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో కలిసి జీవించడం ప్రారంభించారు. తనువులు కూడా కలవడంతో ఆ బాలిక తల్లి గర్భం దాల్చింది. జెర్సీ అనే బాలికకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బాలికకు ఏడాది వయస్సు. హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని కుదుపు ఆ బాలిక ఆడియాసలు చేసింది. కళ్ళముందే తల్లిని, చెల్లిని తనకు దూరం చేసింది. అంతే కాదు తాను కూడా చావు నోట్లో తల పెట్టి వచ్చింది. చివరికి ఒంటి చేత్తో ప్రాణాలు కాపాడుకుంది.

    గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సుహాసిని (36) భర్తతో విభేదాల వల్ల విడిపోయింది.. కూలి పనులు చేసుకుంటూ కుమార్తె కీర్తనతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కాస్త సహజీవనానికి దారి తీసింది. సురేష్ వల్ల సుహాసిని గర్భం దాల్చింది. ఏడాది క్రితం జెర్సీ అనే బాలికకు జన్మనిచ్చింది. ఇటీవలి కాలం నుంచి సుహాసిని కి, సురేష్ కు విభేదాలు తలెత్తాయి. అవి చినికి చినికి గాలి వాన లాగా మారిపోయాయి. ఫలితంగా సుహాసినిని, ఆమె పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఇందులో భాగంగా తన ప్రణాళికను ఆచరణలో పెట్టాడు.

    దుస్తులు తీసుకుందామని చెప్పి సుహాసిని, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని సురేష్ కారులో రాజమండ్రి తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం దాకా వారిని నగరం మొత్తం తిప్పాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి పిల్లలతో సహా రేయిలింగ్ పిట్ట గోడ వద్ద నిలబెట్టాడు. తర్వాత ఒక్కసారిగా వారిని నదిలోకి తోసేసాడు. వారిలో సుహాసిని, జెర్సీ నీటిలో పడిపోయారు. కీర్తనకు మాత్రం వంతెన పక్కన కేబుల్ పైపు అందడంతో దానిని గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడుతూనే.. ఎవరైనా సహాయం చేస్తారేమోనని గట్టిగా కేకలు వేసింది.

    కీర్తన ఎంత కేకలు వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పైకి చూస్తే చీకటి. కింద గోదావరి. ప్రాణాలు.. ఇంతలో తన జేబులో ఉన్న ఫోన్ గుర్తుకు వచ్చింది. ఒక చేత్తో పట్టు తప్పిపోకుండా పైపు పట్టుకుంది. మెల్లగా రెండవ చేత్తో ఫోన్ బయటికి తీసి కింద పడిపోకుండా జాగ్రత్త పడింది. “డయల్ 100” కి ఫోన్ చేసి తన పరిస్థితిని తెలియజేసింది. దీంతో రావులపాలెం ఎస్సై వెంకటరమణ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఆ బాలికను రక్షించాడు.. సుమారు అరగంట పాటు చీకట్లో ఆమె పైపు ఆధారంతో వేలాడుతూ ఉండటమే కాక.. ఫోన్ చేసి చెప్పిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. గోదావరిలో గల్లంతయిన వారికోసం ఒక బృందాన్ని, నిందితుడి కోసం మరొక బృందాన్ని ఏర్పాటు చేశామని సీఐ రజిని కుమార్ వెల్లడించారు.